- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారి దీపాలను కాపాడుకుందాం...
స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చందుకు బెదిరింపులు, ట్రోలింగ్ దాడులు చేయడం బాధ్యతారాహిత్యం. తమ అభిప్రాయాలను స్పష్టంగా, నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తూ జ్ఞాన కాంతులు విరజిమ్మే ఇలాంటి దారి దీపాలను కాపాడుకోకపోతే మన సమాజానికి భవిష్యత్తు ఉండదని గ్రహించాలి. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం.. పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం అని ప్రముఖ విప్లవ రచయిత శ్రీ శ్రీ ఏనాడో పేర్కొన్నారు. విమర్శ, విశ్లేషణ, ప్రశ్న, ప్రతిఘటనకు తగిన ప్రాతిపదికను అందించి ప్రశ్నించే గొంతులకు నైతికతతో కూడిన చట్టబద్ధతను శ్రీశ్రీ గొప్పగా అందించారు. ప్రస్తుత కాలంలో మరొక అడుగు ముందుకు వేసి పాలనా వైఫల్యాలు, పెట్టుబడిదారుల, కార్పొరేట్ శక్తుల దోపిడి, ముమ్మరంగా కొనసాగుతున్న ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ధ్వంసం, రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యం కావడం వంటి అంశాల పైన మాట్లాడాలంటే అందుకు బాధ్యులైన పాలకులను తప్పక ప్రస్తావించవలసి ఉంటుంది. ఇది దేశం పట్ల, వ్యవస్థ పట్ల సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి విమర్శ మాత్రమే కానీ వ్యక్తిగత ఆరోపణ, విమర్శ, నింద, దాడిగా భావించడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రతి అంశాన్ని సవాలుగా తీసుకొని సమాధానం ఇవ్వడానికి సిద్ధపడిన సందర్భంలో ప్రతి విమర్శ కూడా సహేతుకంగానూ ఆలోచించదగినదిగాను అభివృద్ధికి బాటలు వేసేదిగాను ఉంటుంది. ఆ విమర్శ చర్చ నుండి ప్రగతి, మార్పు, సంస్కరణకు దారితీస్తుంది కూడా.
కానీ భారతదేశంలో గత ఒకటి రెండు దశాబ్దాలుగా గమనించినప్పుడు ముఖ్యంగా కవులు, రచయితలు, కళాకారులు, మేధావులతో పాటు జర్నలిస్టులు, పత్రికా సంపాదకులపై ప్రభుత్వ పెట్టుబడిదారీ అనుకూల శక్తుల దాడులను గమనించవచ్చు. లోపాలను విమర్శిస్తే, అక్రమాలను ప్రశ్నిస్తే, ఆగడాలను ప్రజల ముందు పెడితే తట్టుకోలేని సందర్భంలోనే ఇలాంటి దాడులు జరగడం కొన్నిచోట్ల ప్రాణాలు తీయడాన్ని మనం పసిగడితే, ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించే గొంతుకలను కాపాడుకున్నప్పుడు మాత్రమే పాలకులు, పెట్టుబడిదారులు, దోపిడీ ముఠాలు తోక ముడుచుకుని పారిపోతాయి అని గుర్తిస్తే మంచిది. ఆ సహనం ఐక్యత ఓపిక నేర్పు దృఢత్వం పట్టుదల ప్రజలు ప్రజాస్వామిక వాదులు తమ సొంతం చేసుకున్నప్పుడు మాత్రమే తమ జ్ఞాన సంపదతో జ్ఞాన కాంతిని విరజిమ్ముతున్న దారి దీపాలను అక్రమార్కుల నుండి కాపాడుకునే అవకాశం ఉంటుంది.
తులసి చందు చేసిన నేరమేంటి?
స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చందు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొంతకాలంగా ప్రజా క్షేత్రంలో పనిచేస్తూ సామాజిక, రాజకీయ, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక, పాలనాపరమైనటువంటి అంశాల పైన తనదైన శైలిలో హేతుబద్ధంగా ఆలోచిస్తూ, కారణాలను విశ్లేషిస్తూ, పరిష్కారాలు సూచిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఆమె వీడియో ప్రసంగాలు ప్రజానీకానికి, ప్రజాస్వామికవాదులకు, ప్రజాస్వామ్య శక్తులకు, ప్రజా సంఘాలకు అఖిలపక్షాలకు చెందిన మేధావులు, రచయితలకు, ఇలా మెరుగైన సమాజాన్ని కోరుకునే ప్రతి వ్యక్తికి నిరంతరం కాంతిని ప్రసరిస్తూనే ఉన్నవి. ఆమె భావజాలంతో ఏకీభవించే వారికి మాత్రమే కాదు.. దోపిడీని, పీడనను, పాలకవర్గాల కుట్రలను తెలుసుకునే ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఆ ప్రసంగాలు జ్ఞాన భాండాగారాలే. అయితే రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు మేరకు తన ప్రతిభ ఆధారంగా సమీకరించిన జ్ఞానాన్ని సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసంగించినప్పుడు, వివరించినప్పుడు, విశ్లేషణ చేసినప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. ఆధారం లేకుండా మాట్లాడే అవకాశం లేదు. జర్నలిస్టులు సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో పర్యటించి, తమదైన శైలిలో కొన్ని వర్గాలకైనా ఉపయోగపడుతుందని ఆకాంక్ష ఆరాటంతో చేసే రచనలు, ప్రసంగాలు, పత్రికా కథనాలు, ప్రచురణలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి.
హెచ్చరించడం అంటే.. లోపాన్ని ఒప్పుకున్నట్టేనా?
కానీ ఇలాంటి వీడియోల వల్ల తమ వైఫల్యాలు బయటపడుతున్నాయని భయపడి, తమ మనుగడకు ప్రమాదం ముంచుకొస్తున్నదని గుర్తించి నైతికంగా గెలవలేక దొడ్డి దారిలో బెదిరించడం అమానుషం. లొంగదీసుకోవడం, వెంటాడడం, వేటాడడం, భయపెట్టడం వంటి చర్యలకు ఎక్కడ ఎవరు పాల్పడినా చరిత్ర క్షమించదు. తులసి చందు కూడా చిన్న వయసులో ఆమె తన జ్ఞానాన్ని అపరిమితంగా సమీకరించుకొని సమాజాన్ని చైతన్యవంతం చేసే బాధ్యతలో ముందు వరుసలో నిలబడి అంబేద్కరిజం, మార్క్సిజం, బుద్ధిజంపై విశ్లేషణలతోపాటు పాలనా లోపాలు, ఎన్నికల వైఫల్యాలు, వాగ్దానాలు ప్రలోభాలు, హామీల పేరుతో ప్రజలను మోసగిస్తున్న విధానాలు, ప్రజాధనం దుర్వినియోగం, ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం వంటి అనేక అంశాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయడం నేరం ఎలా అవుతుందో మతతత్వ శక్తులు అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాత్కాలికంగా అస్త్ర బలం, అంగ బలం, డబ్బు బలం, అధికార బలంతో తులసి వంటి వారిని అణచివేయాలని కుట్ర పన్నినా అది శాశ్వతంగా ఓటమికి దారితీస్తుందని వీరు గుర్తిస్తే మంచిది. పరువు ప్రతిష్టలు దిగజారినప్పుడు, వ్యక్తిగత విమర్శ చేసినప్పుడు నిలదీసి అడిగితే తప్పులేదు. కానీ సామూహిక అంశాలపైన బాధ్యతాయుతంగా మాట్లాడినప్పుడు బెదిరించడం అంటే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని గ్రహించడమే కదా! హెచ్చరించడం అంటే తమ లోపాన్ని అంగీకరించడమే ! అసహనం వ్యక్తం చేయడం అంటే సహించేతత్వాన్ని కోల్పోవడమే అని ఆ వర్గాలు గుర్తిస్తే మంచిది.
ప్రజలే కాపాడుకోవాలి..
వర్గ పోరాటం ప్రతిచోట అనివార్యమైన నేపథ్యంలో ప్రశ్నించే వాళ్లను ప్రజలను చైతన్యం చేసే మేధావులను బెదిరించే వాళ్ళు ఉంటారనే సోయి ఆలోచన ప్రజలకు, ప్రజా ఉద్యమకారులకు ఉండాల్సిన అవసరం ఉంది. దీపాన్ని కాపాడుకుంటే వెలుతురునిచ్చినట్లు సమర్థులు, ప్రతిభావంతులతోపాటు సామాజిక బాధ్యత గల కొన్ని వర్గాలను కాపాడుకోవడం ద్వారా భావితరాలకు కూడా భవిష్యత్తును ఇచ్చిన వారం అవుతాము. ప్రజా చైతన్యాన్ని ఇనుమడింప చేసుకోవడం ద్వారా అసాంఘిక శక్తులను అడ్డుకునే క్రమంలో ఉద్యమ కార్యాచరణకు పూనుకున్నప్పుడు మాత్రమే ఆ శక్తులు బలహీనమవుతాయి. తమ లోపాలు వైఫల్యాలను మనసులోనైనా అంగీకరించి తలవంచుకునే పరిస్థితులు వస్తాయి. ప్రజల కోసం పనిచేసే ఇలాంటి వారిని ప్రజలే కాపాడుకోవాలి. అది వారి కనీస బాధ్యత. ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఎక్కడికక్కడ ఇలాంటి బెదిరింపులు మందలింపులను ఖండించడం ద్వారా నైతిక మద్దతు ప్రకటించడం ద్వారా మన వాణిని బలంగా వినిపించడమే నేడు మన ముందున్న తక్షణ కర్తవ్యం. జర్నలిస్టు తులసి చందు కూడా తాను వాస్తవాలను తెలిపినందుకు ధైర్యంగా మాట్లాడినందుకు తన కుటుంబానికి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని, అయినా తన లక్ష్యం నుండి వైదొలిగే ప్రసక్తి లేదని చేసిన ప్రకటన ఇప్పటికైనా మతతత్వవాదులకు అసాంఘిక శక్తులకు చెంపపెట్టుగా పరిణమిస్తుందని ఆశిద్దాం. అదే సందర్భంలో హెచ్చరికలను పునరాలోచించుకోవలసిందిగా ప్రజల పక్షాన విజ్ఞప్తి.
వడ్డేపల్లి మల్లేశం
ఉపాధ్యాయ ఉద్యమ నేత
90142 06412