రక్షకులే దళితుల భక్షకులా..?

by Ravi |   ( Updated:2024-08-11 01:00:19.0  )
రక్షకులే దళితుల భక్షకులా..?
X

సమాజంలో మహిళలు, మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. రక్షించాల్సిన వారే శిక్షించాలని పేరుతో భక్షిస్తున్నారు. దేశంలో నాలుగేళ్ల క్రితం హత్రాస్ ఘటన, అలాగే రాష్ట్రంలో మూడేళ్ల క్రితం నల్గొండ జిల్లాలో పోలీసులు హింసతో మరియమ్మ అప్ లాక్ అప్ డెత్ ఘటన. ఈ రెండు మరువక ముందే మళ్లీ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సునీత అనే దళిత మహిళపై పోలీసుల దాష్టీకం తాజాగా వెలుగులోకి వచ్చింది. దళిత మహిళలపై దాడులు కట్టడి కావడం లేదు. దళిత మహిళలపై పోలీసుల అరాచక ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దొంగతనం ఒప్పుకోవాలంటూ దళిత మహిళ సునీతపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అవమానకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా తమ కొడుకును, కుటుంబ సభ్యులను హింస పెట్టారు. ఇక్కడ విషయమేమిటంటే రెండు వారాల కిందటే దళిత మహిళ సునీతపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కానీ.. అరెస్టు చేయలేదు. సునీతను తీవ్రంగా గాయపరిచారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా రహస్యంగా ఇంటి దగ్గరనే వదిలేశారు.

రక్షకులే భక్షకులైతే...

రక్షించాల్సిన పోలీసులే ఇలా దాడులు చేస్తుంటే సొసైటీలో మిగిలిన వాళ్లు ఎందుకు ఆగుతారు..? ఆకతాయిలు మతోన్మాదులు కూడా పెట్రేగిపోతారు. గత సర్కార్ పాలనలో మరియమ్మ ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. అధికారంలోకి వస్తే దళితులు రక్షణ బాధ్యతను తామే తీసుకుంటామని కూడా చెప్పాయి. ఎన్నికల్లో హామీలు కూడా ఇచ్చాయి. ఇప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటూ దళితులపై దాడులు జరగవు అని హామీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలలోనే పోలీసులు తన ప్రతాపాన్ని చూపించారు. పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ... దళితులపై దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దళితులు, మైనార్టీలు, ఇతర మహిళలపై దాడులు జరుగుతున్నాయి అనడానికి దళిత మహిళ సునీతపై హింసా ప్రయోగం కంటే మించిన నిదర్శనం ఏంటి..?

పని చేయని అట్రాసిటీ చట్టాలు..

దళితుల రక్షణకు తెచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి కాబట్టే.. దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టి విచారణ చేయడం లేదు. ప్రజా సంఘాలు పోరాడుతున్న శిక్షలు వేయకుండా కాలయాపన చేస్తున్నారు. కొందరైతే శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. కులం, బలం, ధనంతో తాము ఏమి చేసినా చెల్లిపోతుంది అనే ధైర్యాన్ని కొనసాగిస్తున్నారు. అసలు హంతకులను నిర్దోషులుగా వదిలేస్తున్నారని మేధావులు మండిపడుతున్నారు. దీనికి అధికార ఆధిపత్య ధోరణి కూడా కారణంగా కనిపిస్తోందని వాపోతున్నారు.

పాలకుల మద్దతుతోనే బరితెగింపు!

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులపై తీసుకున్న చర్యలు బాధితులకు సంతృప్తి కలిగించడం లేదు. ఎందుకంటే అంతకుముందు పలు కేసుల్లో అధికారులను సస్పెండ్ మాత్రమే చేస్తున్నారు. కానీ మళ్లీ ఘటనలు పునరావృతం అవుతున్నాయి. అధికారులపై చర్యలు తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే అవుతున్నాయి. దాడులు ఆగడం లేదు. ఇది కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఇదే పరిస్థితి రిపీట్ అవుతోంది. బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పాలకుల అండదండలు చూసుకొని దళితులు, మైనార్టీలపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం... దేశంలో సంవత్సరానికి 70 వేల కేసులు ఇలాంటివి నమోదవుతున్నాయి అంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి.

దళితులు, మైనారిటీలు, అణగారిన వర్గాలపై దాడులను నిర్మూలించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. షాద్‌నగర్ ఘటనపై పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇలాంటి అతి ప్రవర్తనలు ప్రదర్శించకుండా చట్టాలను ప్రతిష్టంగా అమలు చేసేలా చూడాలి. అంటరానితనం, లింగ వివక్షతపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి.. అవగాహన కల్పించాలి. ఇలా చేస్తే కొంతమేరకు దళితులు, మైనారిటీలపై దాడులు ఆగే పరిస్థితిని చూడగలుగుతాం.

పట్ట హరనాథ్

87908 43009

Advertisement

Next Story

Most Viewed