రాహుల్ చేతిలో రాజ్యాంగం..!

by Ravi |   ( Updated:2024-07-03 01:16:23.0  )
రాహుల్ చేతిలో రాజ్యాంగం..!
X

"మీరు దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నారు.నన్ను పప్పు అని అవమానిస్తున్నారు. అయినా సరే కొన్ని దశాబ్దాలుగా ఈ దేశ ప్రజలకోసమే బ్రతికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబం నుంచి వచ్చిన వాడిగా నేను కూడా ఈ దేశ ప్రజల అందమైన భవిష్యత్ కోసమే రాజీలేని పోరాటం చేస్తా. అంటూ ఎన్నోసార్లు లోక్‌సభ సాక్షిగా తన మనస్సులోని మాటలను బలంగా చెప్పిన రాహుల్ గాంధీ 18వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.

ఓ పక్క దశాబ్ద కాలంగా నరేంద్రమోడీ మానియా తాలూకు గాలులు ఏకచక్రాధిపత్యంగా దేశం మొత్తం వీస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడోయాత్ర దేశ ప్రజలతో పాటు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌ను బలంగానే ప్రభావితం చేసిందని అనడానికి 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. గత రెండూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నించాయి. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా చెప్పుకునే వారికి కనీసం ప్రతిపక్ష పాత్ర లేకపోవడం పట్ల ఏమిటీ ఈ పరిస్థితి అంటూ మేధావి వర్గం ఆందోళన చెందింది. 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడుగా కొనసాగిన రాహుల్ సమర్థ నాయకత్వంపై, పార్టీ మనుగడపై దేశప్రజల తీరు, తీర్పు అనేవి పార్టీతో పాటు రాహుల్ గాంధీ స్వభావాన్ని కూడా ప్రభావితం చేశాయి. నూతనత్వంతో కూడిన నవ యువ భారతానికి పాత టానిక్ వృద్ధ రాజకీయాలు పనిచేయవని నేటి యువతరం గుండెల్లో కాంగ్రెస్ లౌకికవాదపు దేశభక్తిని చాటేలా మారాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సోనియాగాంధీ నమ్మాల్సి వచ్చింది.

పాదయాత్రతో రాహుల్‌కి జ్ఞానోదయం

2019 ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యతగా రాహుల్ అధ్యక్షుడు గా రాజీనామా చేసి ప్రజా సమస్యలపై ప్రజా జీవితంలోకి బీజేపీ వారు తరుచుగా అంటున్నట్లు ఓ యువరాజులా కాకుండా పార్టీ సామాన్య కార్యకర్తగా, సగటు సాధారణ భారతీయుడిగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కుల, మత, ప్రాంత, సంస్కృతులకు అతీతంగా రాహుల్ ఆశయానికి, ఆచరణకి ప్రజల నుంచే కాక మేధావి వర్గం నుంచి కూడా మద్దతు పెరుగుతూ వచ్చింది. మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన రాహుల్ రాజకీయ ప్రయాణం, ఆటుపోట్లు ఎదురైనా ఓ సత్సంకల్పంతో ముందుకే సాగుతోంది. నేడు ప్రతిపక్ష నేతగా బాధ్యత అందించింది.

ప్రతిపక్షాన్ని బలపరిచిన ఓటు

ఇక 2024 మన సార్వత్రిక ఎన్నికల ప్రచారం తీరు, ప్రభావం యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని ఆకర్షించింది. 140 కోట్ల జనాభాతో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ ఎన్నికల సంగ్రామంలో దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు దిక్సూచిగా ఎగ్జిట్ పోల్స్ సైతం ఊహించని అసాధారణ ఫలితాలు వచ్చాయి. ఈ దేశ ప్రజలు తమ ఓటు హక్కుతో చాలా తెలివిగా, లౌక్యంతో సంకీర్ణ ప్రభుత్వంలో నరేంద్రమోడీకి మూడవసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇస్తూనే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరూ కలిసి అభివృద్ధి భారతం కోసం అహర్నిశలు శ్రమించాలనే బృహత్తర బాధ్యతను వారికి అప్పగించారు. దార్శనికతతో కూడిన దేశ ప్రజల భవిష్యత్తు కోసం, లౌకికవాదపు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేమంతా మీ వెంటే వుంటామని మోదీకి, రాహుల్‌కి అర్థమయ్యేలా బ్యాలెట్ బాక్సులో వివరంగా తెలియజేశారు. పోటీచేసిన రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రజలు రాహుల్‌ను గెలిపించారు. "ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో నుంచి నన్ను బయటకు పంపిస్తున్నారు. కానీ నా దేశ ప్రజల గుండెల్లో నా స్థానం నుంచి కాదు" అంటూ రాజకీయ ప్రయాణపు అడుగులు వేసిన రాహుల్ "మా దేశభక్తి ప్రదర్శనకు ఎవ్వరీ పేటెంట్ మాకు అక్కర్లేదు అంటూ విమర్శకులకు సమాధానం ఇస్తూనే భారత రాజ్యాంగ ప్రతితో ప్రచారం చేశాడు. రాజ్యాంగం సాక్షిగా 18వ లోక్‌సభలో ప్రమాణం చేశాడు.

మన బాధ్యతనూ గుర్తిద్దాం

75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో ఎన్నో సాధించాం. ఎంతో దూరం ప్రయాణించాం. కానీ ఇంకా సుదూర ప్రయాణం మిగిలే వుంది. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషితో చంద్రయాన్-3, ఆదిత్య ఎల్ 1 వంటి విజయాలతో మన జాతీయ జెండా గర్వంగా మన గుండెలపై ఎగురుతోంది. ఇదే స్ఫూర్తితో రాజకీయాలకతీతంగా, పార్టీల సిద్దాంతరాద్ధాంతాల అధిపత్య పోరును పక్కన పెట్టి కేవలం దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ పోటాపోటీ బాధ్యతతో పనిచేస్తూ, మనమిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుందాం. కనీసం 2047 నాటికైనా ఈ దేశం నుంచి ఆకలి చావులు అంతమై అందరికీ సమానత్వం, స్వేచ్ఛ తో కూడిన చదువులు, ఉద్యోగాలు అందుతాయని, ఆడపిల్లలపై సంప్రదాయపు అనాగరిక ఆంక్షలు మాయమై, లింగభేదం లేకుండా అంతరిక్షంలో సైతం సత్తా చాటాలని ఆశిద్దాం. గాంధీజీ, ఠాగూర్, వివేకానంద, అంబేద్కర్, అబ్దుల్ కలాం వంటి మహానుభావుల కలలు నెరవేరాలని, అభివృద్ధి భారతం ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేస్తూ విశ్వ గురువుగా ఎదగాలని ఆశిద్దాం. మనమంతా బాధ్యతతో మెలగాలని గుర్తిద్దాం.

ఫిజిక్స్ అరుణ్ కుమార్

కవి, రచయిత

93947 49536

Advertisement

Next Story

Most Viewed