ఉన్నది ఉన్నట్టు:కాంగ్రెస్ సంక్షోభ వాగ్దానాలు

by Viswanth |   ( Updated:2022-09-03 17:02:17.0  )
ఉన్నది ఉన్నట్టు:కాంగ్రెస్ సంక్షోభ వాగ్దానాలు
X

ఆర్థికంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలు, నిరుపేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలదే. వారి సంక్షేమం, ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సిందే. సంక్షేమ పథకాలను తప్పుపట్టాల్సిన పనిలేదు. వారి జీవన ప్రమాణాలను పెంచడానికి అనువైన స్కీములకు రూపకల్పన చేయడం తప్పేమీ కాదు. కానీ, ఆ పథకాలకు లబ్ధిదారులుగా అర్హతలను నిర్ధారించడమే కీలకం. ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలకు మార్గదర్శకాలే లేవు. సంపన్నులు, కార్లలో తిరిగేవారు, డూప్లెక్స్ ఇండ్లు ఉన్నవారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీన్ని తప్పు పట్టాల్సిందే. రాష్ట్రంలో రేషను కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పథకాలను అమలుచేయడం సహజ న్యాయసూత్రానికి విరుద్ధమైనది.

ధికారమే పరమావధిగా వందలాది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎనిమిదేళ్లలో 'మూడు స్కీములు, ఆరు లోన్లు' తరహాలో తయారైంది. పవర్‌లోకి రావడం కోసం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ 'నవరత్నాలు' పేరుతో హామీలిచ్చారు. ఆదాయం తక్కువ, అప్పులెక్కువ తీరులో ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో అడుగు ముందుకు వేసింది. 'వరంగల్ డిక్లరేషన్' పేరుతో నవరత్నాలలాంటి తొమ్మిది హామీలను రాహుల్ సమక్షంలో ప్రకటించింది. వీటిని అమలుచేయాలంటే ఎంత ఖర్చవుతుందో లెక్కలు చెప్పలేదు.

కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులకుప్పలా మారిందని విమర్శిస్తూనే మరింత అగాధంలోకి కూరుకుపోయేలా కాంగ్రెస్ ఎడాపెడా హామీలను గుప్పించింది. అంతంతమాత్రంగా ఉన్న ఆదాయ వనరులతో ఈ హామీల అమలు ఎలా సాధ్యమనేది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రకటించి అమలు చేస్తున్న హామీలకే రాష్ట్రం పన్నుల వసూళ్లు, ఇతర రూపాలలో ఆర్జిస్తున్న స్వీయ ఆదాయంలో 65 శాతం ఖర్చవుతున్నది. వరంగల్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలంటే సొంత ఆదాయ వనరులు ఏ మాత్రం సరిపోవు. అప్పులు, కేంద్ర గ్రాంట్లను కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

సంక్షేమం తప్పు కాకున్నా

ఆర్థికంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలు, నిరుపేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలదే. వారి సంక్షేమం, ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సిందే. సంక్షేమ పథకాలను తప్పుపట్టాల్సిన పనిలేదు. వారి జీవన ప్రమాణాలను పెంచడానికి అనువైన స్కీములకు రూపకల్పన చేయడం తప్పేమీ కాదు. కానీ, ఆ పథకాలకు లబ్ధిదారులుగా అర్హతలను నిర్ధారించడమే కీలకం. ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలకు మార్గదర్శకాలే లేవు. సంపన్నులు, కార్లలో తిరిగేవారు, డూప్లెక్స్ ఇండ్లు ఉన్నవారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీన్ని తప్పు పట్టాల్సిందే.

రాష్ట్రంలో రేషను కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పథకాలను అమలుచేయడం సహజ న్యాయసూత్రానికి విరుద్ధమైనది. లీగల్ చిక్కుల దృష్ట్యా కౌలు రైతులను రైతుబంధు పథకం నుంచి తప్పించిన రాష్ట్ర సర్కారు సాగులో లేని భూములకూ సాయం అందిస్తున్నది. ప్రజా ధనం దుర్వినియోగమవుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు, దళితబంధు పథకాలకే ఏటా రూ.45 వేల కోట్లు ఖర్చవుతున్నది. ఇక ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్ మెంట్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్.. లాంటి వందలాది పథకాలకు చేస్తున్న ఖర్చు అదనం. రాష్ట్ర స్వీయ ఆదాయంలో సింహభాగం సంక్షేమానికే ఖర్చవుతున్నది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులు తదితరాలకు కేంద్ర గ్రాంట్లు లేదా అప్పులపై ఆధారపడాల్సి వస్తున్నది.

జగన్ నవరత్నాలూ అంతే

ఐదేండ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని జగన్ సర్కారు విమర్శిస్తున్నది. అప్పట్లో పసుపు కుంకుమ లాంటి స్కీములుంటే ఇప్పుడు నవరత్నాలు వచ్చేశాయి. వీటి అమలు కోసం భారీగానే ఖర్చు చేస్తున్నది. తాజా బడ్జెట్‌నే పరిశీలిస్తే రాష్ట్రం పన్నుల ద్వారా ఆర్జించనున్నది రూ. 91 వేల కోట్లు. ఇందులో సగానికి పైగా (అంటే, రూ. 49 వేల కోట్లను) సంక్షేమ పథకాలకు 'ప్రత్యక్ష నగదు బదిలీ' రూపంలోనే కేటాయించాల్సి వచ్చింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. మొత్తం బడ్జెట్‌లో రాష్ట్రం స్వంతంగా తనపైన ఆధారపడుతున్నది కేవలం 53 శాతం ఆదాయంపైనే. మిగిలిన 47 శాతం కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా, గ్రాంట్లు, కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా వస్తుందనే అంచనా వేసుకున్నది.

ఇప్పటికీ ద్రవ్య లోటుకు కేంద్రం నుంచి పరిహారం రూపంలో అందుకోవాల్సి వస్తున్నది. ఓపెన్ మార్కెట్ ద్వారా తీసుకునే రుణాలు మోయలేని భారంగా మారనున్నది. పాత అప్పులకు వడ్డీల చెల్లింపే కష్టంగా మారింది. కేంద్రంతో సఖ్యతగా ఉంటే గ్రాంట్లు వస్తాయన్న ఉద్దేశంతో పొలిటికల్ లైన్‌ను కూడా దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి వచ్చింది. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం పార్టీలు పోటీపడి మరీ వెల్ఫేర్ స్కీములను ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి రావడమే వాటికి అన్నింటికంటే ముఖ్యమైనది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ పార్టీలు ఇష్టారీతిన పథకాలను ప్రకటించాయి.

అంచనాకందని డిక్లరేషన్ భారం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభ వేదికగా ప్రకటించిన నవరత్నాల డిక్లరేషన్ అమలైతే ఖజానాపై పడే భారమెంతో ఆ పార్టీకే స్పష్టత లేదు. ప్రస్తుతం రైతుబంధు పేరుతో ఏటా ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఖర్చు చేస్తున్న భారమే రూ. 15 వేల కోట్లు దాటుతున్నది. దీన్ని ఎకరానికి ఐదు వేల రూపాయలను పెంచి రూ. 15 వేలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా రూ. 5 వేల కోట్లు భారం పడుతున్నది. రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది కౌలు రైతులకూ ఇదే సాయాన్ని పొడిగించనున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా అదనంగా రూ. 6,750 కోట్ల ఖర్చు పెరుగుతుంది. ప్రస్తుతం అమలులో లేని పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చేసిన ప్రకటనకు కూడా బడ్జెట్ కేటాయింపులు అవసరం.

ఇక రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకూ ఏటా రూ. 12 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సుమారు 59 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. వీరికి రూ. 7 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. జాబ్ సీకర్స్ గా 1.24 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడా వర్తింపజేస్తే మరో రూ. 8 వేల కోట్లు కావాల్సి వస్తుంది. వరి ధాన్యాన్ని క్వింటాకు రూ. 2,500 చొప్పున కొంటామని ప్రకటించింది. సంవత్సరానికి సుమారు రూ. 7,700 కోట్లు అదనంగా ఖర్చవుతున్నది. రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీకి అదనంగా ఖర్చు తప్పదు. ఇలా చెప్పుకుంటూ పోతే నవరత్నాల డిక్లరేషన్‌ హామీల అమలుకయ్యే ఖర్చుల భారం అంచనాకు అందదు. దీన్ని సమకూర్చుకునే ఆదాయ మార్గాలపై స్పష్టత లేదు.

ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో

టీఆర్ఎస్ పాలన తొలి టర్ము సంక్షేమ దిశగా సాగినా రెండో దఫాలో మాత్రం చాలా స్కీములు అటకెక్కాయి. వ్యవసాయ యాంత్రికీకరణ, గ్రీన్ హౌజ్ ఫార్మింగ్, పంటల బీమా స్కీమ్, ఇన్‌పుట్ సబ్సిడీ, టీఎస్ ప్రైడ్ ఇలాంటివి చాలా అమలు జాబితా నుంచి పక్కకు పోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ కోసం తీసుకొచ్చిన పలు పథకాల అమలూ ప్రశ్నార్థకంగా మారింది. కంటికి కనిపించని తీరులో పన్నులు పెరిగాయి. ఆర్టీసీ టికెట్ల రౌండప్ సవరణలు, డీజిల్ సెస్, కరెంటు చార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల టాక్స్ శ్లాబ్‌లో మార్పులు, 'ధరణి' పోర్టల్‌లో ఏ మార్పు చేసుకోవాలన్నా యూజర్ ఛార్జీలుగా రూ. 1000 చెల్లించడం, వైన్ షాపుల లైసెన్సు ఫీజు పెంపు ఇలా అనేక పన్నులు పెరిగాయి.

రాష్ట్రం స్వంతంగా సమకూర్చుకుంటున్న పన్నుల ఆదాయంలో దాదాపు మూడో వంతు కేవలం మద్యం విక్రయాల ద్వారానే సమకూరుతున్నది. సంక్షేమం పేరుతో ఇస్తూ మద్యం, ఇతర పన్నుల ద్వారా లాక్కుంటున్నది. కేంద్రం నుంచి గ్రాంట్లు ఎక్కువ వస్తాయనే ఆశలు పెట్టుకుని బడ్జెట్ సైజును పెంచుకున్నా ఫలితం లేకపోయింది. తలసరి ఆదాయం పెరిగిందని గొప్పగా చెప్పుకుంటున్నా పేద-ధనిక అంతరం మరింత ఎక్కువైంది. పేదల, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి ఆర్థికంగా చేయూతనిచ్చి సంక్షేమం అందించడం ప్రభుత్వాల సామాజిక బాధ్యత. కానీ సరైన మార్గదర్శకాలు లేకుండా సంపన్నులకూ వర్తింపజేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బాధ్యతారాహిత్యం.

అదీ వివరించాలి

అధికారంలోకి రావడం కోసం వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రకటించిన నవరత్నాల అమలు ఓటు బ్యాంకు పాలిటిక్స్ అని చెప్పక తప్పదు. అలాంటి పథకాలనే అమలు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని తిడుతూ, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శిస్తూ అంతకంటే ఎక్కువ స్థాయిలో స్కీములను ఏకరువు పెట్టడం విడ్డూరం. పథకాలు ప్రకటించడమే కాదు.. వాటి అమలుకు ఎంత అవసరమవుతున్నది, దానికి తగిన వనరులను ఎలా సమకూర్చుకుంటుందో కూడా ప్రజలకు వివరించడం ఆ పార్టీ నైతిక బాధ్యత.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story