- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత పాలనను తిరగరాయాలి!
భారతదేశంలో సుదీర్ఘమైన పోరాటాలు చేసే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది మన తెలంగాణ ప్రజలు మాత్రమే అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గడ్డ ప్రజలు 75 ఏండ్ల పాటు నిర్విరామంగా అలసట లేకుండా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వీరు మొదట్లో నిజాం రాజు పాలనలో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో, ఈ ప్రాంతానికి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు.
అందుకే కేసీఆర్‌కు దూరం..
రాష్ట్ర ఏర్పాటు జరిగాక, ఉద్యమ ఆశయాలు నెరవేరుస్తారని టీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పజెప్పితే.. ఉద్యమకారులకు పదవులు దక్కలేదు. కరెంట్, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు మొదలెట్టారు కానీ నిరుద్యోగ సమస్యలు నీరుగార్చారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. దానివల్లే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు కేసీఆర్. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో.. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును పండించి అనూహ్యంగా తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చాక ఉద్యమకారుల ఊసే లేకుండా పోయింది. తద్వారా సగటు ప్రజలకు పాలకులు దూరమయ్యారు. నియామకాలు, ఉద్యోగులు, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనపడింది. పాలన మీద వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వ నిర్బంధాలను అధిగమించి తెలంగాణ సమాజం పోరాటాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లకే మేడిగడ్డ వద్ద కుంగిపోయింది. కార్పొరేటు విద్య పెరిగిపోయింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. కానీ గల్లీకి ఒక బెల్టు షాపుల పేరుతో మద్యం మాత్రం ఏరులై పారించారు. ఉద్యోగాలు లేక, పడ్డ ఉద్యోగాల పేపర్లు లీక్ అయి, యూనివర్సిటీలలో భర్తీ లేక నిరుద్యోగుల అవస్థలు అనంతం. ఉద్యమంలో చెప్పినట్టు దళిత ముఖ్యమంత్రి రాలేదు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన చోట దళిత బంధు, బర్లు, గోర్లు, చేపలు, భవనాలు అంటూ ఏమారుస్తూ ఉద్యమ పార్టీ కాస్త కుటుంబ పార్టీగా మారిపోయి తీవ్రమయిన వ్యతిరేకతతో అధికారం కోల్పోయి ఈ ఎన్నికల్లో 39 స్థానాలు మాత్రమే గెలవగలిగింది.
గతంలో పనిచేసినట్టు కాకుండా..
రాష్ట్రం ఏర్పడ్డాక దశాబ్దకాలం పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పాలనపై ప్రజల పక్షం ఉండి కొట్లాడిన ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లోకి వెళ్లాయి. 2018 ఎన్నికల తర్వాత బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలవడం, బండి సంజయ్ అధ్యక్షుడిగా నియామకమై అయితే మొదట్లో రెండు దఫాలుగా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు గెలవడం తరువాత టీఆర్ఎస్ పార్టీలోకి పోవడంతో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. ఆ తర్వాత పీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం, బట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా పాదయాత్రలు చేయడం పార్టీకి కలిసివచ్చిన అంశాలు. ప్రజా సంగ్రామ యాత్రలతో గ్రామీణ ప్రాంతాలకు పార్టీని విస్తరించడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని ప్రజల్లోకి బాగా పోయింది. పైగా కవిత లిక్కర్ స్కాం కేసుతో రాజకీయాలు వేడెక్కాయి. అలాంటి సమయంలో కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంతో కేంద్ర నాయకత్వం వ్యూహాత్మక తప్పిదం చేసింది. అప్పుడే కాంగ్రెస్‌లో భట్టి పాదయాత్ర, రేవంత్ దూకుడుతనం పార్టీని బలంగా నిలబెట్టింది. బీజేపీ చేసిన స్వయంకృపరాధం వలన చివరికి ఎన్నికల్లో 8 స్థానాలలో మాత్రమే గెలిచింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడం, రాష్ట్రంలో బీజేపీ బలహీనపడటం, లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాకపోవడంతో కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేననే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. పైగా బీజేపీలోని నాయకులను కాంగ్రెసులోకి చేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అమలు చేసుకుంటూ వెళ్లి విజయం సాధించింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలను, టీజేఎస్‌లను కలుపుకొని పొత్తుపెట్టుకోవడం, సోషల్ మీడియా సహకారంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి పడి 64 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టబోతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం తరువాత, అప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కానీ ఈ కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను సరిచేస్తూ, ఉద్యమ ఆకాంక్షలు అయిన నీళ్లు, నిధులు, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలు, విద్య వైద్య రంగాల పటిష్టత, రైతాంగ సమస్యలు పరిష్కరించాలి. కాంగ్రెస్ పార్టీ ఐదు దశాబ్దాల కాలంలో పనిచేసినట్టు కాకుండా కొత్త రాష్ట్రంలో కొత్త రకం, కొత్త తరం పాలనతో గత చరిత్రను తిరగరాస్తూ, ఉద్యమ ఆశయాలు నెరవేర్చాలి.
డా. సదానందం గుళ్లపెల్లి
సోషల్ అనలిస్ట్
91779 14888