వినా కలహం..న కాంగ్రెస్

by Ravi |   ( Updated:2022-09-03 15:01:22.0  )
వినా కలహం..న కాంగ్రెస్
X

సముద్రం వంటి కాంగ్రెస్​పార్టీలో కలహాలు, కుంపట్లు, గ్రూపులు మొదట్నుంచీ ఉన్నాయి. కానీ, అధికార పక్షాన్ని దెబ్బకొట్టేందుకు గతంలో ఎంతో కొంత మేరకు కలిసి పని చేసినవారే. ఇప్పుడు పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అటు సీనియర్లు ఇటు రేవంత్ వర్గం గొడవలు కనిపించకుండానే కల్లోలం సృష్టిస్తున్నారు. వీటికి బ్రేక్​ వేసేందుకు అటు ఏఐసీసీ ఇటు టీపీసీసీ ముందుకు రావడం లేదు. ముందుగా అధికారపక్షం మీద గెలవాలనే కనీస జిజ్ఞాస కాంగ్రెస్ పార్టీ నేతలకు లేకుండా పోయింది. ధరల పెరుగుదలతో బీజేపీని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పటికే దూసుకుపోవాల్సి ఉంది. కానీ, అలా జరగడం లేదు.

నిజమే, వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్షం పుంజుకోవడానికి ఇదే సరైన సమయం. ఇలాంటి పరిస్థితులను అందిపుచ్చుకున్న పార్టీలన్నీ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో అధికారంలోకి వచ్చాయి. చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడానికి ఇది కూడా ప్రధాన కారణం. ఎందుకంటే, అప్పటికే ఉన్న ప్రభుత్వాలు రెండు టర్మ్‌లు తమ పాలనను పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి.

వాస్తవానికి ఇక్కడి రాజకీయాలే ఒక విచిత్రం. ఎప్పుడు ఎలా మారుతాయో అంచనా వేయడం కొంచెం కష్టమే! అయినప్పటికీ, ఒక ఫలితం మాత్రం కనిపిస్తోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్​అదే పరీక్షను ఎదుర్కొంటోంది. ముందుగా గెలిచి, తొలి టర్మ్​ పూర్తి కాకుండానే ముందస్తుకు వెళ్లింది. బంపర్ మెజార్టీ సాధించింది. పక్క పార్టీ నుంచి గెలిచినవారు కూడా ఇక లాభం లేదనకుని టీఆర్‌ఎస్ వైపు వెళ్లారు. ప్రస్తుతం వారు మాత్రమే కాదు, గులాబీ కండువాతో రెండుసార్లు గెలిచి, నిత్యం ప్రజలలోనే ఉంటున్నామనే గాంభీర్యాన్ని మీదకు చూపించుకుంటున్న ఎమ్మెల్యేలలోనూ భయం పట్టుకుంది. మూడోసారి గెలవడం అనేది ఒక పెద్ద టాస్కే. కానీ, వారికి కూడా ఒక ఆశ ఉంది. అదే కాంగ్రెస్.

అందిపుచ్చుకోలేక

తెలంగాణ ఏర్పాటు నుంచి రోజూ చస్తూనే ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు అధికార పక్షం మీద వ్యతిరేకత ఉందనేది అక్షరాలా నిజం. బీజేపీపైనా రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోంది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​పాదయాత్రలోనే ఇది బయటపడింది. మొన్నటి వరకు బీజేపీ నేతలకు ఒక నమ్మకం ఉండేది. ఎలాంటి వ్యతిరేకత ఉన్నా అదంతా రాష్ట్ర ప్రభుత్వం మీదనే పోతుందని. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ పెద్దగా వ్యతిరేకత ఉండదనే ధైర్యం ఉండేది. ఇటీవల బండి సంజయ్​ఉమ్మడి మహబూబ్‌నగర్​జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో బస చేసి, అక్కడ కూలీనాలీ చేసుకునే వాళ్లతో మాట్లాడారు. వాళ్ల మాటలు విని సంజయ్​మాత్రమే కాదు. కాషాయం జెండా పట్టుకున్న వారంతా షాక్. ఎందుకంటే 'బీజేపీ ప్రభుత్వం గ్యాస్​ధరలు, నూనెల ధరలు పెంచింది. ఇలాగైతే మేం ఎలా బతకాలి. ఉపాధి హామీ రోజంతా కూలీకి పోయినా వచ్చేది తక్కువ. ధరలు ఇలా పెరుగుతుంటే బీజేపీని ఎలా నమ్మేది సారూ' అంటూ కూలీనాలీ చేసుకునే మహిళలు అడగడంతో బీజేపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు.

రాష్ట్ర ప్రభుత్వంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ దయనీయత ఏమిటంటే ఈ వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోకపోవడమే. ప్రజలలోకి చొచ్చుకునిపోయి 'ప్రత్యామ్నాయంగా మేం ఉన్నాం' అనే భరోసా ఇవ్వకపోవడమే. ఈ పార్టీ నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామనే విషయం కూడా ప్రజలకు అర్థం చేయించలేకపోతున్నారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఎండ్రకాయ ల కథ. ఒకరు ముందుకు వెళ్తుంటే వెనక నుంచి మరొకరు కాళ్ల మధ్యన కట్టెలు పెడతారు. పోటీ పడి ముందుకు పరుగెత్తే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. కనీసం పార్టీకైనా మంచి పేరు వస్తుందనే ఆలోచన ఉండదు. తమను దాటేసి ఎలా ముందుకు పోతారో? చూద్దామనే సవాల్ అంతే!

ఎందుకో మరి?

సముద్రం వంటి కాంగ్రెస్​పార్టీలో కలహాలు, కుంపట్లు, గ్రూపులు మొదట్నుంచీ ఉన్నాయి. కానీ, అధికార పక్షాన్ని దెబ్బకొట్టేందుకు గతంలో ఎంతో కొంత మేరకు కలిసి పని చేసినవారే. ఇప్పుడు పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అటు సీనియర్లు ఇటు రేవంత్ వర్గం గొడవలు కనిపించకుండానే కల్లోలం సృష్టిస్తున్నారు. వీటికి బ్రేక్​ వేసేందుకు అటు ఏఐసీసీ ఇటు టీపీసీసీ ముందుకు రావడం లేదు. ముందుగా అధికారపక్షం మీద గెలవాలనే కనీస జిజ్ఞాస కాంగ్రెస్ పార్టీ నేతలకు లేకుండా పోయింది. ధరల పెరుగుదలతో బీజేపీని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పటికే దూసుకుపోవాల్సి ఉంది. కానీ, అలా జరగడం లేదు.

కేసీఆర్ కుటుంబమే టార్గెట్ కాదు కదా!

రేవంత్​ఎంతగా ప్రభుత్వంపై విమర్శలకు దిగినా, చివరకు కేసీఆర్ కుటుంబం దాకా వచ్చి ఆగిపోతున్నారు. రాష్ట్రమంతా చుట్టీ చుట్టీ చివరకు ఎర్రవల్లి ఫాంహౌస్​దగ్గరే బ్రేక్​వేస్తున్నారు. విమర్శలు చేసినా, పథకాలలో అక్రమాలను బయటకు తీసినా, భూ కుంభకోణాలపై నెత్తీనోరూ బాదుకుంటున్నా చివరకు కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ దగ్గరకే వస్తున్నారు. దీంతో అసలు కథ కనుమరుగవుతోంది. దీనిని పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్​కుటుంబమే టార్గెట్‌గా కాకుండా, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలంటున్నారు. ఇటీవల కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ధరణి లోపాల పుట్ట. గ్రామాలకు గ్రామాలు సమస్యలతో తల్లడిల్లుతున్నాయి. దీని మీద ఉద్యమం చేస్తే కాంగ్రెస్‌కు కలిసి వచ్చేదే. కానీ, 'ధరణి సమస్యల నిర్మూలన కమిటీ' అని పెట్టుకుని, నెలకో, పక్షానికో గాంధీభవన్‌లో కలుసుకుని చాయ్‌లు తాగి, బిస్కెట్లు తిని, ఓ ప్రెస్‌నోట్ మీడియాకు​పంపి చేతులు దులుపుకుంటున్నారు. ఒక్క ఉదాహరణను తీసుకుని రోడ్డెక్కి ఆందోళన చేసిన దాఖలాలు లేవు. ధరణిపై పోరాటమంటే గాంధీభవన్ మీటింగ్​మాత్రమే కాదు కదా? అనేది పార్టీ నేతల వాదన.

డిక్లరేషన్​ ఎందాకా?

ధాన్యం కొనుగోలు, వరి సాగు, ప్రత్యామ్నాయ పంటలు ఇలా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. రైతులు తక్కువ ధరకు పంటలు అమ్ముకుంటున్నారు. వానాకాలంలో ఏం సాగు చేయాలో ఇంకా స్పష్టత లేదు. రైతులు ఆయోమయంలో ఉన్నప్పుడు రాహుల్‌గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు.​దీనిని రైతుల దాకా తీసుకుపోవాల్సింది ఎవరు.వరంగల్​డిక్లరేషన్ మీద​పార్టీ నేతలకే ఇంకా క్లారిటీ లేదు.

రైతులకు రుణమాఫీ, కౌలు రైతులకూ రైతుబంధు, ధనిక వర్గాలకు కట్​చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ధనికులను ఎలా గుర్తిస్తారు? వరంగల్​డిక్లరేషన్‌ను ఊరూరికి, ఇంటింటికీ తీసుకుపోతామని, 300 మంది నేతలు నెల రోజుల పాటు తిరుగుతారని టీపీసీసీ ప్రకటించింది. వారెవ్వరో తెలియదు. 'పెద్దలు జానారెడ్డి' నేతృత్వంలోనే వరంగల్ డిక్లరేషన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. డిక్లరేషన్‌లో భాగస్వాములైన పెద్దలంతా ఇప్పుడు ఎందుకో సైలెంట్‌గానే ఉంటున్నారు. హతవిధీ కాంగ్రెస్!!!

టి. సంపత్‌కుమార్

94414 06811

Advertisement

Next Story