కండిషనల్ అపాయింట్‌మెంట్ అంటే..

by Ravi |   ( Updated:2024-08-28 00:31:26.0  )
కండిషనల్ అపాయింట్‌మెంట్ అంటే..
X

ఈ మధ్య తరుచుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు కండిషనల్ అపాయింట్‌ మెంట్, కండిషనల్ ప్రమోషన్స్‌కు సంబంధించిన రెగ్యులరైజేషన్ తేదీ, వార్షిక ఇంక్రిమెంట్ల గురించి పలుమార్లు సందేహాలను వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వం వారు చాలా కాలంగా ఉన్న ఖాళీలను పరిపాలనా సౌలభ్యం కొరకు స్పెషల్ డ్రైవ్ క్రింద విద్యార్హతల విషయమై నిబంధనలకు తాత్కాలికంగా కొంత మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అనగా మూడు లేక ఐదు సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనలతో, అదే విధంగా ఉత్తీర్ణత నిబంధనలను కొంత సమయమిచ్చి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనలతో ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది.

అప్రయత్న పదోన్నతి పథకం

ముఖ్యంగా కారుణ్య నియామకాల్లో కనీస విద్యార్హతలను పొందడానికి కొంత సమయం నిబంధనలకు లోబడి ఇవ్వడం జరుగుతుంది. కండిషనల్ అపాయింట్‌మెంట్స్ చేయవచ్చు గానీ కండిషనల్ ప్రమోషన్స్ సాధారణంగా చేయరు. కానీ కొన్ని శాఖలు వారి వారి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం నుండి తాత్కాలికంగా మినహాయింపు పొంది వారి శాఖలలో... స్పెషల్ డ్రైవ్ ప్రత్యక్ష నియామకాలతో అట్లే తాత్కాలిక ప్రమోషన్లతో 5 సంవత్సరాలలో ఉత్తీర్ణత (Net / Slet / Phd.) సాధించాలని నిబంధనలు విధించడం జరిగింది. ఇలాంటి ఉదంతాలలో ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య GO MS 270 (GA సర్వీస్) డిపార్ట్‌మెంట్ తేదీ 30-04-1984 అనుసరించి అర్హతకు సంబంధించిన పరీక్షలు, ఉత్తీర్ణత పొందిన తేదీ నుండి ఇంక్రిమెంట్లు, ఆర్థిక లాభం చేకూరుతుంది. నియామకం కావింపబడినప్పటి నుండి వార్షిక ఇంక్రిమెంట్లను నోషనల్‌గా మంజూరు చేయవలసి ఉంటుంది. ఈ విషయమై డీడీఓలకు స్పష్టమైన నిబంధనలు తెలియక వార్షిక ఇంక్రిమెంట్లను నియామకం పొందిన తేదీ నుండి/ పదోన్నతి పొందిన తేదీ నుండి విడుదల చేస్తున్నారు. అట్లే అప్రయత్న పదోన్నతి పథకం ద్వారా (AS) లభించే ఇంక్రిమెంట్లను కూడా నిర్ణీత అర్హత సాధించిక ముందే మంజూరు చేస్తున్నట్టు తెలియవచ్చింది. కానీ నిబంధనలు తెలిసిన తర్వాత రికవరీ ప్రతిపాదిస్తున్నారు.

ఉద్యోగి ఎప్పుడైతే తగిన అర్హత పొందుతాడో అప్పటి నుంచి మాత్రమే ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. నియామకం కావింపబడిన తేదీ నుండి నిర్ణీత అర్హతలు పొందువరకు గల కాలాన్ని ఇంక్రిమెంట్స్‌కు నోష నల్‌గా పరిగణించవలసి ఉంటుంది. అదే విధంగా GO MS NO 151 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ తేదీ 22-06-2004 అనుసరించి నిర్ణీత అర్హ తలు పొందిన తేదీ నుండి మాత్ర మే ఉద్యోగి రెగ్యులరేజేషన్, ప్రొబే షన్‌కు అర్హులు. ఈ తేదీ నుండి మాత్ర మే సీనియారిటీ పరిగణించబడుతుంది.

పదోన్నతి పొందినా ఇంక్రిమెంట్లు లేకపోవడానికి..

ఈ మధ్య కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు వారు పదోన్నతి పొందినప్పటికీ, సదరు పదవికి చెందిన పే స్కేల్ నందు ప్రమోషన్‌కు ముందే గరిష్ట పే స్కేలు కలిగి, అందులో మొత్తం 5 స్టాగ్నిషన్ ఇంక్రిమెంట్లు కలిగి ఉండటంతో ప్రమోషన్ పొందిన పదవిలో ఇంక్రిమెంట్లు తీసుకోలేని సమస్య ఉత్పన్నమవుతోంది. వీరి కేసుల పూర్వాపరాలు పరిశీలించిన పిదప వీరు అప్రయత్న పదోన్నతి పథకం (ఏఏఎస్) కింద ఎస్‌పీపీ-1 ఏ (12 సంవత్సరాలు) ఎస్‌పీపీ-1 బీ (18 సంవత్సరాలు) గతంలోనే పొంది ఉన్నారు. సాధారణంగా వీరికి అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఎఫ్ఆర్ 22 బి ని అనుసరించి పదోన్నతి పొందిన తేదీ నుంచి కానీ, లోయర్ గ్రేడ్‌లో వార్షిక ఇంక్రిమెంట్ తేదీ నుండి కానీ ఆప్షన్ ఇవ్వడానికి అనుమతి ఉంది. కానీ వారు పదోన్నతి పోస్ట్‌ గరిష్ట స్కేలుకు చేరుకోవడమే కాకుండా, అందులో 5 స్టాగ్నిషన్ ఇంక్లిమెంట్లు పొంది ఉన్నారు. అందువలన వీరికి పదోన్నతి ప్రయోజనాలు లభించడం లేదు. ఇది చాలా అరుదైన సందర్భం.

ఫిట్‌మెంట్ సమస్యలు ఎందుకు?

ప్రతి పే రివిజన్ కమిషన్ మాస్టర్ స్కేల్‌ను కొద్ది ఫిట్‌మెంట్‌తో పొందుపర్చి, మరల ప్రభుత్వం వారు ప్రకటించే వేరే ఫిట్‌మెంట్‌ను అంగీకరించడం జరుగుతోంది. అంగీకరించిన ఫిట్‌మెం ట్‌కు అనుగుణంగా మాస్టర్ స్కేల్‌ని సవరించినట్లయితే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఉదాహరణకు 2018 పీఆర్‌సీ ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం 30 శాతం ఫిట్‌మెంట్‌తో మాస్టర్ స్కేల్స్ రూపొందించడం జరిగింది. కానీ తెలంగాణ పీఆర్‌సీ 2018లో దాదాపు 15 శాతం ఫిట్‌మెంట్‌తో మాస్టర్ స్కేల్ ఏర్ప ర్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఆమోదించింది. అయితే దీనికి అనుగుణంగా మాస్టర్ స్కేల్‌ను సవరించలేదు. అందువలన ప్రమోషన్ పొంది కూడా సంబంధిత పదవికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనం చేకూరడం లేదు. ఇలాంటి ప్రత్యేక ఉదంతాలపై సంబంధిత శాఖవారు ప్రభుత్వానికి నివేదించి తగు ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.

అలాగే ఎక్కువ ఫిట్‌మెంట్‌తో మాస్టర్ స్కేల్‌ని రూపొందించినట్లయితే ఇలాంటి పరిస్థితి దాదాపు ఉత్పన్నం కాదు. ఉదాహరణకు 5 రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం వారి పీఆర్‌సీ నందు (01-07-2022 నుండి) ఇరవయ్యేడున్నర ఫిట్‌మెంటుతో మాస్టర్ స్కేల్‌ని రూపొందించడం జరిగింది. అట్లే ఎనిమిది స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల మంజూరుకు ఆమోదించడం జరిగింది. పై సమస్యలను అధిగమించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపించినట్లు భావించాలి. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య ( FD 21 SRP 2024 తేదీ 17-08-2024). ఇట్టి విషయమై మన రాష్ట్ర ప్రభుత్వ పీఆర్సీ కమిటీ కూడా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవలసినదిగా నివేదించాలి.

- సి. మనోహర్ రావు

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి

96406 75288

Advertisement

Next Story

Most Viewed