సహ పాఠ్యాంశాలతోనే సమగ్రాభివృద్ధి

by Ravi |   ( Updated:2024-03-23 00:30:15.0  )
సహ పాఠ్యాంశాలతోనే సమగ్రాభివృద్ధి
X

గడచిన 30 ఏండ్లలో విద్యా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. గతంలో విద్య వ్యక్తి పరిపూర్ణత సిద్ధించేలా ఉండేది. నేడు జ్ఞాన సముపార్జనపై మాత్రమే దృష్టి పెడుతూ సహ పాఠ్యాంశాలు, జీవన నైపుణ్యాలు నేర్పించడంలో వెనుకబడ్డాము. సమాజంలో అనేక రుగ్మతలకు మనమే కారకులం అవుతున్నాము.

పరిపూర్ణమైన వ్యక్తులుగా రూపొందాలంటే విద్యార్థి దశలోనే పాఠ్యాంశాలతో పాటు, సహ పాఠ్యాంశాల బోధన, జీవన నైపుణ్యాల అభివృద్ధి తప్పనిసరిగా జరగాలి. మనిషి భౌతిక వాదం, ధన దాహం, నిరంకుశత్వం, స్వార్థం స్వాభిమానం, ప్రాంతీయత వాదం, కుల, మత వాదం వంటి వాటికి బలై తన ఉనికి కోల్పోయి మానవత్వానికి, నైతిక విలువలకు దూరమయ్యాడు. ఈ పరిణామ లక్షణాలే నేటి సమాజంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక స్పృహ లోపించడం, నేర ప్రవృత్తి పెరగడం, నైతిక విలువలు క్షీణించడం, మానసిక కుంగుబాటుతనం, శ్రమ విలువ తెలియకపోవడం, సామాజిక సమన్వయ లోపం, శారీరక దృఢత్వం లోపించడం, జీవన నైపుణ్యాలు లేకపోవడం వంటివి.

పుట్టుకతోనే అలవడే విద్య

విద్య అంటే జ్ఞాన సముపార్జన, నైపుణ్యాలను అభివృద్ధి చేసే ప్రక్రియ. వ్యక్తి తనకు తెలియని విషయాలను తెలుసుకునే ప్రక్రియ. విద్య వ్యక్తులను శక్తివంతంగా తయారు చేసి, సమాజానికి మేలు చేసేలా చేస్తుంది. వ్యక్తి పుట్టుకతోనే విద్య నేర్చుకోవడం ఆరంభిస్తాడు. వ్యక్తులు పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలంటే ఉత్తమమైన పౌరులుగా ఎదగాలంటే విద్యార్థి దశలో పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్యాంశాలను విధిగా నేర్పాలి. ఇవి నేర్పితే సానుకూల సామాజిక దృక్పదాలు అభివృద్ధి చెందుతాయి. ఓటమిని కూడా తట్టుకొని నిలబడటానికి స్ఫూర్తి పొంది విజేతలుగా నిలుస్తారు. ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మహత్యలు తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన శరీరంలోని ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది.

నియామకాలు తప్పనిసరి

అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సహ పాఠ్యాంశాలు, జీవన నైపుణ్యాలు బోధించడానికి ప్రాథమిక, సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల బోధన నామమాత్రంగా కొనసాగుతుంది. ఇవి నేర్పడానికి పాఠ్యపుస్తకాలు రూపొందించి, విధిగా ఉపాధ్యాయ నియామకాలు చేయాలి. ప్రతి తరగతి ప్రగతి నివేదనలో ఈ అంశాలను చేర్చాలి. అప్పుడే సత్ఫలితాలు సాధించవచ్చు. వ్యక్తుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.

పాఠశాల స్థాయిలో సంగీతం, నాట్యం కళలు క్లబ్‌లు (సైన్స్ క్లబ్ మాథ్స్ క్లబ్) టాలెంట్ షోలు, డ్రాయింగ్ కాంపిటీషన్లు డిబేట్లు, సెమినార్లు, కథలు, కవితలు, పాటలపై వర్క్ షాప్‌లు ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, క్రీడా పోటీలు, కంప్యూటర్ పరిజ్ఞానం, యోగ , వ్యక్తిత్వ వికాస శిక్షణలు, క్షేత్రస్థాయి పర్యటనలు, విజ్ఞాన వినోదాన్ని పెంచడానికి విజ్ఞాన యాత్రలు వంటివి నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, శ్రమ విలువ, క్షేత్రస్థాయి అనుభవాలు, సమన్వయం క్రీడాస్పూర్తి సృజనాత్మకత, వినోదాత్మక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణలపై అవగాహన పెరిగి నవభారత నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషించగలరు.

పాకాల శంకర్ గౌడ్

98483 77734

Advertisement

Next Story