మీడియా టాక్.. మూతబడిన పత్రికా స్వరాలు

by Sumithra |   ( Updated:2023-04-15 21:00:25.0  )
మీడియా టాక్.. మూతబడిన పత్రికా స్వరాలు
X

స్త్రీవాద పత్రిక 'భూమిక' తెలుగు మాసపత్రిక ఇటీవల 30 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది. అందులో ఎంతోమంది, ప్రధానంగా రచయిత్రులు, ఈ మూడు దశాబ్దాలలో తెలుగు మాట్లాడే ప్రాంతంలో సంభవించిన పరిణామాలని స్త్రీల దృక్కోణంలో విశ్లేషిస్తూ ఒక మాసపత్రికగా చేసిన కృషిని కూడా సమీక్షించుకున్నారు. అదే సందర్భాన్ని పురస్కరించుకుని, వర్తమాన తెలుగు సమాజంలో స్త్రీలకు సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి ఒక సమావేశం కూడా జరిగింది. అందులో ఆ పత్రిక 2012 నుంచి ప్రచురించిన సంపాదకీయాలను 'వాడిపోని మాటలు' రెండు, మూడు సంకలనాలుగా కూడా వెలువరించింది. 450 పేజీలకు పైచిలుకున్న ఈ రెండు పుస్తకాలలో కొండవీటి సత్యవతిగారితో పాటు పలువురు రాసిన 107 సంపాదకీయ రచనలు ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే తెలుగు స్త్రీలోకం చవిచూసిన పరిణామాలను ఒకసారి విహంగ వీక్షణం చేసుకున్నట్టు అవుతుంది.

మహా సంస్థల మూసివేత..

ఈ మూడు దశాబ్దాలలో తెలుగు సమాజం కూడా రాజకీయపరమైన ప్రపంచీకరణ, విశృంఖలమైన టెక్నాలజీ వినియోగం, ఉవ్వెత్తున మీద పడిన పెట్టుబడి పన్నాగాలు కారణంగా ఎన్నో మార్పులు సంభవించాయి. ఇప్పుడు కేవలం ఉద్యమాలు నిర్వహించిన సంస్థలు ప్రచురించే ప్రజాసాహితి, అరుణతార, అమ్మనుడి వంటి మాసపత్రికలు ఇంకా సాహిత్యప్రస్థానం, గ్రంథాలయ సర్వస్వం, మిసిమి, మల్లెతీగ, డెక్కన్ లాండ్, జాగృతి , స్వాతి వంటి కొన్ని పత్రికలే మిగిలాయి. కానీ ఈ మూడు దశాబ్దాల కాలంలో మూతపడిన సంస్థలు, మహా సంస్థలు చాలా ఉన్నాయి. 80 ఏళ్ళ చరిత్ర ఉన్న 'ఆంధ్రపత్రిక' సంస్థ, పదేళ్ళ కాలంలో మహా సంచలనాలు సృష్టించిన 'ఉదయం' పూర్తిగా మూతపడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరంలో మొదలైన 'చందమామ' సంస్థ అస్సామీ భాషకు కూడా విస్తరించి చివరకు ఆ మాసపత్రిక 21వ శతాబ్దంలో దాదాపు కనుమరుగైంది. ఇదొక పార్శ్వం కాగా 1995-96 కాలంలో టీవీ ఛానళ్ళు; 2003-2004 కాలంలో న్యూస్ చానెళ్ళు పెద్ద ఎత్తున వాణిజ్యాత్మకంగా రాజకీయ వ్యూహాలతో రావడంతో మరిన్ని అనర్థాలు హడావుడి లేకుండా సంభవించాయి!

దినపత్రికల సంస్థలకు సంబంధించి మూడు దశాబ్దాల క్రితం దాకా ఓ జోకు లాంటిది చలామణిలో వుండేది. దినపత్రికలు ప్రచురించిన తరువాత మిగిలిపోయిన న్యూస్ ప్రింట్‌తో వారానికోసారి వీక్లీ, నెలకోసారి మంత్లీ ప్రచురిస్తారని అనేవారు. ఆంధ్రపత్రికకు అదే పేరుతో వీక్లీ, ఇంకా భారతి, బాలరంజని, కలువబాల, సినిమా వారపత్రిక సినిమా రంజని ఉండేవి. అలాగే ఆంధ్రజ్యోతి సంస్థకు వీక్లీ, జ్యోతి చిత్ర వీక్లీ, వనితా జ్యోతి, బాల జ్యోతి మాసపత్రికలు ఉండేవి.

'ఆంధ్రపత్రిక' మూతపడి మళ్ళీ మొదలుకాలేదు. 'ఆంధ్రజ్యోతి' 2000లలో మూతపడి తర్వాత 2002లో కేవలం దినపత్రిక ఇంకా వేరే పేరుతో వీక్లీ మొదలయ్యాయి. ఈ వారపత్రిక 'నవ్య' కూడా కరోనా కాలంలో మూతబడింది. విజయచిత్ర, సినిమారంగం, రూపవాణి, చలనచిత్ర, వెండితెర, అలాగే చందమామ మాత్రమే కాక ఎన్నో పిల్లల, మహిళల, సాహిత్యపత్రికలు మూతబడ్డాయి.

కరోనాతో చివరి మంగళహారతి

నిజానికి మూడున్నర దశాబ్దాల క్రితం తొలుత 'ఆంధ్రభూమి' దినపత్రిక తర్వాత 'ఈనాడు' దినపత్రిక జిల్లా సమాచారాన్ని ప్రత్యేక అనుబంధాలుగా వేయడం ప్రారంభించాయి. మిగతా పత్రికలన్నీ అదే బాటలో నడిచాయి. ఇలా మొదలైన పెట్టుబడి పోకడల కారణంగా జిల్లాస్థాయిలో ఎంతో కాలంగా నడిచే పత్రికలు పూర్తిగా మూతబడి ఆయా ప్రాంతాల సమాంతర గొంతుకలకు కాలం చెల్లిపోయింది. అప్పటి వరకూ ఆదివారం సంచికలలో మాత్రమే సినిమా వార్తలుండేవి. ఆ కారణంతో సినిమాపత్రికలూ, మహిళల పేజీ కారణంగా మహిళా పత్రికలూ దెబ్బతిన్నాయి. 24 గంటల ప్రైవేట్ టెలివిజన్ వ్యాప్తి కారణంగా వార, సినీ, మహిళ, బాలల పత్రికలు పూర్తిగా చతికిలపడ్డాయి. మూడేళ్ళక్రితం ముంచుకువచ్చిన కరోనా మహమ్మారి చివరి మంగళహారతి గీతాన్ని మహాద్భుతంగా విలపించింది.

ప్రముఖ పత్రికలకూ నూకలు చెల్లాయ్

కానీ ఈ మూడు దశాబ్దాలకు మించిన ఈ కాల వ్యవధిలో అంతర్ధానమయిన ఆర్తనాదాలు చాలానే వున్నాయి. ఒక్క చిన్న పత్రికలే కాకుండా కొన్ని పెద్ద దినపత్రికల దెబ్బకు క్యాలెండర్లు, పంచాంగాలు ప్రచురించే సంస్థలు కూడా మూసివేతకు గురయ్యాయి. ఇప్పటి తరానికి అర్థంకాదు గానీ ఒక నవలను మాసపత్రిక రూపంలో బట్వాడా చెయ్యడానికి; నవలను నవలగానే పంపడానికి పోస్టల్ రుసుము చాలా తేడా వుండేది. దీనికి సంబంధించిన ఈ పోకడ వల్ల నవలలను ప్రచురించే సంస్థలు బాగానే దెబ్బతిన్నాయి. చివరకు ఈనాడు సంస్థ కూడా తన ఆంగ్ల దినపత్రికతో పాటు నవల, కథల, పిల్లల, వ్యవసాయదారుల, సినిమా, తెలుగు భాషకు సంబంధించిన పత్రికలను కూడా విజయవంతంగా మూసివేసింది. డెక్కన్ క్రానికల్ వారి 'ఆంధ్రభూమి' కరోనా సమయంలో మూతబడగా 'ఇండియా టుడే', 'సండే ఇండియన్', 'కేపిటల్ మార్కెట్' వంటి సంస్థలు ప్రచురించే తెలుగు పత్రికలకు కూడా నూకలు చెల్లిపోయాయి.

పార్టీల పత్రికలు ప్రారంభం

ఇలా చూసినప్పుడు లెక్కకు మించిన రాజకీయ, సినీ, డిటెక్టివ్, ఆరోగ్య, ఆధ్యాత్మిక పత్రికలు ఎంతోమందికి తెలియకుండా అదృశ్యమయ్యాయి. టెక్నాలజీ కారణంగా రాజకీయపార్టీలతో అంతర్గతంగానో, బహిర్గతంగానో ముడిపడిన దినపత్రిక సంస్థలు ఎన్నో ఎడిషన్లు పెట్టడమే కాక మదరాసు, బెంగుళూరు ఇంకా ఢిల్లీ, ముంబాయి వంటిచోట్ల కూడా ప్రచురణను ప్రారంభించాయి. అంతకు మించి కొన్ని దినపత్రికలే టివి రంగంలోకి కూడా ప్రవేశించాయి.

ప్రకాశిస్తున్న చిన్న పత్రికలు

ఇన్ని పరిణామాల మధ్య ఎన్నో కొన్ని చిన్నపత్రికలు ప్రకాశిస్తూ వుండడం హర్షణీయమే. ఇక మహిళా ప్రగతి విషయానికి వస్తే స్వాతంత్ర్యం రావడానికి మూడు దశాబ్దాల పూర్వ కాల వ్యవధిలో సాధించిన భారతీయ మహిళ సాధించిన విజయాలు చాలా గణనీయంగా ఉన్నాయి. తరువాతి కాలంలో విస్తరించిన పాఠశాలలు, అక్షరాస్యత కారణంగా ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపించే ధోరణులన్ని ఆరుదశాబ్దాల క్రితం బీజప్రాయంగా మొదలై క్రమంగా వ్యాపించాయి. స్త్రీవాద తెలుగు మాసపత్రిక 'భూమిక' మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేవలం తెలుగు మీడియా పరిణామాలని విహంగ వీక్షణంగా గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాం. చాలా పత్రికల, సంస్థల పేర్లు పేర్కొనకపోవడానికి కారణం స్థలాభావమే తప్ప మరో కారణం ఏమీ లేదు!

-డా. నాగసూరి వేణుగోపాల్

9440732392




Advertisement

Next Story

Most Viewed