దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరగాల్సిందే!

by Ravi |   ( Updated:2023-03-15 18:45:46.0  )
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరగాల్సిందే!
X

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుకొని ఎవరిపై దాడులు చేయాలని సూచిస్తే వారిపై దాడి చేస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే సీబీఐ గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య గుర్తొస్తుంది. ఆయన సీబీఐని ‘పంజరంలో చిలుక’ అని అభివర్ణించారు. మాస్టర్ ఏం మాట్లాడితే.. అదే చిలుక పలుకుతుందన్నట్లు వివరించారు. నిజానికి రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఈడీ, సీబీఐ సంస్థలు బీజేపీ పెద్దల చేతిలో కీలుబొమ్మలుగా మారి, ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ అసలు విధులను పక్కనపెట్టి.. బాసులు చెప్పే లక్ష్యాలను వేటాడడం మొదలుపెట్టాయి. వీటిలో ఈడీ ముందు వరుసలో ఉన్నది. ఈడీని ఏర్పరచింది మంచి లక్ష్యం కోసమే. అందుకే దానికి విచక్షణారహిత అధికారాలు ఇచ్చారు ఎంతలా అంటే ఆ సంస్థ విచారణ జరిపే వ్యక్తికి తనపై ఏం అభియోగాలున్నాయో తెలుసుకునే హక్కు కూడా ఉండదు. ఈడీ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ను కేసుకు సంబంధించిన వ్యక్తికి ఈడీ తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం లేదనే నిబంధన కూడా ఉండేంతగా. ఇంతటి అధికారాలు ఉన్నా ఈడీకి దాని అధిపతి అయిన సంజయ్‌కుమార్‌ మిశ్రాకు పదవి విరమణ చేయాల్సి ఉన్నా, నిబంధనలను మార్చి మరీ పదవీకాలాన్ని పొడిగించి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతుంది కేంద్రం.

ఇదేనా మోడీ మార్క్ రాజకీయం?

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీ, సీబీఐని ఉసిగొల్పి దాడులు చేయిస్తుంది కేంద్రం. ఇదే ఇప్పుడు దేశంలో నెలకొన్న దుస్థితి. గత తొమ్మిదేళ్ళుగా ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప్రతీకార దాడులను జరుపుతూ బీజేపీ నిరంకుశ విధానాలను అనుసరిస్తున్నది. ఇప్పటి వరకూ ఈడీ మొత్తం 121 కేసులు నమోదు చేస్తే అందులో 115 విపక్ష నాయకులపైనే నమోదయ్యాయి. అలాగే, సీబీఐ కూడా 124 నమోదు చేయగా అందులో 118 ప్రతిపక్షాలపైనే. అయితే ఇందులో నేరారోపణలు రుజువైంది మాత్రం 0.5 శాతం మాత్రమే. అంటే కేవలం విపక్ష నేతల వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి, వారిని వేధించడానికి మాత్రమే ఈ సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటున్నది. ఇలాంటి తప్పుడు కేసుల కారణంగా.. ఒకప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేరున్న ఈడీ, సీబీఐ సంస్థలు ప్రజల్లో పలుచనవుతున్నాయి. అలాగే పీఎంఎల్‌ఏ (మనీ ల్యాండరింగ్‌) సెక్షన్ల కింద గత తొమ్మిదేండ్లలో పెట్టిన కేసులు 5,422 కాగా, వీటిలో ప్రతిపక్ష నాయకులపై నమోదైనవి 5,150 ఉన్నాయి. కానీ పదేండ్ల యూపీఏ హయాంతో పోలిస్తే, విపక్షాలపై నమోదైన కేసులు 27 రెట్లు ఎక్కువ. అయితే అప్పటి వరకు దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొనే నేతలు బీజేపీలో చేరగానే సచ్ఛీలురుగా మారుతున్నారు. వారి కేసులు ఏమవుతున్నాయో తెలీదు. నారాయణ్‌ రాణె, సువేందు అధికారి, హిమంత బిశ్వశర్మ, ముకుల్‌ రాయ్‌ జ్యోతిరాదిత్య సింధియా, మన తెలుగు రాష్ట్రాల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఉదాహరణలు. అధికార పార్టీకి చెందిన వారు ఎన్ని ఆర్థిక నేరాలకు పాల్పడిన, వారిపై ఎలాంటి కేసులు ఉండవు. ఈ సంస్థలు వారి ఛాయలకు కూడా వెళ్లవు. కేవలం బీజేపీ విధానాలను విమర్శించే వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి, వెంటాడి వేధించడమే మోడీ మార్క్ రాజకీయం.

వ్యవస్థలు మీ చేతుల్లో ఉండొచ్చు.. కానీ

75 ఏండ్ల దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఈ దేశాన్ని ఆకలి, విద్యుత్, తాగునీరు, నిరుద్యోగం లాంటి సమస్యలు వేధిస్తుంటే.. వాటికి పరిష్కార మార్గాలు వెతకాల్సిన కేంద్ర ప్రభుత్వానికి ఆ సోయి లేకుండా పోగా, ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం, ఎమ్మెల్యేలకు ఎర వేసి ప్రభుత్వాలను కూల్చడమే! దీనినే 'ప్రైస్ ఆఫ్ ది మోడీ ఇయర్స్ బుక్' దేశ పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ వివిధ అంతర్జాతీయ, ఆర్థిక, సామాజిక, రాజకీయ సూచీలకు సంబంధించి దేశం ఏ స్థానంలో ఉందో ఈ పుస్తకం వెల్లడించింది. మోడీ అధికారం చేపట్టాక దేశం అన్ని అభివృద్ధి సూచీలలో వెనకబడటం గమనార్హం. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన కోట్ల రూపాయలు రద్దు చేసిన బీజేపీ పెద్దలు.. ప్రజల సంక్షేమం కోసం ఇచ్చే ఉచితాలను ‘అనుచితాలు’ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.

అయితే దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాల్సిందేనని బీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు ఇచ్చారు.

కేంద్ర ఎజెన్సీలు ఎన్నో సోదాలు చేసినా అంతిమంగా తేల్చేది ఏమీ ఉండదు, వారిది వృధా ప్రయోసే! వారి దాడులకు బీఆర్ఎస్ నాయకులు భయపడటం లేదు. ఇప్పటికే బీజేపీ కుట్రలను దేశం ముందు ఉంచిన కేసీఆర్, కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి కలిసొచ్చే ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించి సమర శంఖం పూరిస్తున్నారు. అయితే, బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఈ రోజు వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే.. రేపు అవే వ్యవస్థలు మీ పని పడతాయి. తస్మాత్ జాగ్రత్త!

బచ్చు శ్రీనివాస్

బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు

93483 11117

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed