- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుల గణన రాజకీయాల్లో గేమ్ చేంజర్
ప్రస్తుతం దేశంలో కుల గణన జరగడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా చేసి బీసీ, ఎస్సీ , ఎస్టీలకు ఎవరి జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్లు పెంచుతాం, సామాజిక, ఆర్థిక న్యాయాన్ని పాటిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడుతామని చెబుతూ రాహుల్ గాంధీ ప్రధాన పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనే అన్ని పార్టీలలో కదలికను, వేడిని, భయాన్ని పుట్టిస్తుంది. దేశంలో కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పార్లమెంట్లో కోరితే ఎన్డీఏ ప్రభుత్వం ఈ అంశంపై మాట్లాడడమే పాపం అన్నట్లు వ్యవహరించింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని రాహుల్ ఆ వర్గాలకు మాటిచ్చారు.
అందులో భాగంగానే నేడు తెలంగాణలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ చేత కుల గణన చేయాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా, ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలన చేయాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణనకు శ్రీకారం చుట్టింది. ఈ కుల గణనే దేశంలో జరగబోయే కుల గణనకు ఒక మోడల్‌గా, దిక్సూచిగా కూడా ఉంటుందని, ఈ కుల గణన తర్వాతే కేంద్రంలో మోడీపై యుద్ధం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
బీఆర్ఎస్‌లో కలవరపాటు..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక బీసీల రిజర్వేషన్లపై అధ్యయనం చేయడానికి పార్టీ నాయకత్వాన్ని పక్క రాష్ట్రాలకు పంపి బీసీల కోసం ఏదో ఉద్ధరిస్తున్నట్లు డ్రామా మొదలెట్టింది. కేసీఆర్ చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేత రాహుల్ గాంధీ చేయిస్తున్నందుకు, బీసీలపై, కుల గణనపై మొసలి కన్నీరు కారుస్తోంది. గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ నుంచి 23 శాతానికి తగ్గించినప్పుడు లేని ప్రేమ హఠాత్తుగా విపరీతమైన ప్రేమను బీసీలపై వలకబోస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తే ఆయా సామాజిక వర్గాల నుంచి తమ పార్టీకి ఉన్న మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందనే భయం బీఆర్ఎస్‌లో మొదలైంది. అందుకే కేటీఆర్ విషం కక్కుతూ ఈ అంశంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బీసీలపై కేసీఆర్ చేసిన తప్పులు ఏంటో వారికే అర్థం అవుతుంది.
డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ
ఇంకో పక్క తెలంగాణ బీజేపీ నాయకుల తీరు నిజంగా డబుల్ ఇంజన్, డబుల్ గేమ్‌లానే ఉంది. కేంద్రంలో ఒక తీరు, రాష్ట్రంలో ఒక తీరుతో ఉంది. కేంద్రంలో రాహుల్ గాంధీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఏకంగా ఏ కులం, మతం లేని వాళ్ల కుల గణన కోరుతున్నారు. వారి కులం, మతం ఏంటో చెప్పాలంటూ రాహుల్ గాంధీని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మతం పేరు చెప్పి రాజకీయ పబ్బం గడిపే బీజేపీ నేతలు తరుచూ కుల గణన చేయడమే దురదృష్టకరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ స్థితప్రజ్ఞత
ఇప్పటికీ కులాలలోని నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉండాలని కోరుతున్న వారు లేకపోలేదు. ఎన్ని అడ్డంకులు, అవమానాలు ఎదురైనా రాహుల్ గాంధీ పేద ప్రజల వైపే నిలబడ్డారు. సామాజికంగా, ఆర్థికంగా, సంస్థాగత పరంగా పూర్తిస్థాయిలో రాజకీయ, విద్యా, ఉద్యోగ పరంగా ఎవరు ఎంత జనాభా ఉన్నారో అంత రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇప్పుడున్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసే వరకు నేను రాజకీయంగా పూర్తిగా మూల్యం చెల్లించుకున్నా పర్లేదు కానీ ఈ 90% ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడుతూనే ఉంటానని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అత్యధిక జనాభా కలిగిన వర్గాలకు న్యాయం చేకూరే విధంగా కుల గణన జరగాలని దానికి బలంగా పోరాటం చేస్తానని, తన దృష్టి అంతా దానిపైనే ఉంటుందని ప్రకటించడం వెనుకబడిన వర్గాలకు కొండంత బలాన్ని ఇస్తుంది. దానికోసం దేశవ్యాప్తంగా అన్ని వెనుకబడిన సామాజిక వర్గాలను ఐక్యం చేసి పోరాటం చేయడానికి పూనుకోవడంతో బీజేపీలో కొంత భయాన్ని పుట్టిస్తుంది.
జనాభాలో 5 శాతం లేని వాళ్లదే ఇంకా మెజార్టీనా?
ఈ 90% వర్గాలకు సామాజిక న్యాయం అనే ప్రధానమైన సమస్యను ఎదుర్కోవడానికి, కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించడానికే బీజేపీ రకరకాలు ప్రయత్నిస్తుంది. ఈ ప్రశ్నలకు మోడీ నుంచి మౌనమే మిగిలింది. ప్రాతినిధ్యం లేని వాడికి పాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని రాజ్యాం గంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. కానీ జనాభాలో 5 శాతం లేని వాళ్లు పాలనలో ఇప్పటికీ మెజార్టీగా ఉన్నారు. ఇక 50% రిజర్వేషన్లు దాటి అదనంగా 10 శాతం EWS రిజర్వేషన్లు ఇచ్చుకోవడానికి లేని వ్యతిరేకత, నిబంధన మిగతా వెనుకబడిన కులాలకు ఎందుకు పరిమితి అనేదే ప్రశ్న? ఈ 50% రిజర్వేషన్ల పరిమితిని కోరేవారు, అధికారం ఎవరి చేతిలో బందీ కావాలని కోరుతున్నారో? రాహుల్ గాంధీ ఇచ్చిన "సామాజిక కుల గణన" నినాదం భావిభారత రాజకీయాల్లో గేమ్ చేంజర్ కావడం తథ్యం.
డాక్టర్. మండ్ల రవి
ఉస్మానియా యూనివర్సిటీ
91777 06626