- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైండ్ గేమ్‌తో ప్రజలను మాయ చేయొచ్చా!
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడేలా కనిపిస్తున్నాయి. ప్రజలను గందరగోళానికి గురి చేసి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాయి. అయితే తెలంగాణ ఓటర్లు అన్ని పార్టీలను నిశితంగా గమనిస్తున్నారు. నాయకుల మాటల్లోని అంతరార్థాలను గుర్తిస్తున్నారు. వాస్తవాలను గుర్తించి.. వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం సైతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ నేతల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మారనేది మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తేలనుంది.
‘నాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు’ ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి.. ‘కాంగ్రెస్ సర్కారు ఎక్కువ రోజులు ఉండదు.. రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగే అవకాశాలు తక్కువ’... ఇవీ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్... ‘బీఆర్ఎస్ఎల్పీ త్వరలోనే ‘హస్తం’లో విలీనమవుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు..’ కాంగ్రెస్ నేతల లీకులివి.. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మాయ చేసేలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జనాన్ని గందరగోళంలో పడేసే ఉద్దేశ్యంతోనే చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి.
‘బీ టీమ్’ ప్రచారంతో నష్టపోయిన బీజేపీ
కేసీఆర్ పట్ల సాఫ్ట్ కార్నర్‌గా ఉంటారనే పేరున్న కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాక.. కాంగ్రెస్ సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కేసీఆర్ సూచన మేరకే కిషన్ రెడ్డికి పదవి అప్పగించారని ప్రచారం మొదలుపెట్టింది. బీఆర్ఎస్.. బీజేపీకి ‘బీ’ టీమ్ అని, అందుకే బండి సంజయ్‌ను తప్పించి.. ఆయనను ఎంపిక చేశారని పదేపదే చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్టు చేయకపోవడం ఇందుకు నిదర్శనంగా చూపించింది. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మినట్టు కనిపించారు. బీఆర్ఎస్‌పై కోపంతో అప్పటి వరకు బీజేపీ వైపు నిలిచిన వాళ్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ప్రారంభించారు. బీజేపీకి సపోర్ట్ చేస్తే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆందోళన చెందారు. దీంతో వన్ సైడెడ్‌గా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. బీజేపీ తీవ్రంగా నష్టపోయింది.
ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీపై వైపు దృష్టి సారించారు. సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఎంతోమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో, బీజేపీలో చేరిపోయారు. కీలక నేతలు మెల్లమెల్లగా పార్టీని వీడుతున్నారు. దీంతో పార్టీ బలహీనం కాకుండా ఉండటానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకసారి తమతోనే ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పడం, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని మరోసారి చెప్పడం, బీజేపీయే ప్రభుత్వాన్ని పడగొడుతుందని పేర్కొంటుండడం ప్రజలను గందరగోళంలో పడేస్తున్నది.
‘ఏ-టీమ్’ మచ్చను తొలగించుకునేందుకు..
‘అబ్ కీ బార్.. చార్ సౌ పార్’ నినాదంతో లోక్ సభ ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనుభవంతో ముందుగా బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ-టీమ్’ అనే మచ్చను తొలగించాలనుకుంటున్నది. తద్వారా రాష్ట్ర ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నది. అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేశారనే ప్రచారం సైతం జరుగుతున్నది. అంతేకాకుండా బీజేపీ నేతలు ఏక కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలిపి విమర్శించారు. ఆ పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందని ఆరోపిస్తున్నారు. ప్రచారంలో ఎక్కువ శాతం ప్రధాని మోడీ పైనే ఆధారపడుతున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వంటి నేతలు పదేపదే మాట్లాడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. పనిలో పనిగా బీఆర్ఎస్ అవినీతిని సైతం లేవనెత్తుతున్నారు. తద్వారా తమకు ఏ పార్టీతోనూ ఎలాంటి అంతర్గత అవగాహన లేదని ప్రజల్లో తీసుకెళ్లి.. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు.
విపక్షాలను వీక్ చేసేలా..!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలను గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నది. ఇందుకోసం విపక్షాలను వీక్ చేసేలా అడుగులు వేస్తున్నది. ముందుగా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి అందులోని ఎంపీ, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్పించుకుంటున్నది. పనిలో పనిగా బీజేపీకి చెందిన నేతలకు సైతం ద్వారాలు తెరిచింది. బలమైన అభ్యర్థులు దొరకని చోట ఇతర పార్టీల నేతలను చేర్పించుకొని టికెట్లు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్ అని ప్రచారం చేస్తున్నది. అందుకే రెండు పార్టీల నాయకులు తమ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నది. ప్రజల్లో సింపతీ కోసం ప్రయత్నిస్తున్నది.
ఎవరి మాటలు నమ్ముతున్నారు
ప్రజలతో మైండ్ గేమ్ అడేలా అన్ని పార్టీలు చేస్తున్న ఈ ప్రకటనలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నాయకుల మాటల అంతరార్థాన్ని గుర్తిస్తున్నారు. ఏ పార్టీ నేతల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మారనేది మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తేలనుంది.
-ఫిరోజ్ ఖాన్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464