టీచర్ల సమస్యలకు పెద్దలు పరిష్కారం చూపేనా?

by Ravi |   ( Updated:2023-03-22 18:31:08.0  )
టీచర్ల సమస్యలకు పెద్దలు పరిష్కారం చూపేనా?
X

న రాష్ట్ర శాసన వ్యవస్థలో శాసనసభ (విధాన సభ), శాసన మండలి (విధాన పరిషత్) అనే రెండు చట్టసభలున్నాయి. వీటిలో శాసనమండలిని ‘పెద్దల సభ’గా అభివర్ణిస్తుంటారు. ఇందులోని సభ్యులను ఎమ్మెల్సీలుగా పేర్కొంటారు. వీరిని స్థానిక సంస్థల సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. ఈ సభలో ఆయా రంగాలలో లబ్ధప్రతిష్టులైనవారు కవులు, రచయితలు, కళాకారులు మొదలైన వారితో పాటు మేధావి వర్గంగా భావిస్తున్న ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం ఉంటుంది.

అయితే ఈ సభలోనున్న మేధావులు, అనుభవజ్ఞులు, అంకితభావం కలవారు చట్టసభల్లో ఉండటం వల్ల ఆయా వర్గాలకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ఎంతో ప్రయోజనం. తమ అనుభవంతో రాజకీయాలకు అతీతంగా దూరదృష్టితో ఆలోచించి మెరుగైన వ్యవస్థ కోసం నిర్మాణాత్మక విమర్శనతో విధానపరమైన సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం ఈ పెద్దల సభ సభ్యుల కర్తవ్వం. ఆ సందర్భంలోనే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గం, రంగం ప్రయోజనాలు నెరవేరే విధంగా పాలక పక్షానికి మార్గదర్శనం చేయగలగాలి..

ఈ వ్యవస్థ తరువాతే మరిన్ని సమస్యలు..

అధికార సభ్యులు కొన్ని సందర్భాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని చట్టాలు చేసుకుంటూ పోతుంటుంది. అయితే దానివలన కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే ఆ చట్టాల దీర్ఘకాలిక ప్రభావాలు మంచి చెడులను ఆలోచనాత్మకంగా విశ్లేషించి, సమర్థతతో తగిన మార్పులు, చేర్పులు చేసేలా శాసనమండలి సభ్యులు కృషి చేయాలి. అది వారి కర్తవ్యం. ఉమ్మడి రాష్ట్రంలో 1985 వరకు ఉన్న ఈ వ్యవస్థ రద్దు చేయబడి తిరిగి 2007లో ప్రారంభమైంది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడంతో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఇప్పటికి మూడు పర్యాయాలు ఎమ్మెల్సీలను ఎన్నుకొని మండలికి పంపారు. అయినా వారి సమస్యలకు పరిష్కారం దొరక్కపోగా, మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ ఎమ్మెల్సీ వ్యవస్థతో రాష్ట్రంలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘాల మనుగడ ప్రశ్నార్థకమవుతోందనడంలో అతిశయోక్తి లేదు. ఈ వ్యవస్థ లేక మునుపు ఉపాధ్యాయ సమస్యలపై చర్చించడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగిన ప్రధాన సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలతో ముఖ్యమంత్రి, మంత్రులు, సమావేశం నిర్వహించేవారు. ఆ చర్చల ద్వారా అనేక కీలక సమస్యల పరిష్కారం కోసం ఉత్తర్వులు సాధించుకున్న సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ శాఖకు లేని ఎమ్మెల్సీ అవకాశం ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. అలాగే ఏ శాఖలో లేని ఇబ్బందులు ఒక్క విద్యాశాఖలోనే ఉన్నాయి. మరి ఈ వ్యవస్థ సరిగా పని చేస్తే సమస్యలు తగ్గాలే కానీ రోజురోజుకు పెరుగుతున్నాయని సగటు ఉపాధ్యాయుడు ఆందోళన చెందుతున్నాడు.

ప్రభుభక్తిని విడిచిపెట్టండి..

గతంలో పనిచేసిన ఎమ్మెల్సీల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్నిక కాబడిన ఎమ్మెల్సీలు అధికార పక్షాన చేరి వారిని ప్రశ్నించకపోవడంతో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాకుండా పోయాయి. వారి సమస్యలను మండలి సభ్యులు సమావేశాల్లో ప్రశ్నిస్తే కచ్చితంగా ప్రభుత్వం సమాధానమివ్వాల్సిందే. అందుకే గెలిచిన సభ్యులను ప్రశ్నించకుండా చేస్తుంది ప్రభుత్వం. ఇక ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నో ఏళ్ళుగా నాన్చుతోంది ప్రభుత్వం. ఏకీకృత సర్వీస్ రూల్స్, భాషా పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్, సీపీఎస్ రద్దు, స్థానికత కోల్పోయిన 317 జీఓ, పదోన్నతులు, బదిలీలు, ఒకటో తేదీ జీతాలు, జీపీఎఫ్, ఇన్సూరెన్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బకాయిలు తదితర సమస్యలు ఇప్పటికి వెంటాడుతున్నాయి. అందులో కొన్ని సమస్యలు తీరుస్తానని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ నేటికీ తీర్చలేదు ప్రభుత్వం.

అందుకే ఉపాధ్యాయులు వేసిన ఓట్లతో ఎన్నికై శాసనమండలిలో అడుగిడిన ఎమ్మెల్సీలు పాలకపక్షం ఏదైనా సరే, తమ ప్రభుభక్తిని విడిచిపెట్టి ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై సాధికారతతో చట్టసభలో గళమెత్తాలి. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టెలా వ్యవహరించగలగాలి. ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం మద్దతుతో ఎమ్మెల్సీలు గెలిచిన దాఖలాలు లేవు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్సీలు ఏ ఒక్క సంఘానికి ఒత్తాసు పలకకుండా వివిధ మేనేజ్మెంట్‌లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి. అన్ని ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్మించిననాడే ఉపాధ్యాయ సమస్యలు సాధించబడతాయనేది వాస్తవం.

సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed