బాలల అక్రమ రవాణా నివారించలేమా?

by Ravi |   ( Updated:2023-08-28 23:16:06.0  )
బాలల అక్రమ రవాణా నివారించలేమా?
X

ప్రపంచవ్యాప్తంగా అనాధ బాల, బాలికలను అపహరించే ముఠాలు పెరిగిపోతున్నాయి. కాసుల కోసం కక్కుర్తి పడి డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా సరసన, మానవ అపహరణ కూడా చేరిపోయింది.ఇది నేర ప్రపంచంలో లాభసాటి వ్యాపార వస్తువుగా చలామణి అవుతుంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాల బాలికలను ఎక్కువగా కొన్ని నేరస్తుల గ్యాంగులు అక్రమ రవాణా చేస్తున్నాయి. లభిస్తున్న సమాచారాన్ని లోతుగా పరిశీలించి చూస్తే ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉంది.

ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన, కైలాస్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్,(కే.యస్.సీ.ఎఫ్.), గేమ్స్ 24×7 సంయుక్తంగా పరిశోధన చేసి 'చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా' పేరుతో ఒక తాజా నివేదికను విడుదల చేశాయి. ఈ నివేదికను పరిశీలిస్తే, కోవిడ్ తర్వాత ఢిల్లీలో బాల బాలికల అక్రమ రవాణలో 68 శాతం పెరుగుదల కనిపిస్తుంది. అలాగే 2016-23 మధ్య ఉత్తరప్రదేశ్‌లో అధికంగా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలో తీవ్ర స్థాయిలో ఉన్న చిన్నారుల అక్రమ రవాణా సమస్యను అధ్యయనంలో ఎత్తి చూపారు. ఆ తర్వాత స్థానాల్లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.

వీరిలో ఎక్కువగా 13 నుండి 18 ఏళ్ల వయసు లోపు పిల్లలే ఎక్కువమంది ఉన్నారు. అలాగే ఇది 2016 నుంచి 2022 వరకు వ్యవధిలో రక్షింపబడిన వారిలో 13,549 మంది చిన్నారులు ఉన్నారు. వారిలో 13 శాతం మంది 9 నుంచి 12 ఏళ్ల పిల్లలు ఉన్నారు. 02 శాతం మంది 9 కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులు ఉన్నారు. వారిలో అధికంగా 80 శాతం మంది 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు ఉన్నారు. ఈ చిన్నారులను అక్రమ రవాణా చేసి, బానిసలుగా మార్చి వివిధ రంగాల పరిశ్రమల్లో, గనులలో బాల కార్మికులుగా, లైంగిక అవసరాలకు వాడుకుంటున్నారు. హోటల్లో, దాబాల్లో 15.6% మంది, ఆటోమొబైల్ లేదా రవాణా రంగంలో 13 శాతం మంది, వస్త్ర పరిశ్రమలో 11.18% తర్వాత స్థానంలో ఉన్నాయని తెలిపింది. ఐదు నుంచి 18 ఏళ్ల చిన్నారులు కూడా కాస్మోటిక్ పరిశ్రమలో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ప్రభుత్వాలు అలసత్వం వీడాలి!

పైన పేర్కొన్న రాష్ట్రాల్లో పిల్లల అక్రమ రవాణా కేసుల్లో ఘనంగా పెరుగుదల కనపడుతుందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో 2021-22 సంవత్సరం మధ్యకాలంలో ఈ కేసుల సంఖ్య 1,214 కి పెరిగింది. అదేవిధంగా కర్ణాటకలో ఈ కేసులు 18 రెట్లు పెరిగి అవి 110 కి చేరాయి. ఇదే విషయంలో 2018లో అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. చిన్నారుల అక్రమ రవాణాలను అరికట్టేందుకు సమగ్రమైన అక్రమ రవాణా వ్యతిరేక చట్టం ఉండాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం తెలియచెప్పింది.

నేటికీ దేశంలో సగటున వందమందికి పైగా పిల్లలు అదృశ్యమైపోతున్నారు. ఈ విషయంలో 2013లో బచపన్ బచావో ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023 జనవరి నాటికి 2.43 లక్షల' ఫాక్సో కేసులు కోర్టుల్లో అపరిష్కృతంగా పోగుపడి ఉన్నాయి. ఇలాంటి కఠిన చట్టాలను రూపొందించటం ఒక ఎత్తైతే, దానిని అమలు పరచటం మరో సవాలుగా మారింది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అలసత్వం వీడాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి ఆచూకీ కనిపెట్టాలి. పటిష్టమైన వ్యూహంతో కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా కార్యచరణకు పూనుకోవాలి. దేశ భవిష్యత్తు బాల బాలికల సంరక్షణపై ఆధారపడి ఉంది.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Advertisement

Next Story