నాటి ఫిరాయింపులే.. నేడు ఫిరంగులు..

by Ravi |
నాటి ఫిరాయింపులే.. నేడు ఫిరంగులు..
X

నీళ్లు, నిధులు, నియామకాల్లో, అన్యాయం జరిగిందని సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. అయితే, గతంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన తమ విధానాన్నే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నది. కాలం ఎంత త్వరగా గుణపాఠం నేర్పిస్తుందో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. వారికి నాటి ఫిరాయింపులే నేడు ఫిరంగులు అయినాయి.

రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆ రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి పదవులను పొందిన తరువాత అక్రమంగా మరొక పార్టీలో చేరడాన్ని ఫిరాయింపు లేదా పార్టీ ఫిరాయింపు అంటారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లతో 63 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చి పరిపాలన మీద దృష్టిపెట్టాల్సింది పోయి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షం మొత్తాన్ని తమ పార్టీలో విలీనం చేసుకుంది. అందులో కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలిచి సంపూర్ణ అధికారం చేపట్టినప్పటికీ కాంగ్రెస్ పక్షం నుంచి 12మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని సీఎల్పీని విలీనం చేసుకుంది. ఈ చర్యలు తెలంగాణ ప్రజలను విస్మయానికి గురిచేశాయి.

అహంకార వ్యాఖ్యలతో పతనం

రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం బతకగలుగుతుంది. అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ప్రశ్నలతో పాలన గాడి తప్పకుండా ఒక యంత్రం వలే పనిచేస్తుంది. ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన తమ విధానమే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలో అనేక మంది మాకు టచ్‌లో ఉన్నారు, మహారాష్ట్ర వలే ఏకనాథ్ షిండేలు ఉన్నారు, 39 సీట్లు చేతిలో పట్టుకుని మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టబోతున్నారు అని ప్రకటిస్తూ నేరుగా వాళ్ల పార్టీని పతనావస్థకు తీసుకెళ్ళారు. దీంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా ఉందని భావించిన అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునే విధానానికి శ్రీకారం చుట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. బీఆర్ఎస్ నేర్పిన ఫిరాయింపుల రాజకీయాలు నేడు ఆ పార్టీకే ప్రమాదకరంగా మారిపోయాయి.

భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉండటంతో..

రేవంత్ రెడ్డి పదవి కొల్పోతాడు, ప్రభుత్వం పడిపోతది, మళ్లీ అధికారం చేపట్టబోతున్నం అనే వ్యాఖ్యల వలన, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ముందు, తరువాత రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం జరుగుతూనే ఉంది. ఇటీవల లోకసభ ఎన్నికల్లో ఒక్క సీటూ కూడా గెలుపొందకపోవడంతో, ఉన్న నాయకులకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీకి రంగం సిద్ధం చేసి ఉంచింది. గ్యారెంటీ పథకాలు శరవేగంగా అమలు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు కనుక, మరో కొంతమంది శాసనసభ్యులు జై కొడుతూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. స్థానికంగా వారినే నమ్ముకున్న క్యాడర్, కార్యకర్తలకు కూడా ఇప్పుడు గడ్డు పరిస్థితులు, వారి అగ్రనాయకులు నోటి దురుసుతోనే పార్టీ పరిస్థితి బలహీనతకు దారితీస్తుంది అని మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు మనది అయితే సోమవారం మందిది అయితే మంగళవారం అన్నట్టు యావత్ ప్రజా లోకానికి కనిపిస్తున్నారు.

జాజుల దినేష్

96662 38266

Advertisement

Next Story

Most Viewed