- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోరు మాన్పి, పోరు సల్పితేనే…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అందరూ ఊహించిన విధంగానే టీడీపీ - జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసిపోయింది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరినట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీ సంకీర్ణ పునరుజ్జీవనం ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యానికి సంక్లిష్టతకి చెందిన మరొక పొరను జోడిస్తుంది. కూటమి ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఎన్నికల సవాళ్లను ముందుకు నడిపించే దిశలో సమన్వయం, నియంత్రణా రీతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమ్మిళిత వ్యూహాన్ని రచిస్తూనే టీడీపీలో అంతర్గత అసమ్మతి వైపు అందరి దృష్టి మళ్ళింది.
పొత్తు కుదిరింది కానీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కేటాయింపు సమగ్ర స్వరూపాన్ని పరిశీలిస్తే ఏపీలోని పార్లమెంట్ నియోజకవర్గాలు 25, శాసనసభ నియోజకవర్గాలు 175. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 2 స్థానాల్లో బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇంకా మిగిలిన 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 144, జనసేన 10, బీజేపీ 21 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. కొన్ని నెలల క్రితం చంద్రబాబుతో జనసేన చేతులు కలపడంతో, అధికార వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు కూటమిలో బీజేపీ భాగమవ్వాలని ఒత్తిడి తెచ్చి ఒప్పించారు.
విపక్షంలో అసమ్మతి జ్వాలలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల విషయంలో కసరత్తును పూర్తి చేశాయి. అధికార పార్టీ వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దాదాపు అన్ని స్థానాలకు క్యాండెంట్లను ఖరారు చేసింది. టీడీపీ ఇప్పటివరకు ప్రకటించిన జాబితాల్లో పలువురు సీనియర్లకు చోటు దక్కక పోవడంపై సీనియర్లు పార్టీ తీరుపై అసంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తొలి ప్రతిపాదనలో లేని శ్రీకాకుళం అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఈ నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. చివరి నిమిషంలో సర్దుబాట్లలో భాగంగా ఉత్తర ఆంధ్ర జిల్లాల నుంచి జనసేనకు ఒక సీటు దక్కే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా బీజేపీతో సీట్ల పంపకంలో భాగంగా ఒకటి రెండు మార్పులు జరిగే అవకాశం ఉంది.
అనిశ్చితిలో కమలం
రాజకీయ ఎత్తుగడల మధ్య బీజేపీ ప్రస్తుతం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఇటీవల పురంధేశ్వరితో చర్చలు జరిపినా అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల కేటాయింపులు ఖరారు చేయడంలో మరింత పురోగతి అవసరమని పార్టీ అంతర్గత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గణనీయబలం, విజయావకాశాలున్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా భావిస్తున్న ఆరు ఎంపీ నియోజకవర్గాలు కూడా ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అరకు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, హిందూపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సీట్లను టీడీపీ బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. తొలుత విజయవాడ, విశాఖపట్నం సీట్లను కూడా కేటాయించాలని బీజేపీ కోరింది.
మేం సిద్ధం...
ఈ సారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి మరోమారు అధికారంలోకి రావాలనే వ్యూహంతో వైసీపీ అభ్యర్థులని ప్రకటించి మొదట దూకుడు గానే వ్యవహరించింది.
టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో పదునైన విమర్శలు చేసిన వైసీపీ బీజేపీ కూటమిలో చేరగానే కాస్త నెమ్మదించిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు గతంలో కేంద్రంపై ఒత్తిడి చేయలేని వైసీపీ స్వప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి నడిచిందనేది యథార్థం. టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పొసగదని ధీమాగా వున్న వైసీపీకి ఈ పొత్తు వేగనిరోధకమనే చెప్పాలి. వైసీపీ చేసిన సంక్షేమ కార్యక్రమాలే గెలుపు మంత్రాలని భావించిన పార్టీ ఆత్మశోధనలో పడింది. ప్రచారంలో ఎన్నికల సన్నద్దత, పోల్ మేనేజ్‌మెంట్‌లో సరికొత్త వ్యూహాలను రచించే పనిలో వుంది. అసమ్మతి నివురుగప్పిన నిప్పులా వుంది. దీనికి తోడు ఇంటిలోని ఇంతి పోరు షర్మిల, సునీత రూపంలో తలనెప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు వైసీపీ మీద ప్రభావం చూపవచ్చు.
బీజేపీ ధ్యేయం
తీస్ రీ బార్ చార్ సౌ కీ పార్ అన్నది బీజేపీ ధ్యేయం. పోటీ చేసిన ప్రతి చోటా జనసేనను గెలిపించుకోవాలన్నది జనసేనాని ధ్యేయం. ఈ సారి మరోమారు ముఖ్యమంత్రి కావాలన్నది చంద్రబాబు ధ్యేయం. జట్టు కడితే జయం సిద్ధిస్తుంది అని అనుకుంటే పొరపాటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వుండేందుకు కూటమిగా ఏర్పడిన పార్టీలు పొత్తు ధర్మాలకు కట్టుబడి నిబద్దతతో మెలగాలి. కొన్ని సందర్బాలలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా త్యాగాలకు సిద్ధం కావాలి. మూడు పార్టీలు వేరు కాదు ఒక్కటే అని భావించి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి. రాష్ట్ర రాజధాని, విశాఖ ఉక్కు, పోలవరం తదితర ఆంశాలపై స్పష్టత నివ్వాలి. రాష్ట్ర విభజన హామీలు, రాష్టానికి నిధులు తదితర అంశాలపై విధి విధానాలు ప్రజలకు తెలియజేయాలి. సంక్షేమం అభివృద్దిని ఎలా సమన్వయ పరుస్తారో వివరించాలి. రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలపై చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజం స్పురణలో ఉంచుకొని ప్రచారం చేయాలి. వారి వారి ధ్యేయాలు నెరవేరాలంటే ముగ్గురు ఉమ్మడి లక్ష్యమైన గెలుపు కోసం శ్రమించాలి. అసమ్మతిని త్వరగా చల్లార్చి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి ఎన్నికల సమరాన నిలబడాలి.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445