నిరుద్యోగ నిర్మూలనలో బీజేపీ ఫెయిల్..!

by Ravi |   ( Updated:2024-09-25 01:15:42.0  )
నిరుద్యోగ నిర్మూలనలో బీజేపీ ఫెయిల్..!
X

ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నిర్ణయించడంలో కీలక అంశం నిరుద్యోగం. ఉత్పత్తి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటే ఆదాయాలు పెరిగి వస్తు సేవలకు గిరాకీ ఏర్పడి వస్తు సేవల ఉత్పత్తి అవసరం ఇంకా పెరిగి ఉద్యోగ కల్పన జరిగే అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా ప్రజల ఆదాయాలు దేశ ఆదాయం పెరిగి ఆర్థిక వ్యవస్థ స్థాయి ఐదవదా, నాలుగవదా? అనేది నిర్ణయింపబడుతుంది.

అంతేగాని, దేశంలో పేదరికం నిరుద్యోగిత విపరీతంగా ఉండి ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదైనా ఏమి ప్రయోజనం? నిరుద్యోగంతో ఉపాధి అవకాశాలు లేక (మేనేజీరియల్ పోస్టులే కాకుండా స్వయం ఉపాధి కార్యక్రమాలు ఔత్సాహిక పెట్టుబడిదారులు ఉత్పత్తి కార్యక్రమాలు మొదలైనవి) లేనందువలన పెట్టుబడులు, ఆదాయాలు వస్తు సేవల డిమాండ్ మొత్తం మార్కెట్ పతనం అవు తుంది. అలా కాకుండా మార్కెట్లో వస్తు సేవల సప్లైకి వస్తు సేవల డిమాండ్‌కు సమానమైతే సార్థక డిమాండ్ ఏర్పడుతుందని (ఎఫెక్టివ్ డిమాండ్) ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త జాన్ మేనాడ్ కీన్స్ తెలియజేశారు.

కొనుగోలు శక్తి లేకుంటే..

ఇలా ఆర్థిక వ్యవస్థలో వస్తుసేవల సప్లై డిమాండ్ సమానంగా ఉంటే ఆర్థిక మాంద్యం లేకుండా ఉద్యోగిత ఉత్పత్తులు ఆదాయాలు పురోగతిలో ఉంటాయి. స్వదేశీ విదేశీ పెట్టుబడులు పరుగులు తీస్తాయి. దేశంలో మూడో వంతు ప్రజలు నిరుద్యోగంతో మార్కెట్లోకి పోలేక కొనుగోలు శక్తి లేకుండా ఉంటే ఆర్థిక మాంద్యం ఏర్పడి మూలధన పెరుగుదల జరగదు. నేడు మన దేశంలో నిరుద్యోగం విశ్వరూపం దాల్చడంతో విదేశీ పెట్టుబడులు 46 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా మన పెట్టుబడులు 50 శాతానికి పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తుసేవల డిమాండ్ పడిపోయి నిరుద్యోగంతో ఆర్థిక మాంద్యం ప్రబలమవుతున్నది.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పెద్ద బూటకం!

2047 కల్లా దేశాన్ని ప్రపంచంలోనే వృద్ధి రీత్యా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలి అనుకుంటున్న పాలకుల ఆలోచన ఉద్యోగాల రీత్యా మాత్రం కాదు. 2014లో మన ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరలా ఉద్యోగ కల్పన కోసం వివిధ పథకాల నిర్వహణ కోసం రెండు లక్షల కోట్లు కేటాయించి 4.1 కోట్ల మందికి ఉద్యోగ కల్పన చేస్తానని అంటున్నారు కానీ మొదటి ఎనిమిది సంవత్సరాల కాలంలో 7.2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని లోక్‌సభలో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అఫైర్స్ తెలియజేసినారు. పాలకుల ప్రకటనకు చేపట్టి విధానాలకు పొంతన లేకుండా పోయింది.

పది లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?

ఖాళీగా ఉన్న పది లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉద్యోగ కల్పన పేరుతో ప్రైవేటు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సబ్సిడీలు ఇస్తే ఉద్యోగ కల్పన సాధ్యమా? పెట్టుబడిదారుల మూలధన సాంద్రత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ప్రాతిపదికన ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టడం వలన నిరుద్యోగ సమస్య తీరదు. శ్రమసాంద్రిత ఉత్పత్తి పద్ధతులకు వాళ్ళు ఎప్పుడో మంగళం పాడారు అనే విషయం పాలకులకు తెలియదా?

ఉత్పత్తే లేదు... ఉద్యోగ కల్పన ఎలా?

2024లో అంతర్జాతీయ శ్రామిక సంస్థ నివేదిక ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిరుద్యోగిత ప్రబలమవుతున్నది. ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎక్కడలేని విధంగా మన దేశంలో ఒక్క శాతం జనాభా దగ్గర 40% పైగా ఆదాయం ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో కన్నా ఎక్కువ ఆదాయ అసమానతలు ఉన్న పరిస్థితి. అందువలన 20 శాతం జనాభా కూడా మార్కెట్లో వస్తు సేవలను కొనలేకపోతున్నారు. ఫలితంగా నిరుద్యోగత ఇంకా పెరుగుతున్నది. మనం ఎన్ని రాయితీలు పెట్టుబడిదారులకు కల్పించినా దేశంలో ఉద్యోగ కల్పన జరిగే పరిస్థితి లేదు. 2019లో ఉత్పత్తిని పెంచేందుకు కార్పొరేట్లకు పన్నులు 32 శాతం నుంచి 22 శాతానికి తగ్గించినా, పెట్టుబడులు పెరగలేదు. ఇంకా ఎన్నో ప్రోత్సాహకాలు కల్పించినప్పటికీ ఉద్యోగత పెరగలేదు. అసలు పారిశ్రామికవేత్తలు వస్తు ఉత్పత్తి చేయకపోతే ఇక ఉద్యోగ కల్పనను ప్రభుత్వాలు ఎలా చేయగలవు?

గ్రామీణ ఆర్థికమే శిరోధార్యం

ఇక ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన చేయాలంటే గాంధేయ మార్గమే శరణ్యం. స్థానిక అవసరాల రీత్యా స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో, స్థానిక వనరులతో స్థానిక పెట్టుబడులతో పెట్టుబడుల వికేంద్రీకరణ జరిగి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్థిక అభివృద్ధి జరిగితే అప్పుడు ఈ వృద్ధి ప్రక్రియలో అందరూ పాల్గొని సమ్మిళిత వృద్దిగా నిరుద్యోగ సమస్య తీరుతుంది. గాంధేయ మార్గాలుగా స్థానిక అవసరాల కోసం దేశ స్వయం సమృద్ధి కోసం చేపట్టిన స్థానిక కోసం గాత్రం (ఓకల్ ఫర్ లోకల్) స్వావలంబన భారత్(ఆత్మనిర్భర భారత్), భారతదేశంలో తయారు చేయండి (మేక్ ఇన్ ఇండియా) మొదలైన పథకాలు నిరుద్యోగ సమస్య నిర్మూలించడంలో ఎందుకు విఫలమైనాయో సింహావలోకనం చేయడం తప్పనిసరి.

డా. ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Advertisement

Next Story