అందాల రాయబారులు

by Ravi |   ( Updated:2022-09-03 17:00:20.0  )
అందాల రాయబారులు
X

పక్షులను కాపాడడం అంటేనే ప్రకృతి అందాలను పరిరక్షించడమని తెలుసుకోవాలి. పక్షుల కదలికలు, రంగులు, అందాల పొంగులు, ఎగరడాలు, కూతలు, పిట్టగూళ్లు, గుడ్లు, పిల్లలులాంటి ప్రకృతి రమణీయతలు లాంటి వాటిని అనుభవిస్తేనే అవగతం అవుతుంది. పల్లె పంట పొలాలలో, అడవులలో, చెరువులలో, పట్టణాల పార్కులలో పక్షుల కిలకిలారావాలు వీనుల విందు చేస్తాయి. అందమైన వలస పక్షుల సమూహాలు ప్రకృతి పంపించిన విదేశీ రాయబారులని భావించాలి. బిలియన్ల వలస పక్షులు ఆడుతూ, పాడుతూ, ఎగురుతూ, వాలుతూ, సేదతీరుతూ, సుదూర తీరాలు ప్రయాణించి తాము నిర్దేశించుకున్న ప్రదేశాలకు వలస వెళతాయి.

ప్రతి యేటా మే నెల రెండో శనివారం ప్రపంచవ్యాప్తంగా 'అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం' నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జీవ వైవిధ్యంలోనే కాకుండా జంతు రాజ్యంలో కూడా అందమైన పక్షి జాతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది పక్షుల దినోత్సవం నినాదంగా 'రాత్రిపూట పక్షుల కోసం దీపాల ప్రకాశాన్ని తగ్గిద్దాం' అనే అంశాన్ని తీసుకున్నారు. పక్షులకు ప్రాంతాలు, దేశాలు, ఖండాల సరిహద్దులు ఏమీ తెలియవు. రుతువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పక్షి జాతులు తమ నివాసాలు వదిలి, ప్రాంతాలు, దేశాలు లేదా ఖండాల సరిహద్దులు దాటి తాత్కాలిక కాలానికి వలస పోతాయి. ఇలాంటి అరుదైన వలస పక్షుల పట్ల సామాన్య జనానికి అవగాహన కల్పించడం, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, వాటి ఆవాసాలను కాపాడటం, ఆయా జాతులను అంతరించకుండా చర్యలు తీసుకోవడం లాంటి అంశాలను చర్చించే వేదికలుగా పక్షుల దినోత్సవాన్ని వాడుకుంటారు.

ప్రకృతి పంపిన రాయబారులు

పక్షులను కాపాడడం అంటేనే ప్రకృతి అందాలను పరిరక్షించడమని తెలుసుకోవాలి. పక్షుల కదలికలు, రంగులు, అందాల పొంగులు, ఎగరడాలు, కూతలు, పిట్టగూళ్లు, గుడ్లు, పిల్లలులాంటి ప్రకృతి రమణీయతలు లాంటి వాటిని అనుభవిస్తేనే అవగతం అవుతుంది. పల్లె పంట పొలాలలో, అడవులలో, చెరువులలో, పట్టణాల పార్కులలో పక్షుల కిలకిలారావాలు వీనుల విందు చేస్తాయి. అందమైన వలస పక్షుల సమూహాలు ప్రకృతి పంపించిన విదేశీ రాయబారులని భావించాలి. బిలియన్ల వలస పక్షులు ఆడుతూ, పాడుతూ, ఎగురుతూ, వాలుతూ, సేదతీరుతూ, సుదూర తీరాలు ప్రయాణించి తాము నిర్దేశించుకున్న ప్రదేశాలకు చేరుకుంటాయి.

కొద్ది రోజులు గడిపిన తరువాత తిరిగి తమ పూర్వ స్థలాలకు వెళ్లి సంతానోత్పత్తి చేసుకుంటాయి. కరోనా కాలంలో లాక్‌డౌన్, స్వచ్ఛంధ గృహ నిర్బంధాలతో ఆరోగ్యకర జంతుజాలం, ముఖ్యంగా పక్షుల అందాలు చూడగలిగే సౌభాగ్యం మానవాళికి లభించింది. వలస పక్షుల సమూహాలు మనిషికి సామూహిక జీవన విధానాన్ని, ఐక్యతలో ఉన్న ప్రయోజనాలు, అహ్లాదాలను వివరిస్తుంటాయి. పక్షుల దినోత్సవం వేదికగా విద్యాలయాలలో అవగాహన సదస్సులు, జంతు ప్రదర్శనశాలలు, మ్యూజియమ్‌లు, పార్కులు, అటవీ ప్రాంతాల సందర్శనలు ఏర్పాటు చేస్తారు. 'ఆర్నిథెరపీ' 'ఏ వరల్డ్ ఆన్‌ ది వింగ్స్' లాంటి పక్షులకు సంబంధించిన పుస్తకాల కోసం లైబ్రరీలను పిల్లలకు పరిచయం చేయడం సముచితంగా ఉంటుంది.

దేశాల సరిహద్దులు చెరుపుతూ

ఇండియాలో 1,349 రకాల పక్షి జాతులున్నాయి. వీటిలో 78 స్థానికమైనవని గుర్తించారు. ఇందులో 212 రకాలు అంతరించే స్థితిలో ఉన్నాయని అంచనా. మన దేశంలో శీతాకాలంలో వలస వచ్చే‌ పక్షులలో సైబేరియన్‌‌ క్రేన్స్, గ్రేటర్‌ ఫ్లెమింగో, అముర్‌ ఫాల్కన్‌, డెమాయిసల్‌ క్రేన్‌, బ్లూత్రోట్‌, బ్లాక్‌-వింగ్డ్ స్టిల్ట్, బ్లూ-టేయిల్డ్ బీ ఈటర్‌, బార్‌-హెడెడ్‌ గూస్‌, రోసీ స్టార్లింగ్‌, గ్రేటర్‌ వైట్‌ పెలికన్‌‌లాంటివి ముఖ్యమైనవి. వర్షాకాలంలో బ్లాక్‌-టెయిల్డ్ గాడ్‌విట్‌, రడ్డీ షెల్డక్‌, ఓస్ప్రే, పల్లీడ్‌ హారియర్‌, కామన్‌ స్టార్లింగ్‌, వైట్‌ వాగ్‌టేయిల్‌, స్పారోహాక్‌ లాంటివి భారతదేశానికి చెందిన ప్రధాన వలస పక్షులుగా గుర్తించబడినవి.

వేసవి సమయంలో కోంబ్‌ డక్‌, ఏసియన్‌ కోయల్‌, కింగ్‌ఫిషర్‌, బ్లూటెయిల్డ్ బీ ఈటర్‌, గేల్డన్‌ ఒరియోలే, బ్లాక్‌ క్రౌడ్‌ నైట్‌ హెరోన్‌ లాంటివ్ ముఖ్య వలస పక్షులుగా తెలుపబడింది. దేశాల సరిహద్దులను చెరిపే వలస పక్షులు ప్రపంచ ఐక్యతను, శాంతియుత సహజీవనాన్ని, పర్యావరణ పరిరక్షణకు, ఆర్థిక చేయూతను మానవాళికి బోధిస్తున్నాయి. దేశాల మధ్య వారధిగా, పరాయి దేశపు అతిథులుగా వచ్చి చేరే వలస పక్షులను ఆదరిస్తూ, ప్రేమతో చూస్తూ ఆనందానుభూతులు పొందుదాం. ప్రకృతి ఒడిలో ఊగే, తూగే పక్షుల రాగాలు ఆసాంతం ఆస్వాదిద్దాం. (నేడు అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం)

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగర్‌

9949700037

Advertisement

Next Story

Most Viewed