- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బహుజనులు రాజకీయ బానిసలేనా.!?
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా, ఎన్నో విషయాలలో మార్పు కానరాకుండా ఉంది. కాలంతో పాటు శాస్త్ర, సాంకేతిక పరమైన అంశాలలో అనేక వినూత్నమైన సంస్కరణలు జరుగుతున్నాయి. కానీ జనాభాలో దిక్సూచిగా, కులవృత్తులకు పునాదిగా, అన్ని వర్గాలను ఆదరించే జనక్షేత్రమైన బహుజనుల జీవితాలలో మాత్రం ఎలాంటి నూతన మార్పులు చోటు చేసుకోవడం లేదు. తరాలు మారుతున్నా వారి తలరాతల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎలాంటి సంస్కరణలకు బీజం పడటం లేదు. వందల సంవత్సరాల క్రితం నుండి వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తులనే నమ్ముకొని తమ జీవితాలను వెళ్లదీస్తున్నారు. బహుజన జాతులు ఎన్నో సంవత్సరాలుగా అనేక రంగాల్లో చతికిలపడి సతమతమవుతున్నప్పటికీ పాలక పక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయి.
వారి ఆధిపత్యాన్ని చూపిస్తూ
దాదాపు 200 సంవత్సరాల క్రితం బహుజన కులాలు అగ్రవర్ణ ఆగడాలకు, అఘాయిత్యాలకు ఆగమవుతుండేవి. సమ్మక్క-సారలమ్మ, కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండగ సాయన్న, కొర్వి కృష్ణస్వామి, కేవల కిషన్, నెల్లి లక్ష్మి నారాయణ, సర్ధార్ సర్వాయి పాపన్న, బత్తిని మొగిలయ్య ఇలా ఎంతో మంది బహుజన యోధులు వీరందరినీ ఏకతాటిపై సంఘటితం చేసి భూస్వాములు, పెత్తందారుల అధిపత్యాన్ని బద్దలు కొట్టారు. నిజాం రజాకార్ల పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చరిత్రలు ఉన్న ఈ అణగారిన వర్గాలకు ఐక్యత మాత్రం కానరాకుండానే ఉంది. బహుజన జాతి అంటే వందకు పైగా కులాల క్షేత్రం. కులవృత్తిలో తమ బతుకుదెరువును వెతుక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న నిరుపేదల సమూహం.
జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాం, పెరియార్ ఇలా ఎంతో మంది మేధావులు, విజ్ఞానవంతులు ఎన్నో సామాజిక సిద్ధాంతపరమైన పోరాటాలు చేసినప్పటికీ, బహుజనుల బతుకుల్లో వెలుగులు పూర్తి స్థాయిలో రాలేదు. జనాభాలో 70 శాతానికి పైగా ఉన్నప్పటికీ, బహుజనుల ఉనికి ఎక్కడా పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకపోవడం బాధాకరం. వారిని కేవలం ఓట్లు, సీట్ల ప్రాతిపదికనే బానిసలుగా మార్చి అవసరానికి వాడుకొని తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో వందల హామీలు ఇచ్చి బహుజనుల మద్దతును కూడగట్టుకొని ఆ తర్వాత వారిని ఆచూకీ లేకుండా చేస్తున్నారు. బహుజనులను కేవలం అగ్రవర్ణాల అధిపత్యానికి బాటలు వేసే ఓట్ల బానిసలుగా చూస్తున్నారే తప్పా.! వారి తరాల ఉన్నతికి, సంక్షేమం కోసం ఎవరూ ప్రణాళికలు చేయడం లేదు.
ఇంటి దొంగల వల్లే
బహుజనులలో ఒక్కో కులానికి ఒక్కో కుల సంఘం ఉంది. అవన్నీ ఏకతాటిపైకి వచ్చి సమిష్టి కృషితో పోరాటాలు చేస్తే వారి జీవితాల్లో మార్పు తథ్యమని మేధావుల అభిప్రాయం. అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాజ్యాధికార బావుటాను ఎగురవేయడానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అగ్రవర్ణాలు తమ కింది స్థాయి పదవుల్లో ఉండే వారిని అవమాన పరుస్తూ, మనోవేదనకు గురి చేసే మాటలు మాట్లాడుతున్న తీరు నేటి పరిస్థితుల్లో మనందరం చూస్తూనే ఉన్నాం. అందుకే ఇప్పటికైనా స్వార్థపూరిత ఆలోచనలకు స్వస్తి పలికి, నిస్వార్థంగా అన్ని సంఘాలు సమిష్టిగా శ్రమిస్తే బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయచ్చని పలు సంఘాలు కోరుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో మన నాయకుల ముసుగులో ఉన్న కొంతమందిని ప్రసన్నం చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ముందు అలాంటి ఇంటి దొంగల భరతం పట్టాలి. అప్పుడే రాజ్యాధికారానికి మార్గం సుగమం అవుతుంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తరాలు మారినా వీరి బతుకులు మారడం లేదు. ప్రలోభాలకు, మోసపూరిత మాటలకు బానిసలు కాకుండా భవిష్యత్ తరాల ఉన్నతికోసం ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. కనుమరుగౌతున్న బహుజన జాతుల కులవృత్తుల పరిరక్షణకై సమగ్రమైన, పటిష్టమైన సంస్కరణలు చేసేలా పోరాటాలు చేయాల్సి ఉంది. చట్టసభల్లో కూడా బహుజనులకై సముచిత స్థానం కల్పించే దిశగా నూతన సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది.
అచ్చునూరి కిషన్ ముదిరాజ్
9000986761.
Also Read...
- Tags
- backward classes