- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బహుజన అభివృద్ధికి మూలం..
భారతదేశ రాజకీయం, ఆచరణలో మత తత్వం, రాజకీయాలలో వీరపూజ, వ్యక్తి ఆరాధన ఏమాత్రం పనికిరావు. ఈ ధోరణి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచి, నియంతృత్వానికి దారి తీస్తుంది.
ఒక మనిషిని దేవునిగా పూజించడం, (రాజకీయాల్లో) మంచిది కాదు. వ్యక్తి పూజ వినాశనానికి త్రోవ చూపుతుంది. దానిని మొగ్గ దశలోనే త్రుంచివేయాలి. పవిత్రమైన ఆశయం కోసం సాగించే పోరాటమే గొప్పది. అధికారం కోసమో, ఐశ్వర్యం కోసమో ముందుకు సాగకూడదు. అట్టిది పోరాట చరిత్రనే బలహీనపరుస్తుంది. నా దృష్టిలో భారతదేశానికి స్వాతంత్య్రం అంటే పాలనాధికారం బ్రిటీష్‌వారి చేతుల్లోంచి అన్ని విధాలా అగ్రవర్ణాల హస్తగతం కావడమే.
స్వరాజ్యం అంటే..
1950 జనవరి 26 నాటికి మనం రాజకీయంగా సమానత్వం, సాంఘిక, ఆర్థిక జీవితంలో అసమానత్వం కలిగివున్నాము. పరస్పర విరుద్ధమైన ఈ వ్యత్యాసాలు అత్యంత శ్రీఘ్రంగా తొలగించబడాలి. లేకుంటే అసమానత్వంతో కృంగిపోతున్న వర్గాలు, ఎంతో శ్రమించి నిర్మించుకున్న ఈ రాజకీయ ప్రజాస్వామిక సౌధాన్ని విచ్ఛిన్నం చేయగలవు. స్వరాజ్యం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరికీ తిండి, బట్ట, నివాసం వుండాలి సమాజంలో ఇవన్నీ అందరికీ లభిస్తున్నాయా? లేనప్పుడు స్వరాజ్యం ఎక్కడుంది? దళిత బహుజనులకు ఇప్పటికీ నిజమైన స్వాతంత్య్రం రాలేదు.
భారతదేశంలో రాజకీయ ఆధిక్యత అంటే మతపరమైన ఆధిక్యత. హిందూ సాంప్రదాయ పునరుద్ధరణకే ఈ రాజకీయ స్వాతంత్య్రం పనికివస్తుంది. రాజ్యాంగం ఎంత మంచిది అయినప్పటికీ, దానిని చేయవలసినవారు చెడ్డవారైతే ఖచ్చితంగా అది చెడ్డ రాజ్యాంగం అయిపోతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలు చేయాల్సిన వారు మంచివారయితే, అది మంచి రాజ్యాంగంగా మారవచ్చు. మన పోరాటం ఐశ్వర్యం కోసమో, అధికారం కోసమో కాదు. ఈ పోరాటం స్వేచ్ఛ కోసం, ఇది మానవ వ్యక్తిత్వ పునరుద్ధరణ కోసం జరుగుతున్న పోరాటమని ఆనాడే అంబేడ్కర్ అన్నారు.
రాబోవు కాలం బహుజన కాలమే
నిజానికి రాబోయే కాలం తప్పకుండా బహుజనులదే. బహుజన రాజ్యాధికారం వీరికి రావాలంటే వీరు ఇప్పడు రాజకీయ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దళిత బహుజనుల్ని వస్తువులు కొనేవారుగా మార్చేసారు. దళిత, ఆదివాసీలకు స్థిరమైన ఆర్థిక వనరుల రూపకల్పన చేయడం కేంద్రప్రభుత్వ రాజకీయ పాలకులకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళే కార్పొరేట్ చేతులలో బొమ్మలుగా వున్నారు. భారతదేశంలోని సహజ వనరులు కార్పోరేట్‌కి తాకట్టుపెట్టి రాజకీయ నాయకులు కుబేరులవుతున్నారు. నిజానికి అగ్రవర్ణ అగ్రకుల రాజకీయాధికారం వల్ల దళిత ఆదివాసీలకు ఎక్కువ ఒరిగిదేమీ లేదు. 2028లో వచ్చే ఎన్నికలకంతా డా. బి.ఆర్.అంబేడ్కర్ మార్గంలో ఒక తెలంగాణలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా దళిత బహుజనులు రాజకీయాధికారానికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సొంత మీడియా, సొంత పత్రికలు, సొంత మేనిఫెస్టోలు రూపొందించుకోవాలి. మోసపూరితమైన అగ్రకులాల, రాజకీయ నినాదాల మోజు నుండి బయటపడాలి.
అందుకే అంబేడ్కర్ 'ఈ ప్రపంచంలో ఆత్మ గౌరవంతో జీవించడం నేర్చుకోండి. ఏదో ఒకటి చేయాలనే కోరికను మీ మనస్సులో ఎల్లవేళలా వుంచుకోవాలి. పోరాటం చేసేవారే పైకి వస్తారు. ఈ లోకంలో అభివృద్ధిలోకి రాలేమనే భావాన్ని మీలో కొందరు పెంచి పోషిస్తున్నారు. నిస్సహాయత అనే యుగం నశించిందని గ్రహించండి. కొత్తయుగం మొదలైంది. ఈ దేశ రాజకీయాల్లో, శాసనసభల్లో మీరు పాల్గొనడం ద్వారానే అన్నీ సాధ్యమవుతాయని అన్నారు. రాజకీయాధికారం ద్వారా శాసనసభ స్వాధీనమవుతుంది. శాసనసభ స్వాధీనమైతే, మంచి శాసనాలు వస్తాయి. మంచి శాసనాలు వస్తే, బహుజనుల బతుకులు బాగుపడతాయి. కాబట్టి బహుజన అభివృద్ధికి మూలం రాజ్యాధికారమే, కాబట్టి దళిత బహుజనులందరం ఆ దిశగా నడుద్దాం.
డా. కత్తి పద్మారావు
98497 41695