- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అద్దాలు.. పూసలే మాకు ఆస్తి!
స్త్రీ అంటేనే అందం. ఆభరణమే ఆ అందానికి అలంకరణం. అలంకరణలో ప్రథమ స్థానంగా నిలిచేది వస్త్రధారణ. ఆ చక్కటి వస్త్రాలు, ఆభరణాలు బంజారా మహిళలకు మరింత అందాన్ని అందిస్తాయి. ప్రతిష్టాత్మక ఆభరణాలను బంజారా మహిళలు అన్ని సొగసులతో అలంకరించుకుంటారు. మా అమ్మలు, అమ్మమ్మలు ఈ అలంకరణను వారి చిన్నతనం నుంచే ఆచరించే వారు. ఆ వస్త్రాలను వారు ఎలాంటి కొలతలు లేకుండా దర్జీ సహాయం లేకుండా ఎవరికి వారే ఫ్యాషన్ డిజైనర్లుగా మారి కుట్టు మెషిన్ సహాయం లేకుండా చేతి కుట్టుతోనే చూడముచ్చటగా, ఆకర్షణీయంగా తయారు చేసుకుంటారు. ఆ వస్త్రాలనే.. బంజారా వస్త్రాలు ("మార్ యాడిర్ వేస్") అంటారు.
వీటి రంగు, రూపు ఎలా ఉన్నా బంజారా వేషధారణతో రాజసం ఉట్టిపడేలా కనిపించేటువంటి అద్భుతమైన సౌందర్యం మహిళామణులకు సొంతం. స్వదేశీ వస్త్రధారణ అయినటువంటి బంజారా డ్రెస్‌ను అద్భుతమైన బహుమానంగా భావించి, మహిళల హుందాతనాన్ని పెంపొందించే ఈ వస్త్రధారణను గౌరవించి, ఆదరించాల్సిన అవసరం ఉంది. అంతటి గొప్ప సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ వస్త్రాలకు అద్దాలు, పూసలు, రంగు రంగుల దారాలతో పాటు గవ్వలు, నాణేములు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో బంజారా మహిళలు టుగ్రీ(ముసుగు), కాళీ(రవికా), ఫేటియా (లెహేంగా)లను చేతి కుట్టుతోనే తయారు చేసుకుంటారు. ఇవి ఈ మధ్యకాలంలో అరకొర సౌకర్యాలతో అందుబాటులో ఉంటున్నాయి కానీ.. మా అమ్మమ్మలు, నానమ్మల కాలంలో పూర్తి వస్త్రధారణ చేతి సహాయంతోనే కుట్టుకునే వారు.
టూగ్రీ (ముసుగు)
దీనిలో ముఖ్య భాగం 'ఘుమ్టో'. కొత్తగా పెళ్లయిన యువతికి రక్షణ కవచం. ఇది అద్దాలు, పూసలతో రంగురంగుల దారాలు సహాయంతో చేయబడి ఉంటుంది. ఇది ముఖం చుట్టూ సరిపోయేలాగా ఉంటుంది. ఈ ఘుమ్టో కొత్త పెళ్లి కూతురికి సుఖ దుఃఖాల్లో తోడుగా ఉంటుంది. సిగ్గు బిడియం పోయే వరకు పెళ్లికూతురు ఈ ఘుమ్టో సహాయంతో ముఖం కప్పేసుకుంటుంది. తన పుట్టింటి వారు గుర్తుకు వచ్చిన, అంగట్లో కలిసినా, తన మనసులో ఉన్న భావాలను, బాధలను ఢావ్లో రూపంలో వ్యక్తపరిచేటప్పుడు ఈ ఘుంటో తన కన్నీటిని తుడిచే తోడులాగా సహాయపడుతుంది. టూగ్రీలో మరో ముఖ్య భాగం 'పాటో'. ఇది 2.5.మీ. పొడవు ఉన్న ముసుగుకి రెండు వైపులా అమర్చబడి ఉంటుంది. దీనిని అద్దాలు, పూసలు రంగు రంగుల దారాలతో కుడతారు. ఇది మనం ఇప్పుడు వాడుతున్న(లేస్)ను పోలి ఉంటుంది. అమ్మ ముసుగే మాకు దుప్పటి అన్ని కాలాల్లో, ఎలాంటి వాతావరణంలో అయినా అమ్మ టూగ్రీని కప్పుకోవడంతోనే మాకు అమ్మను అల్లుకున్నప్పుడు కలిగే ప్రియమైన అనుభూతిని మాకు కలిగించేది. ఇది ప్రతి బిడ్డకి ఉద్వేగభరితమైన అనుభూతిని ఇస్తుంది.
కాళీ (బ్యాక్ లెస్ బ్లౌజ్)
ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఇంత అందంగా శరీర సౌష్టవానికి సరిపడేలాగా మా అమ్మమ్మలు, నాన మ్మలు ఈ జాకెట్ మాదిరి కాళీని ఎలా కుట్టుకునే వారో..?! ఈ 'కాళీ' బిడ్డకు నిధి లాంటిది. బిడ్డ పసిపాపగా ఉన్నప్పుడు పాల కోసం వెతికితే, పెద్ద య్యాక అదే కాళీకి క్రింది భాగంలో ఉండే పేట్టిలో అమ్మ పొదుపు చేసుకున్న పైసల కోసం వెతికిన మధురాతి మధురమైన అనుభూతులు ప్రతి బంజారా బిడ్డకు ఎన్నో... ఎన్నెన్నో..
ఫేఠియా (లెహేంగా)
దీనిని కూడా అద్దాలు రంగురంగుల దారాలు, పూసలు, గవ్వలతో చేతి సహాయంతో తయారు చేస్తారు. దీనినే ఘాగ్రా అని కూడా అంటారు. నడుముకు సరిపడేలా తయారు చేసుకున్న భాగాన్ని 'లేపొ' అంటారు. ఈ భాగం 'పేఠియా'కి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ 'లేపో'ను ధరించుకోవడానికి సహాయంగా నడుము పక్కన డోరీలను పూసలు, గవ్వలను రంగు రంగుల దారాలతో తయారు చేసుకుంటారు. చక్కటి గేరతో పేఠియాను అద్దాలు, దారాలు, పూసలతో అలంకరించుకుంటూ, ఆకర్ష ణీయంగా చేతి కుట్టుతో కుడతారు. బంజారా మహిళలు నృత్యం చేసేటప్పుడు ఈ ఫేఠియా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చంటి బిడ్డలను నిద్రపుచ్చడంలో ఈ ఫేఠియా కమ్మని అమ్మ ప్రేమతో పాటు వెచ్చని వాతావరణాన్ని సృష్టిస్తుంది.
వస్త్రధారణను గౌరవిద్దాం!
బంజారా వస్త్రధారణలో టూగ్రీ, కాళి, పేఠియాగా పిలువబడే ఒక్కో వస్త్రాన్ని తయారు చేయడానికి 5-6 నెలల పాటు శ్రమిస్తారు. ఈ వస్త్రాలను 5-6 సంవత్సరాల పాటు వినియోగించుకుంటారు. పాత వస్త్రం లోని "అద్దాలను, పూసలను" తమ ఆస్తిగా భావించి పాత వస్త్రం నుంచి తొలగించుకొని కొత్త వస్త్ర తయారీలోకి వినియోగించుకుంటారు. మా అమ్మకు అద్దాలు, పూసలే ఆస్తి కదా మరి! వస్త్రాలంకరణ స్వదేశానిదైనా, పరదేశానిదైనా బాగుందనిపిస్తే ఆచరిస్తాము. రంగు, రూపు ఎలా ఉన్నా బంజారా వేషధారణతో రాజసం ఉట్టిపడేలా కనిపించేటువంటి అద్భుతమైన సౌందర్యం మహిళా మణులకు సొంతం. స్వదేశీ వస్త్రధారణ అయినటువంటి బంజారా డ్రెస్‌ను అద్భుతమైన బహుమానంగా భావించి, మహిళల హుందాతనాన్ని పెంపొందించే ఈ వస్త్రధారణను గౌరవించి, ఆదరించాల్సిన అవసరం ఉంది. అంతటి గొప్ప సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. "మాయమైపోతున్నదమ్మ గోరుర్ బంజారా వేస్ / పరిరక్షించుకోవాలమ్మ... ఫర్ అప్ కమింగ్ డేస్ & ఫర్ మెనీ మోర్ డేస్". మనం సౌకర్యాలను గౌరవిస్తూనే... ఆచారాలను పాటిద్దాం.
నేనావత్ స్రవంతి
జూనియర్ లెక్చరర్, ఇంగ్లిష్
70936 44541