ప్రజల మనిషి.. వట్టికోట ఆళ్వారుస్వామి

by Jakkula Mamatha |   ( Updated:2024-10-31 00:01:14.0  )
ప్రజల మనిషి.. వట్టికోట ఆళ్వారుస్వామి
X

'ఆళ్వార్ ఏదో ఒక మనిషి పేరు కాదు. అదో విధానం. అంటే ఏదో ఒక కార్య విధానం కాదు. అదొక జీవిత విధానం. 'రామప్ప రభస' నుంచి 'ప్రజల మనిషి' స్థిత ప్రజ్ఞ దాకా దొరుకుతుంది వాని రచనల్లో భోగట్టా. వాడు చరిత్రకారుడే కాదు వాడు స్వయంగా చరిత్ర'. వట్టికోట ఆళ్వార్ స్వామి గురించి కాళోజీ నారాయణరావు అభిప్రాయం ఇది. జనం నుంచి జనంలోకి సాహిత్యం అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వార్ స్వామి. వాస్తవంలో ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, రోగాలు అన్ని ఇన్ని కావు. కానీ చెరగని చిరునవ్వుతో, రూపాన్ని మించిన సంస్కారంతో, నిర్మలమైన మనసుతో ఆయన అందరికీ ఆప్తమిత్రుడిగా బ్రతికాడు. తాను వేదనాభరితుడైనప్పటికీ ఇతరుల ఆనందంలో సంతోషంగా పాల్గొన్న ఉదాత్త మనిషి ఆయన.

సాంస్కృతిక పునర్జీవనానికి పునాదులు వేసిన వైతాళికుడు

జీవించినంత కాలం ప్రజల మనిషిగా జీవించిన ఆళ్వార్ స్వామి నిజాం సంస్థానంలోని తెలంగాణలో కొనసాగించిన ప్రజా పోరాటం మరువలేనిది. నిజాం సంస్థానాధీశుని పాలనలో నీ బాంచన్ దొర నీ కాల్మొక్త అనే స్థితి నుంచి బందూకులు పట్టించిన రచనలు ఆయనవి. ఆళ్వార్ స్వామి నల్గొండ జిల్లా మాధారం గ్రామంలో 1914 నవంబరు 1న రామచంద్రాచార్యులు, సింహాద్రమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కంచినేపల్లి సీతారామారావు అనే ఉపాధ్యాయుని దగ్గర విద్యాభ్యాసానికి చేరి ఆయనకు వండి పెడుతూ ఉండేవారు. ఆ తర్వాత 1933లో హైదరాబాద్ వచ్చారు.

గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు. మరోపక్క చదువుకుంటూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఆళ్వార్ స్వామి స్వయం కృషిచే ఎదిగిన విజ్ఞానవేత్తగా మాత్రమే కాకుండా చక్కని రచయితగా కూడా ప్రఖ్యాతి గడించాడు. 1938లో దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి 1941 వరకు పది పుస్తకాలు ప్రచురించాడు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరోపక్క ఆంధ్ర మహాసభ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవారు. కొంతకాలం నల్గొండ జిల్లా ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఆళ్వార్ స్వామిని నిజాం ప్రభుత్వం 1946లో అరెస్టు చేసింది. ఆయనను సంగారెడ్డి, గుల్బర్గా, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో నిర్బంధించారు. నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు దాశరథి ఆయనకు సహ ఖైదీ. దాశరథి పద్యాలను జైలు గోడల మీద ఈయన బొగ్గుతో రాసేవారు. ఈయన ప్రేరణతో దాశరథి అగ్నిధార కురిపించాడు. అంకితం ఇచ్చాడు.

తెలంగాణలో మొదటి నవల 'ప్రజల మనిషి'

తెలంగాణ తొలి నవలాకారుడు ఆళ్వార్ స్వామి. తెలంగాణ తొలి నవల 'ప్రజల మనిషి'. ఈ నవల 1938 కి పూర్వం నిజాం పాలన కింద ఉన్న తెలంగాణ ప్రజా జీవితాన్ని చిత్రీకరించింది. ప్రజల మనిషి కథ అతి పలుచని పొర. ఉద్యమం కోసం అల్లిన చిన్న కథ. ఇది ఉద్యమ నవల మాత్రమే కాదు. సాంఘిక చరిత్ర. నాటి అమలిన జీవితాన్ని ప్రేమలు, ఆప్యాయతలు, వేదనలను అతి సున్నితంగా మనసుకు హత్తుకునే విధంగా ఆయన చిత్రించాడు. ఇది నెత్తుటి మరకలేని నవల. ఈ నవలలో సంభాషణలు తక్కువ, ఉపన్యాసాలు ఎక్కువ అని దాశరథి రంగాచార్యులు అన్నారు. ఇతని మరో నవల 'గంగు'. ఇది రాజకీయ నవల కానీ రాజకీయాలే కాక దానిలో తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక ఇది చారిత్రక నవల అనడం సముచితం అని ప్రకాశకులు అన్నారు. ఈ నవల 1940-45 మధ్య తెలంగాణలో జరిగిన రాజకీయ ప్రజా ఉద్యమాలను, తెలంగాణ సాయుధ పోరాట చైతన్యాన్ని అక్షరీకరించింది. ఆళ్వార్ తన జైలు అనుభవాల ఆధారంగా "జైలు లోపల" అనే కథల సంపుటి రాశారు. అలాగే స్వామి మరో రచన 'రామప్ప రభస' నాటి సామాజిక సమస్యలను వ్యంగంగా ప్రతిభావంతంగా కళ్ళెదుట నిలుపుతుంది. మొత్తం మీద ఆళ్వార్ స్వామి తన కోసం ఏమీ సంపాదించుకోలేదు. 1961 ఫిబ్రవరి 5వ తేదీన ఆళ్వార్ స్వామి తుదిశ్వాస విడిచారు. ఆళ్వార్ స్వామి మానవత్వం, సంస్కరణ వాదం, నిజాయితీ, నిబద్దతే మనందరికీ ఆదర్శప్రాయం.

(నవంబర్ 1న ఆళ్వార్ స్వామి జయంతి)

అంకం నరేష్

63016 50324

Advertisement

Next Story