సింగరేణి కన్నీటిని దోసిట పట్టిన పిట్టల రాజేందర్ తో నా అనుభవం

by Ravi |   ( Updated:2022-11-10 18:30:22.0  )
సింగరేణి కన్నీటిని దోసిట పట్టిన పిట్టల రాజేందర్ తో నా అనుభవం
X

జర్నలిస్ట్ ఉద్యమంలోనూ పిట్టల రాజేందర్ క్రియాశీలక పాత్ర విస్మరించలేనిది. జర్నలిస్టుల సంఘం నాయకులు దేవులపల్లి అమర్ నాయకత్వంలో అప్పటి జర్నలిస్టుల చైతన్యం బలంగా ఉండేది. అమర్ నాయకత్వంలో జరిగిన అనేక పోరాటాలలో పిట్టల రాజేందర్, బండారి కిష్టయ్య, పిట్టల రవీందర్ గోదావరిఖని నుంచి క్రియాశీలక పాత్రను నిర్వహించి, అప్పటి ఉమ్మడి జర్నలిస్టులకు మార్గదర్శకంగా నిలిచారు. పిట్టల రాజేందర్ గోదావరిఖని ప్రెస్ క్లబ్ వ్యవస్థాపనలో చేసిన కృషి కూడా మరువలేనిది. రాజేందర్‌తోపాటు, బండారి కిష్టయ్య, కేపీ రామస్వామి, ఎ. లచ్చయ్య, పిట్టల రవీందర్, వేల్పుల నారాయణ, పారుపెల్లి రాజలింగం, శ్రీదాస్యం లక్ష్మయ్యతో పాటు మరికొందరు మిత్రులు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఏర్పాటులో ముఖ్య భూమికను నిర్వహించారు.

సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, రచయిత, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆత్మీయ మిత్రులు పిట్టల రాజేందర్ (68) ఈ నెల ఒకటిన పరమపదించిన విషయం తెలిసిందే.11-11-2022 శుక్రవారం రోజున ఆయన స్వగ్రామం హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండల కేంద్రంలో పిట్టల రాజేందర్ స్ఫూర్తి దినం జరుపుతున్నామని ఆయన సోదరుడు సీనియర్ జర్నలిస్ట్, రచయిత, తెలంగాణ విద్యావంతుల వేదిక మాజీ ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్ తెలిపారు. అకాల అమరత్వాన్ని పొందిన మిత్రులు పిట్టల రాజేందర్ నాకు 1969 నుండే పరిచయస్థులు. 1968-69 విద్యా సంవత్సరంలో వీణవంక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మొదటి బ్యాచ్ ఎస్ఎస్‌సీ విద్యార్థిగా ఆయన హుజురాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో బోర్డ్ పరీక్షలు రాశారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రం పర్యవేక్షకులు విద్యార్థులను కొన్ని ఇబ్బందులకు గురిచేశారు.

అప్పటికే తొలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా ఉన్న నాకు విషయం తెలిసి ఆ పరీక్షా కేంద్రానికి వెళ్లి సమస్యను పరిష్కరించాను. నేను కూడా ఇదే బ్యాచ్ విద్యార్థిగా బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాసాను. ఈ సందర్బంగానే అప్పటి వీణవంక హైస్కూల్ విద్యార్థులు పిట్టల రాజేందర్‌తోపాటు పత్తి మల్లారెడ్డి, గడ్డం రామస్వామి గౌడ్, యు.రామయ్య, గొట్టిముక్కుల వీరారెడ్డి, రాజిరెడ్డి, రామచందర్ రావుతో పరిచయం కలిగింది. వీరిలో పత్తి మల్లారెడ్డి, రామస్వామి గౌడ్, రామయ్య, వీరారెడ్డి హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదటి బ్యాచ్ (1969-71) లో నాకు సహాధ్యాయులు.

కార్మికులకు చైతన్య దీప్తి

1976 (అవి ఎమర్జెన్సీ రోజులు)లో నేను గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్లరికల్ ఉద్యోగిగా కొద్ది నెలలు మాత్రమే పనిచేశాను. అప్పటికే హుజురాబాద్‌లో పత్రికలతో, వార్తల రచనలతో పరిచయమున్న నేను గోదావరిఖని పేపర్ ఏజెంట్ వద్దకు వెళ్లి పత్రికలు చదివేవాన్ని. పేపర్ ఏజెంట్‌గా ఉన్న బండారి కిష్టయ్యతో నాకు అప్పటినుండే పరిచయం. ఆ తర్వాత కాలంలో నేను హుజురాబాద్ నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న సమయంలో గోదావరిఖని ప్రాంతం నుంచి బండారి కిష్టయ్య ద్వారా నాకు పరిచయమైన పాత్రికేయ మిత్రులు పిట్టల రాజేందర్, ఎ.లచ్చయ్య, కేపీ రామస్వామి, పిట్టల రవీందర్, పారుపెల్లి రాజలింగం, వేల్పుల నారాయణ తదితరులు ఉన్నారు. పిట్టల రాజేందర్ గోదావరిఖని ఈనాడు దినపత్రిక ప్రతినిధిగా వార్తలు రాసేవారు.

సింగరేణి బొగ్గుగనులలో పనిచేసే కార్మికుల దుర్భరమైన జీవితాల గురించి, వాటి పరిష్కారం గురించి ఆయన రాసిన అనేక కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా వుండేటివి. సింగరేణి యాజమాన్యం అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలపైనా, కొందరు దళారులు జరిపే బొగ్గు అక్రమ రవాణా పైనా, శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులకు చైతన్య స్ఫూర్తినందించే విధంగా రాజేందర్ అనేక పరిశోధనాత్మక వార్తలు రాసి ప్రభుత్వం నుంచి, కార్మిక వర్గం నుంచి మెప్పును పొందిన సందర్భాలు ఉన్నాయి. పిట్టల రాజేందర్ రాసే వార్తలు అప్పుడు ఈనాడు దినపత్రికకు పతాక శీర్షికలైనాయి. ఈనాడు సంస్థ అధిపతి రామోజీరావు నుంచి కూడా రాజేందర్ పలు పర్యాయాలు ప్రశంసలను అందుకోవడం గమనార్హం.

పాత్రికేయ ఉద్యమంలోనూ

జర్నలిస్ట్ ఉద్యమంలోనూ పిట్టల రాజేందర్ క్రియాశీలక పాత్ర విస్మరించలేనిది. జర్నలిస్టుల సంఘం నాయకులు దేవులపల్లి అమర్ నాయకత్వంలో అప్పటి జర్నలిస్టుల చైతన్యం బలంగా ఉండేది. అమర్ నాయకత్వంలో జరిగిన అనేక పోరాటాలలో పిట్టల రాజేందర్, బండారి కిష్టయ్య, పిట్టల రవీందర్ గోదావరిఖని నుంచి క్రియాశీలక పాత్రను నిర్వహించి, అప్పటి ఉమ్మడి జర్నలిస్టులకు మార్గదర్శకంగా నిలిచారు. పిట్టల రాజేందర్ గోదావరిఖని ప్రెస్ క్లబ్ వ్యవస్థాపనలో చేసిన కృషి కూడా మరువలేనిది.

రాజేందర్‌తోపాటు, బండారి కిష్టయ్య, కేపీ రామస్వామి, ఎ. లచ్చయ్య, పిట్టల రవీందర్, వేల్పుల నారాయణ, పారుపెల్లి రాజలింగం, శ్రీదాస్యం లక్ష్మయ్యతో పాటు మరికొందరు మిత్రులు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఏర్పాటులో ముఖ్య భూమికను నిర్వహించారు. దేవులపల్లి అమర్ నాయకత్వంలో ఇదే సమయంలో నాతో పాటు కేసరి యాదగిరిరావు, పిల్లలమర్రి సుదర్శన్, టి.ఆంజనేయ స్వామి, రావుల తిరుపతి, కోరెం సుధాకర్ రెడ్డి, ఇమ్మడి సంపత్ కుమార్, మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, అనుమాస రాజేందర్ కలసి హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ తొలి అధ్యక్షునిగా పనిచేసే అవకాశం నాకు లభించింది.

అనేక మంది మిత్రులతో

జర్నలిస్ట్ ఉద్యమాలలో అడపాదడపా పాల్గొన్న నాకు దేవులపల్లి అమర్‌తోపాటు బి. విజయ్ కుమార్, కొండా లక్ష్మణ్, నగునూరి శేఖర్, సిద్ధార్థ, పిట్టల రాజేందర్, బండారి కిష్టయ్య, పిట్టల రవీందర్, సీహెచ్‌వీ ప్రభాకర్‌రావుతో పాటు ఇంకా అనేక మంది జర్నలిస్ట్ మిత్రులతో సన్నిహితంగా ఉండే అవకాశం ఉండేది. పిట్టల రాజేందర్ స్వగ్రామం హుజురాబాద్ నియోజక వర్గంలోని వీణవంక మండల కేంద్రం. పిట్టల ఉపేందర్- వీరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమారులలో పెద్దవాడు రాజేందర్. ఈయన 15 సంవత్సరాలకు పైగా ఈనాడు దినపత్రికలో పనిచేసారు, ఈ కాలంలోనే తన సోదరుడు పిట్టల రవీందర్, మరి కొందరితో కలసి గోదావరిఖనిలో శ్రీరామ విద్యాలయం ఏర్పాటు చేశారు.

గోదావరిఖనిలో ప్రతిష్టాత్మకంగా, ప్రతిభావంతంగా నిర్వహించబడిన ఈ విద్యాలయం అనేక మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే గాకుండా, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శిగా నిలిచింది. ఆ తర్వాత పిట్టల రాజేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు. పదోన్నతి పొంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. రాజేందర్ చర్చ పత్రికతోపాటు అనేక పత్రికలలో కాలమిస్ట్‌గా సామాజిక రుగ్మతులపై అనేక వ్యాసాలు రాసారు. సమసమాజ ఏర్పాటు కోసం కలలుగన్నారు. ఆయన ఏ వృత్తిలో కొనసాగినా నిరంతరం తన ఆశయ సాధనోద్యమంలో భాగస్వామిగా వున్నారు. పిట్టల రాజేందర్ అకాల మరణం పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నాను. అమరుడు పిట్టల రాజేందర్‌కు జోహార్లు.


ఆవునూరి సమ్మయ్య

హుజూరాబాద్.

98491 88633

Advertisement

Next Story

Most Viewed