‘వికసిత్ భారత్’ లక్ష్యంగా..

by Ravi |   ( Updated:2024-02-04 00:31:16.0  )
‘వికసిత్ భారత్’ లక్ష్యంగా..
X

రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మధ్యంతర బడ్జెట్ భారత్‌ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే.. యువత, పేదలు, మహిళలు, రైతులు, దేశానికి నాలుగు స్తంభాలు వీరు దేశాభివృద్ధికి ఎంతో కీలకం. వారిని అభివృద్ధి చేసే విధంగా తీసుకొచ్చిన ఈ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టడం హర్షణీయం. అదే విధంగా పరిశోధనలు ఆవిష్కరణ కోసం లక్ష కోట్ల నిధులను కేటాయించడం కూడా మంచి పరిణామం.

గత బడ్జెట్ కంటే కొత్తగా..

ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పథకాల కంటే సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు తెలుస్తుంది. అదే విధంగా మౌలిక వసతులకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా బడ్జెట్ అంశాలలో గ్రామీణ అభివృద్ధికి కేటాయింపులు పెంపుచేయడం గ్రామాలను మరింత అభివృద్ధి చేసే విధంగా ఉపయోగపడుతుంది. గత సంవత్సరం పోలిస్తే 12 శాతం ఎక్కువగా ఈసారి గ్రామీణ అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపు చేశారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి ‘లఖ్ పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేసి దేశంలో దాదాపు మూడు కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించడం కూడా మహిళా సాధికారతకు పురోగతికి దోహదపడుతుంది.

వికసిక్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా అన్ని రాష్ట్రాలకు కూడా వడ్డీ లేని రుణాలను అందించడం, ఇల్లు లేని పేదవారి కోసం అదనంగా రెండు కోట్ల ఇళ్ళను నిర్మించాలనుకోవడం, పాఠశాల విద్యకు 73 వేల కోట్లు కేటాయింపు, దేశంలో గిరిజనుల అభివృద్ధి కోసమై 70% నిధుల పెంపు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు, సహాయకులు అందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య భీమా కల్పించడం, దేశంలో మరిన్ని వైద్య కళాశాలలో ఏర్పాటు చేయాలనుకోవడం, అంతరిక్ష రంగానికి 2000 కోట్ల పెంపు ఇలాంటి అంశాలు గత బడ్జెట్లో కంటే కొత్తగా ఉన్నాయి.

అప్పుడే అభివ‌ృద్ధి..

అదే విధంగా 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న ఆశయంతో కేంద్ర ప్రభుత్వం నూతన సంస్కరణలు, కొత్త ఒరవడితో పని చేస్తున్న విధానం ప్రజలకు మరింత చేరువై, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలో వస్తే ఈసారి దేశం మరింత పురోగతి సాధించడానికి, అదేవిధంగా ప్రపంచంలో మొదటి మూడవ ప్రభావంతమైన శక్తివంతమైన దేశంగా భారత్ రావడానికి కృషి చేస్తామని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్పడం కూడా మంచి పరిణామం.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పథకాల కంటే ప్రజా సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రజల జీవితాలను మార్చే విధంగా విధానాలు, కార్యక్రమాలు తీసుకుంటే త్వరగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ దిశగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తేనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మరి ప్రపంచ దేశాలకి మార్గదర్శిగా తయారవుతుంది.

-డాక్టర్ శ్రవణ్ కుమార్ కందగట్ల

సోషల్ అనలిస్ట్

86393 74879

Advertisement

Next Story

Most Viewed