పుట్టని సంస్థపై నిజాం నిషేధం

by Ravi |   ( Updated:2023-01-29 02:07:34.0  )
పుట్టని సంస్థపై నిజాం నిషేధం
X

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, నిజాం సంస్థానంలో ఏర్పడకముందే నిషేధానికి గురైన ఒక రాజకీయ పార్టీ. నిజాం రాజ్యంలో పౌర హక్కులు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం వంటివి దీని లక్ష్యాలు. నిజాం రాజ్యంలో తొలి స్థానిక రాజకీయ పార్టీగా హైద్రాబాదు స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. 1938 జనవరి 29న హైద్రాబాదు స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. దీనికోసం ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి, సభ్యులను చేర్పించడం వంటి ప్రాథమిక కార్యక్రమం అప్పగించారు. మతాలతో సంబంధం లేని - రాజకీయ పార్టీ ఆవశ్యకతను వివరిస్తూ తాత్కాలిక కమిటీ ఒక అప్పీలు విడుదల చేసింది. అందులో నవాబు ఆగ్రహానికి గురికాని విధంగా పదజాలాన్ని ఉపయోగించారు. నిజాం ప్రభువులకు విశ్వాస పాత్రులం అనే శపథం చేశారు. మతాలతో సంబంధం లేదని ఘంటాపథంగా చెప్పారు. తమ పార్టీకి మరే బయటి పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు.

నిషేధమంటూ ఫర్మానా..

తాత్కాలిక కమిటీ చేసిన అప్పీలు అద్భుతంగా పని చేసింది. ఒక్క నెలలో స్వచ్చందంగా 1200 మంది సభ్యులు అయ్యారు. ప్రజల్లో ఈ ఉత్సాహాన్ని చూసిన నిర్వాహకులు సెప్టెంబర్ 9న సర్వసభ్య సభ జరిపి నియమావళిని రూపొందించి, కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని నిశ్చయించారు. ఇది నిజాంని కలవరపర్చింది. ప్రజలు తనను ముట్డిస్తున్నట్లు, తన సింహాసనాన్ని గుంజుకుపోతున్నట్లు కలవరించాడు. రెండు రోజుల ముందే ఫర్మానాను జారీ చేశారు. అందులో చూపిన కారణాలు ఏమంటే 1. పైకి ప్రజా సంస్థగా కనిపించినా ఇది మత విద్వేషం ప్రేరేపించడానికి ఏర్పడుతున్న పార్టీ. 2. చూడ్డానికి సౌమ్యంగా కనిపించినా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహాన్ని ప్రేరేపించే పార్టీ. 3. ఈ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి 'కాంగ్రెస్' అనే పేరును వాడుకోవాలనుకుంటున్నది.

ఈ కారణాలతో ఇంకా పుట్టని స్టేట్ కాంగ్రెస్‌ని నిషేధించిన వారానికి గాంధీజీ 'హరిజన్' పత్రికలో ఇలా వ్రాశారు. 'సర్ అక్బర్ హైదరీ విద్యావేత్త, తాత్వికుడు. ఇంకా ఏర్పడని సంస్థను ఖండించే ప్రకటనకు అతడు కారకుడు కావడం విచారం.' సర్ అక్బర్ హైదరీ ఆనాటి నిజాం రాజ్యపు ప్రధాని. జనరల్ బాడీ సమావేశం తేదీ మాత్రమే నిర్ణయించగా ఏర్పడనున్న సంస్థను నిషేధించడం నిర్వాహకులకు, సంస్థకు, ప్రజలకు అవమానం అనిపించింది. కరుణించ వలసిందని ప్రభువుకు తాత్కాలిక కమిటీ అనేక విన్నపాలు చేసింది. కానీ నిజాం వినిపించుకోలేదు. తాత్కాలిక కమిటీ సభ్యుల్లో ఒకరైన ముందుముల నరసింహారావు స్వయంగా ప్రభుత్వంతో మంతనాలు జరిపారు. వారి మిత్రుడు అలియావర్ జంగ్ ఖాన్ నాటి ప్రభుత్వ సెక్రెటరీ. ఉభయులకు ఎడతెగని చర్చలు జరిగాయి. ఒక దశలో సంస్థ పేరులో 'కాంగ్రెస్'ను తొలగించడానికి సహితం నిర్వాహకులు అంగీకరించారు. బాధ్యతాయుత ప్రభుత్వ నినాదం వదులుకోవాలని ప్రభుత్వం పట్టు పట్టింది. కాంగ్రెస్ వారు అంగీకరించలేదు. ప్రభుత్వం నిషేధం తొలగించలేదు. చర్చలు విఫలం అయినాయి.

సత్యాగ్రహం ద్వారా ఎదిరించాలని..

తాత్కాలిక కమిటీ ప్రభుత్వ దమన నీతిని ఎదిరించడానికి నిర్ణయించింది. ఒక నెల తరువాత ప్రొవిజనల్ కమిటీని రద్దు చేసి ఆప్షన్ కమిటీ ఏర్పరచారు. కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని సత్యగ్రహం ద్వారా ఎదిరించాలని నిర్ణయించారు. తొలి బృందంలో రావి నారాయణ రెడ్డి,. బూర్గుల రామకృష్ణారావు, కాశీనాథరావు వైద్య, జనార్ధనరావు దేశాయ్, రాజుల్ హసన్ తిరంజీ, రామకృష్ణ ధూత్, గోవిందరావు నానల్‌ను పంపడానికి నిశ్చయించారు. వయోవృద్ధుడు గోవిందరావు నానల్‌ను తొలి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

1938 అక్టోబర్ 24న గోవిందరావు నానల్ నాయకత్వాన అయిదుగురు సత్యాగ్రహుల బృందం వేల మంది ప్రజల ఎదుట అరెస్టయింది. రామానంద తీర్థ నేతృత్వంలో మరొక బృందం సత్యాగ్రహం చేసింది. ఈ బృందంలో వందల మంది పాల్గొన్నారు. త్రివర్ణ పతకాలు రెపరెపలాడగా వందేమాతరం నినాదాలు ప్రతిధ్వనించగా అశేష ప్రజానీకం ముందు సత్యాగ్రహులు అరెస్టయ్యారు.

'యువకులారా! నిరంకుశత్వాన్ని ఎదిరించడం భగవదారాధనతో సమానం. ఈ జ్వాలను ఆరనివ్వద్దు మేము తరలినంత మాత్రాన ఈ పని ఆగరాదు' అని రామనంద తీర్థ ఆవేశపూరితమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇది నిప్పురవ్వలా పని చేసింది. జనం చేసిన వందేమాతరం నినాదంతో దిక్కులు పిక్కటిల్లాయి. నిజాం పోలీసు, తొలిసారి ప్రజా సందోహం మీద విరుచుకుపడింది. ఆర్య సమాజం హిందూ మహాసభ కూడా సత్యాగ్రహానికి పాల్పడటంతో ఈపోరాటాలకు మతం రంగు పులమడానికి నిజాం ప్రయత్నించి సక్సెస్ అయ్యడు.

ఆ కాలంలో తొలి రాజకీయ పోరాటం

అక్బర్ హైదరీ ద్వారా మహాత్మాగాంధీతో సంప్రదింపులు జరిపాడు. స్టేట్ కాంగ్రెస్ నిషేధం విషయంలో మహాత్మునికి అక్బర్ హైదరీకి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. సత్యగ్రహం మతపరం కావడాన్ని సహించని మహాత్ముడు హైదరాబాద్‌లో సత్యగ్రహం విరమించవలసిదిగా ఆదేశించారు. కాంగ్రెస్ సత్యగ్రహులను 10 ఏప్రిల్ 1939లో బేషరతుగా విడుదల చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ మీద నిషేధం తొలగలేదు. 1946 వరకు నిషేధం కొనసాగింది. క్విట్టిండియా ఉద్యమం విరమణ తర్వాత 1946 ఏప్రిల్‌లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధాన్ని నిజాం రాజు ఎత్తివేశారు. తర్వాత గణతంత్ర భారత్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాలని కోరుతూ 1947లో మరోసారి స్టేట్ కాంగ్రెస్ ఉద్యమించడంతో మళ్లీ సంస్థపై నిషేధం విధించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నడిపిన ఉద్యమం నిజాం రాజ్యంలో తొలి రాజకీయ పోరాటం.

బ్రిటిషిండియాలోని ప్రముఖ రాష్ట్రాలను పాలిస్తున్న కాంగ్రెస్ పేరిట హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి చేసిన ప్రయత్నం వమ్మయిపోయి ఉండవచ్చు. కానీ 1937-38 సంవత్సరాలు భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో కూడా ప్రభావాత్మకం అయిన కాలం అని చెప్పాలి.

కొలనుపాక కుమారస్వామి

9963720669

Also Read..

పూజా సమయంలో తప్పుచేస్తే- ఏం జరుగుతుంది


Advertisement

Next Story