చెరగని కాకతీయ కీర్తి

by Ravi |   ( Updated:2022-09-03 14:04:23.0  )
చెరగని కాకతీయ కీర్తి
X

కాకతీయుల కాలంలో అద్వైత బ్రహ్మ పంచరాత్రికులు, శూన్యవాదులు, కర్మవాదులు, నాస్తికులు, ప్రకృతివాదులు, ఏకాత్మకవాదులు ఉండేవారు. స్వయం పాలన ఉండేది. పొలం విస్తీర్ణాన్ని బట్టి భూమిని ఆయం అనేవారు. ఈ భూమిని పన్నులు లేకుండా పొందేవారిని ఆయగార్లు అనేవారు. వీరే గ్రామ పాలన నిర్వహించేవారు. వీరు పన్నెండు మంది. కరణం, పెదకాపు, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగళి, తలారి, చర్మకారుడు, శెట్టి మొదలైనవారు. తలారీ అంటే గ్రామ రక్షకభటుడు. కుల సంఘాలను సమయసారాలు అని పిలిచేవారు. వీరు సాంఘిక న్యాయ, మత, ధర్మ రాజనీతిలో స్వయంగా నియమ నిబంధనలు ఏర్పరచుకొని తగవులు పరిష్కరించేవారు.

క సామ్రాజ్యం యొక్క ఔన్నత్యం అది సాధించిన విజయాల మీద, అద్భుత కట్టడాల మీద ఆధారపడి ఉండదు. ఆ సామ్రాజ్యం గతించిపోయిన తర్వాత ఆ ప్రాంతపు ప్రజల హృదయాలలో దానిని గురించి ఉన్న స్మృతిముద్రల మీద ఆధారపడి ఉంటుంది. వరంగల్‌కు సంబంధించి కాకతీయ రాజులు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు. వారిలో ముఖ్యంగా 1199-1262 వరకు పాలించిన గణపతిదేవుడు, 1262-1289 వరకు పాలించిన రుద్రమదేవి కీర్తి జ్యోత్స్నలు ఈ ఆకాశాన్ని ఆవరించే ఉన్నాయి.

కాకతీయుల గురించి నేటి ప్రజలకుండే హృదయ సంబంధాలను చెప్పుకోవడానికి వారి విజయాలు ఒక ఎత్తయితే అవిచ్ఛిన్నంగా సాగి వస్తున్న సాహిత్య సంప్రదాయం మరొక ఎత్తు. వీరి వైభవాలను, సాంస్కృతిక వారసత్వాలను ప్రతిఫలించే విధంగా 1991లో వరంగల్ నగరంలో తొలిసారిగా 'కాకతీయ ఉత్సవాలు' నిర్వహించారు. ఈ యేడు జూలై 7 నుంచి 13 వరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నాడు నిర్వహించిన విద్యాగోష్టులు, కాకతీయ నిర్మాణాల సన్నిధిలో జరిగిన సాంస్కృతికోత్సవాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. ఆనాడు వారి సాంస్కృతిక వారసత్వంపై 'Cultural Heritage of the Kakatiyas' అనే పేర ఒక పత్రం కూడా ప్రకటించారు.

మహానగరం నిర్మించి

మిగిలిపోయిన తెలుగు పత్రాలతో 'ఏకశిలా సాహిత్య సౌందర్యం' అనే పుస్తకాన్ని రూపొందించారు. దీని భాద్యతలను ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్యులు నిర్వర్తించారు. సాహిత్య సౌందర్యం, సంస్కృతాంధ్ర సాహిత్య వికాసము ఆది నుండి ఈనాటి వరకు చరిత్రను అధ్యయనం చేయడానికి చేసిన ప్రయత్నమే. సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం కాకతీయుల కాలంలో అద్వైత బ్రహ్మ పంచరాత్రికులు, శూన్యవాదులు, కర్మవాదులు, నాస్తికులు, ప్రకృతివాదులు, ఏకాత్మకవాదులు ఉండేవారు. స్వయం పాలన ఉండేది. పొలం విస్తీర్ణాన్ని బట్టి భూమిని ఆయం అనేవారు. ఈ భూమిని పన్నులు లేకుండా పొందేవారిని ఆయగార్లు అనేవారు. వీరే గ్రామపాలన నిర్వహించేవారు.

వీరు పన్నెండు మంది. కరణం, పెదకాపు, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగళి, తలారి, చర్మకారుడు, శెట్టి మొదలైనవారు. తలారీ అంటే గ్రామ రక్షకభటుడు. కుల సంఘాలను సమయసారాలు అని పిలిచేవారు. వీరు సాంఘిక న్యాయ, మత, ధర్మ రాజనీతిలో స్వయంగా నియమ నిబంధనలు ఏర్పరచుకొని తగవులు పరిష్కరించేవారు. పాలనా సౌలభ్యం కోసం కాకతీయులు రాజ్యాన్ని నాడులు (రాష్ట్రాలు)గా, నాడులను స్థలాలుగా, స్థలాలను గ్రామాలుగా విభజించేవారు. ఒక్కో స్థలంలో రెండు నుంచి అరవై గ్రామాలు ఉండేవి. రాజుకు వేదాలు, శాస్త్రాలు, సాహిత్యం, కళలపై అవగాహన ఉండాలని, రాజు నిర్ణీత సమయాలలో ప్రజలకు దర్శనమిచ్చి వారి కష్టాలు తెలుసుకోవాలని వారి నీతిశాస్త్రం భోధిస్తుంది. యోగ్యత లేనివాడిని మంత్రిగా నియమించరాదని సూచిస్తుంది. తమ ప్రాంతంలోనున్న ఎనిమిది లక్షల మంది పౌరులు సుఖంగా ఉండేలా మహానగరం, అందులో అన్ని సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దారు.

అందమైన నగరం

కాకతీయులకు తొమ్మిది లక్షల సైనిక బలముండేది. యుద్ధ సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సేనాధిపతులను సత్కరించేవారు. కాకతీయులనాటి శిల్పకళ ఓ అద్భుత సృష్టికి తార్కాణం. కాకతీయ సామ్రాజ్య ప్రశస్తి ఈనాటికి తెలుగువారిలో, అందునా తెలంగాణ ప్రాంతవాసులలో పదిలంగా ఉంది. పద్నాలుగో శతాబ్దపు తొలి దశకంలో, ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఓరుగల్లులో జీవించిన రావిపాటి తిప్పన్న అనే కవి సంస్కృతంలో రచించిన 'ప్రేమాభిరామమన్న వీధి' రూపకాన్ని నూట పాతికేళ్ల తరువాత వల్లభరాయుడు 'ప్రేమాభిరామం' పేరుతో తిరిగి రచించాడు. అందులో వరంగల్ అందాలను చక్కగా అభివర్ణించారు. కాకతీయుల పతనం తరువాత ఎందరో పండితులు, కవులు, పౌరాణికులు ఎన్నో ప్రతికూల శక్తులను తట్టుకుంటూ తెలుగు సారస్వతాన్ని రక్షించుకుంటూ వచ్చారు.

గత శతాబ్దంలో ఒద్దిరాజు సోదరులు 'తెనుగు' పత్రికను నిర్వహించడం విశేషం. ఇది తెలంగాణలో రెండవ పత్రిక. ఈ కాలంలో ఫణికుండులుడు, తూము రామదాసు, లక్ష్మీనరసింహాచార్యులు, అమరవాది నారాయణాచార్యులు, కోవెల రంగాచార్యులు, ముదిగొండ వీరేశలింగశాస్త్రి వంటి పండిత కవులు ఓరుగంటి సాహిత్యాన్ని సజీవంగా నిలిపి ఉంచారు. కాకతీయులు తెలుగులోనూ శాసనాలు వేశారు. తూర్పు చాళుక్యుల కాలంలో ఆరంభమైన తెలుగు భాషా సారసత్వ వికాసం కాకతీయ యుగంలో పటిష్టమైంది. కాకతీయుల వలె తూర్పు చాళుక్యులు కూడా ఆంధ్రుల వ్యక్తిత్వానికి, జాతీయతకు ఆంధ్ర భాషాభివృద్ధికి మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించారు. కాకతీయ రాజులు స్వయంగా కవులే కాక సారస్వతాభిమానులు కూడా.

(వరంగల్‌లో జరుగుతున్న 'కాకతీయ ఉత్సవాల' సందర్భంగా)


కొలనుపాక కుమారస్వామి

వరంగల్, 99637 20669

Advertisement

Next Story

Most Viewed