- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుల ఊబిలో అన్నదాత...!
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకు పోయి దిక్కులు చూస్తున్నాడు. రైతు బతుకు జగన్ పాలనలో గాలిలో దీపమయ్యింది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులను మభ్యపెట్టడానికే తప్ప వారిని ఆదుకొనేవి కావు. అంకెల గారడీలతో, అబద్దాలతో రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. నాలుగేళ్లలో రూ.1,70,769 కోట్లు ఇస్తే వ్యవసాయం రంగం ఎందుకు ఇంత సంక్షోభంలోకి నెట్టబడింది? రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయి? అప్పుల ఊబిలో రైతులు ఎందుకు కూరుకు పోయారు? ఆహారధాన్యాల ఉత్పత్తి ఎందుకు పతనమైంది? 2017-18లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 167 లక్షల టన్నులుంటే, 2022-23 నాటికి 163.32 లక్షల టన్నులకు ఎందుకు పడిపోయింది? నాలుగేళ్ల పాలన తర్వాత కూడా 4 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గడం మీ వైఫల్యం కాదా? ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటు మైనస్ 2.53%కు ఎందుకు పడిపోయింది? వ్యవసాయ రంగాన్ని తిరోగమనంలోకి నెట్టిన వాస్తవాలు ఇలా ఉంటే, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని చెప్పడం అబద్ధం కాదా? ధాన్యం ఉత్పత్తి గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో సగటున హెక్టారుకు 4,904 కిలోలు ఉత్పత్తి రాగా, జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో సగటున 4,588 కిలోలు మాత్రమే వచ్చింది. అంటే సగటున 316 కిలోల ఉత్పత్తి తగ్గడం మీ ఘనతనా? మీ పాలనలో వేరుశనగ ఉత్పత్తి కూడా హెక్టారుకు సగటున 187 కిలోలు ఎందుకు తగ్గింది? ధాన్యం, వేరుశనగే కాదు మిగిలిన ఆహారధాన్యాల ఉత్పత్తి అంతే వుంది. కేంద్రం అమలుచేసే రైతాంగ పథకాల అమలులో, ఆర్‌బీకే, రైతుభరోసాలో అన్నీ సకలం వైఫల్యాలే.
సమస్తం వైఫల్యాల బాటలో...
అంతే కాదు వ్యవసాయం దాని అనుబంధ రంగాలన్నింటినీ అధోగతి పాలు చేసింది మీరు కాదా? నాలుగేళ్ల వృద్ది రేట్లే అందుకు సాక్ష్యాలు.(స్థిర ధరల ప్రకారం) వ్యవసాయంలో వృద్ధి తెలుగుదేశం హయాం నాలుగేళ్లలో 11.2% ఉంటే, వైసీపీ హయాంలో 6.01%కు దిగజారింది.అంటే దాదాపు సగానికి వృద్ధిరేటు పతనమైంది. పశుసంవర్ధకంలో గత ప్రభుత్వ హయాంలో వృద్ధి 13% ఉంటే వైసీపీ నాలుగేళ్లలో 5.9%కు పడిపోయింది. లైవ్ స్టాక్ గ్రోత్ రేటు 7.1% దిగజార్చారు. ఉద్యాన రంగంలో గత నాలుగేళ్ల హయాంలో వృద్ధి 12.9% ఉంటే, జగన్ సీఎం అయ్యాక ఈ నాలుగేళ్లలో 6.1%కు పతనం అయింది. అంటే హార్టీకల్చర్‌లో వృద్ధి మైనస్ 6.8%. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా కల్చర్ వృద్ధి 28.9% ఉంటే, వైసీపీ నాలుగేళ్ల పాలనలో అది 9.2%కు దిగజారింది. ఆక్వాలో వృద్ధిని మైనస్ 19.7%కు పతనం చేశారు. మూడోవంతుకు దిగజార్చిన ఘనత కూడా సీఎం జగన్ దే. (ఇవన్నీ ప్రభుత్వ నివేదికల ప్రకారమే) హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా 10%నుంచి 4%కు పతనమైంది. అందుకే రైతులకు గిట్టుబాటు ధరలు అందని దుస్థితి నెలకొంది. రూ 4వేల కోట్ల స్థిరీకరణ నిధి, రూ 4వేల కోట్ల విపత్తు సహాయ నిధిని ఎగ్గొట్టారు. అయినా అబద్దాలకు, బడాయికి కొదవ రానివ్వడం లేదు జగన్ రెడ్డి. వాస్తవాలు ఇలా వుంటే రైతులను తాను ఉద్దరించినట్లు అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు. అన్నదాతకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు బతుకు గాలిలో దీపమైంది. విత్తనం వేసిన దగ్గర నుండి ఉత్పత్తులు మార్కెట్‌లో అమ్ముకోనే దాకా ప్రతి దశలోనూ రైతులను చెయ్యి పట్టి నడిపిస్తానని బులిపించి అధికారంలోకి వచ్చిన జగన్ జమానాలో రైతులకు చేసిన సాయం కంటే చేసిన వంచనలే ఎక్కువని చెప్పాలి.
రైతు భరోసాలో నిజాయితీ శూన్యం
రైతులను తామేదో ఉద్దరించినట్లు సోత్కర్షలు వినిపించడానికే రైతు దినోత్సవాలు జరిపారు తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులను మభ్యపెట్టడానికే తప్ప వారిని ఆదుకొనేవి కావు. మాయ భరోసాతో అరకొరగా రైతు భరోసా ఇచ్చి సమస్త రైతు సమస్యలు పరిష్కరించినట్లు పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తూ, అంకెల గారడీలతో, అబద్ధాలతో రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 79,50,844 రైతు ఖాతాలుండగా, 49 లక్షల మందినే రైతు భరోసాకు అర్హులుగా చూపించారు. రైతు భరోసా కింద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచే రూ.12,500 ఒకేసారి మే నెలలో ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. రూ.12,500 రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండగా దానికి కేంద్రం ఇస్తానన్న రూ.6000 కలిపి రూ 18,500 రైతుకి ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్రం ఇచ్చే రూ.6000 లకు రాష్ట్ర ప్రభుత్వం రూ 7,500 కలిపి రూ.13,500 ఇస్తున్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.50 వేల వరకు లబ్ధి చేకూరుస్తామని మేనిఫెస్టోలో తెలిపి. రూ.37,500 మాత్రమే ఇస్తూ. రూ.67,500 ఇస్తున్నట్లు రైతులను మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీగా రూ.1,50,000ను వాయిదాల పద్ధతిలో చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. తానూ మాత్రం ఒకే విడతలో రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు తానూ ఇచ్చే రూ.7,500 కూడా మూడు విడతలుగా రైతులకు ముష్టి వేస్తున్నారు. కౌలు రైతులు 15.36 లక్షల మంది ఉండగా లక్ష మందికి కుదించి రైతులను కులాల వారీగా విడదీసి రైతు భరోసా పధకంలో అగ్రకులాల పేద రైతులకు అన్యాయం చేశారు. ఈ మధ్య వర్ష బీభత్సానికి, వరదలకు లక్షలాది ఎకరాల్లో వేసిన పంటలు నీటమునిగి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రైతు పక్షపాతిగా ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎన్నడైనా రైతు పక్షం వహించారా?
గిట్టుబాటు ధర పతనం
రైతులను జగన్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నదో రైతులు కూడా అర్థం చేసుకోవాలి. పంట వేసిన రైతుల గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం ధరల స్థిరీకరణ నిధి పేరుతో బడ్జెట్లో రూ.3000 కోట్లు, ప్రకృతి, విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడానికి రూ.4000 కోట్లు కేటాయిస్తానని మోసం చేశారు. సువాబులు, జామాయిల్, సర్వే రైతులను ఆదుకొంటామని, టన్నుకు రూ.5,000 వేలు ధర పెంచుతామని హామీ ఇచ్చి ధర పెంచకపోగా అంతకు ముందున్న టన్ను ధర రూ.3,500 కూడా లేకుండా నేడు రూ.1200లకు దిగజారినా పట్టించుకోవడం లేదు. అదనపు అప్పుల కోసం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్తు సబ్సిడీ ఇస్తామని ఇవ్వకపోగా పెంచి ఆక్వారంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. పాడి రైతులకు లీటరు పాలకు 4 రూపాయలు బోనస్ ఇస్తామని ఎగనామం పెట్టారు. రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని బులిపించి వట్టి చేతులు చూపించారు. వైయస్సార్ జలకళ పేరుతో ఉచిత బోర్లు వేయిస్తామని, ఆర్భాటంగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళను అటకెక్కించారు. వ్యవసాయ యాంత్రీకరణకు మంగళం పాడారు. గత ప్రభుత్వం డ్రిఫ్ ఇరిగేషన్ పథకం కింద చిన్న, సన్న కారు రైతులకు 90 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ అందించగా, జగన్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఉచితంగా అందించే సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఎరువుల పంపిణీని సైతం నిలిపేశారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద 58.29 లక్షల మంది రైతులకు రూ.15,279 కోట్లు రుణమాఫీ చేసి ఆదుకుంది. జగన్ అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం చెల్లించాల్సిన, 4-5 విడతల రైతు ఋణ మాఫీ పథకాన్ని రద్దు చేసి రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. ఎవరు చేసినా రైతుకు మేలు జరగడం ముఖ్యం. కానీ రైతు రుణమాఫీ పట్ల ప్రతికూల వైఖరి తీసుకోవడం దారుణం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకు పోయాయని, ఒక్కో కుటుంబంపై సగటున రూ. 2,45,554లు అప్పు ఉన్నట్లు ఇటీవల ఓ నివేదిక వెలువడింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం బ్రహ్మాండమంటూ పత్రికల్లో ప్రకటనలిస్తూ రైతుల్ని మభ్య పెడుతున్నారు. జగన్ రెడ్డి జమానాలో 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. అన్నదాతల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. పల్నాడు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో నిత్యం అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి దర్పణం పడుతోంది.
చేసింది చిటికెడంతే..!
సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి సహకార డైయిరీల ఆస్తులతో పాటు ప్రభుత్వ ధనం రూ 6,000 కోట్లను చిత్తూరు డెయిరీని గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు ధారాదత్తం చేశారు. పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా జాతీయ నమూనా సర్వేలో మాత్రం ఎక్కువ మంది తమకు మద్దతు ధర దక్కడం లేదని తేలింది. గిట్టుబాటు ధర కాదు కదా కనీస మద్దతు ధరకు కూడా దిక్కు లేదు. మిల్లర్లు, వ్యాపారులు, దళారులదే జగన్ పాలనలో రాజ్యమైంది. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించడం రాష్ట్రంలో సాగు సంక్షోభానికి నిదర్శనం. వర్షాలు సమృద్ధిగా పడినా, వ్యవసాయానికి అనుకూల వాతావరణం వున్నా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టింది జగన్ ప్రభుత్వం. వ్యవసాయ రంగానికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది రైతుల దుస్థితి. ఒక పక్కన సాగు సంక్షోభం పెరిగిపోతుంటే,రైతులు అప్పుల భారంతో కుప్పకూలుతుంటే, మరోపక్క ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసాం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని సొంత పత్రికలో బాకాలుదు కొంటున్నారు. మీ పాలనలో సాగు బ్రహ్మాండం అని చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుంది. రైతుల పట్ల చిలక పలుకులు కాదు. జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రైతు లోగిళ్ళలో చీకట్లు అలుము కొన్నాయి. రైతుల గురించి జగన్ చెప్పేది కొండంత చేసింది చిటికెడంత అని రైతు సోదరులు తెలుసుకోవాలి.
నీరుకొండ ప్రసాద్
98496 25610