- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కామన్ మ్యాన్ డైరీ: షరతులు వర్తిస్తాయి!
లోన్ ఇప్పిస్తామని మీరే అన్నారు కదా?అని అడిగారు. 'అవన్నీ లక్ష చెబుతాం అమ్మా. డబ్బులు ఇవ్వడం కుదరదు'అంటూ మొండికేశాడు. ఇల్లు ఆశకు పోయి. ఉన్న నగలు పోగొట్టుకొని ఎవరికీ చెప్పుకోలేని బాధతో వెనుదిరిగారా మధ్యతరగతి దంపతులు. సర్కారు కొలువున్నా సొంతిల్లు కొనలేని పరిస్థితి. షరతులు వర్తిస్తాయన్నఆ చిన్ని అక్షరాలు చూడక ఏకంగా రూ. రెండు లక్షలు నష్టపోయారు.
కరీంనగర్ కు చెందిన నైటింగేల్‌కు హైదరాబాద్‌లో నర్స్‌గా ఉద్యోగం వచ్చింది. దాదాపు పదేళ్ల నిరీక్షణ అనంతరం సర్కారు కొలువు ప్రాప్తించింది. గాంధీ దవాఖానలో పోస్టింగ్ ఇచ్చారు. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగి. నెలకు 20 వేల జీతం. నైటింగేల్‌కు వేతనాల్లో కోతలు పోను 65 వేల దాకా వస్తుంది. సంసారం సాఫీగానే సాగుతున్నది. కిరాయి ఇండ్లలో ఏం ఉంటాం. ఓ ఇల్లు కొనుక్కుందాం. ఈఎంఐలో కట్టేసుకోవచ్చు అనుకున్నారు భార్యాభర్తలు. మంచి ఇంటి కోసం వెతకడం మొదలెట్టారు. వాళ్లకు ఇండిపెండెంట్ హౌస్ కానీ, విల్లా కానీ కావాలనుకున్నారు. వెతకడం మొదలెట్టారు. ఎట్టకేలకు పటాన్ చెరువు సమీపంలో ఓ విల్లాను పక్కా చేసుకున్నారు.
ప్రీ అగ్రిమెంట్ వెంచర్ అది. ముందుగా ఎంతో కొంత డబ్బు కట్టాలి. 'నేను గవర్నమెంట్ ఎంప్లాయ్‌ని. నా జీతంలో నుంచి కట్ చేసుకొనేందుకు బ్యాంకులు అప్పు ఇస్తాయి కదా! మీరేమైనా హెల్ప్ చేస్తారా? అని అడిగింది నైటింగేల్. 'తప్పకుండా'అంటూ ఓ ప్రైవేటు బ్యాంకును చూపించాడా వెంచర్ యజమాని. 9 శాతం వడ్డీ అని బ్యాంకు ఏజెంటు తెలుపడంతో సరే అన్నారు. ఓ రోజు నైటింగేల్ దంపతులను బ్యాంకుకు తీసుకెళ్లాడు ఏజెంటు. లోన్ కోసం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో బ్యాంకరు కూల్ డ్రింక్ ఇచ్చి మర్యాదలన్నీ చేశాడు. మీకు ఎంత కావాలి? అని అడిగాడు. 60 లక్షలు అని చెప్పారు వీళ్లు. ఏరియా, విల్లా కన్ స్ట్రక్షన్ వివరాలు అన్ని అడిగి తెలుసుకున్నాడు. వెంట వచ్చిన ఏజెంటు భూమి తాలుకు దస్తావేజులన్నీ చూపాడు. మీ శాలరీ, సర్వీస్ సర్టిఫికేట్ తీసుకొని రేపు రండి అంటూ పంపించాడు బ్యాంకు మేనేజర్.
ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకొని శాలరీ సర్టిఫికేట్, సర్వీస్ ధ్రువీకరణ పత్రం అన్నీ తీసుకున్నారు. ఆ లోపే టోకెన్ అడ్వాన్సు కింద ఉన్న నగలు అమ్మి రెండు లక్షల రూపాయలను వెంచర్ ఓనర్ కు చెల్లించారు. మూడు రోజుల తర్వాత బ్యాంకుకు వెళ్లారు. శాలరీ, సర్వీస్ సర్టిఫికేట్లు చూసిన బ్యాంకు మేనేజర్ 'కష్టం'అన్నాడు. వీళ్లిద్దరి గుండె ఆగినంత పనైంది. 'ఎందుకు సర్?'అని అడిగారు. 'మీ శాలరీకి అంత లోన్ రాదు' అని చెప్పారు. 'నెలకు 60 వేలు నేను కట్టగలను''మీరు కట్టగలరేమో కానీ మేం ఇవ్వలేం'అన్నాడు బ్యాంకు మేనేజర్. ఎందుకు? అని అడిగారు. 'మీ జీతంలో 30 శాతం కుటుంబ అవసరాలకు కావాలి కదా? వాటిని కట్ చేస్తే 40 వేల రూపాయలే వస్తుంది. అంటే నలభై లక్షలు. మీ సర్వీసు ఇంకా 17 ఏండ్లే ఉన్నది. కాబట్టి తీర్చలేరు.. కష్టం'అంటూ పెదవి విరిచాడు బ్యాంకు మేనేజర్. 'మావారు ప్రైవేటు ఎంప్లాయ్, ఆయనకు నెలకు 20 వేల వరకు వస్తుంది. వాటితో మేం సర్దుకుంటాం'అంటూ భరోసా ఇచ్చినా వినలేదు. సర్కారు కొలువులే ఉంటాయో, ఊడుతాయో తెలియదు. ప్రైవేటు ఉద్యోగాన్ని నమ్ముకొని అప్పు ఇవ్వలేమని తేల్చి చెప్పాడు.
సొంతింటి కల సాకారం చేసుకుందామని ఆశలు పెట్టుకున్న నైటింగేల్ కంటనీరు ఆగడం లేదు. 'ఎలాగైనా చూడండి సార్ ప్లీజ్'అంటూ బతిమాలసాగింది. బ్యాంకు అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి కదమ్మా! సారీ మేమేం చేయలేమన్నాడు. ఏం చేయాలో అర్థం కాక వెంట వచ్చిన ఏజెంటును తీసుకొని బయటికి వచ్చారు. 'అన్నా.. కొంచెం వేరే బ్యాంకులో ఏమైనా ట్రై చేయండి.. ప్లీజ్ అంటూ బతిమాలింది'నైటింగేల్. ఏం చేయలేం సిస్టర్! అన్ని బ్యాంకులకు ఒకే రూల్ ఉంటుంది కదా, అన్నాడా ఏజెంటు. తెలిసిన వారినల్లా అడిగి చూశారు. ఎక్కడైనా.. ఏ బ్యాంకులోనైనా అవకాశం దొరుకుతుందేమోనని చివరకు లాభం లేదని నిర్ణయించుకున్నారు.
మరోమారు వెంచర్ వరకు వెళ్లారు. తమకు లోన్ రావడం లేదని, టోకెన్ అడ్వాన్స్ కింద ఇచ్చిన రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు. 'మాది ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ, మాకూ కొన్ని రూల్స్ ఉంటాయి. మీతో అగ్రిమెంట్ పూర్తయింది. మీరు చాలా కాగితాల మీద సంతకం చేశారు. ఆ ప్రకారం మీరిచ్చిన టోకెన్ అడ్వాన్సు తిరిగి ఇవ్వడం కుదరదు.. మీ కోసం ప్లాట్ రిజర్వ్ చేశాం. చాలా మంది అడిగినా ఇవ్వలేదు. మీకు రిజర్వ్ చేయడం వల్ల మేం నష్టపోయాం.. దానిని వదులుకోవాలన్నా ఇప్పుడు కుదరదు. మరో మూడు లక్షలు కట్టాల్సిందే'అంటూ దబాయించాడు. లోన్ ఇప్పిస్తామని మీరే అన్నారు కదా?అని అడిగారు. 'అవన్నీ లక్ష చెబుతాం అమ్మా. డబ్బులు ఇవ్వడం కుదరదు'అంటూ మొండికేశాడు. ఇల్లు ఆశకు పోయి. ఉన్న నగలు పోగొట్టుకొని ఎవరికీ చెప్పుకోలేని బాధతో వెనుదిరిగారా మధ్యతరగతి దంపతులు. సర్కారు కొలువున్నా సొంతిల్లు కొనలేని పరిస్థితి. షరతులు వర్తిస్తాయన్నఆ చిన్ని అక్షరాలు చూడక ఏకంగా రూ. రెండు లక్షలు నష్టపోయారు.
ఎంఎస్ఎన్ చారి
79950 47580