- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ ఒక రిఫరెండం
ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఒక సామెత వింటూ ఉంటాం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని. ఇప్పుడు హుజారాబాద్ విషయంలో అదే జరుగుతున్నది. ఈ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలవడానికి కేసీఆర్ అన్ని అస్త్రాలనూ ఉపయోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోనంతటి ఒత్తిడికి గురవుతున్నారు. ఏ ఉప ఎన్నిక గురించి ఆలోచించనంతగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. 'దేశమే అడ్డం పడే పథకం' అంటూ చాలా కాలం ఊరించిన 'దళితబంధు'ను బైటకు తీశారు. దీని అమలు కోసం దాదాపు ఒక ఏడాది బడ్జెట్‌కు సమానమైన స్థాయిలో నిధులను కేటాయిస్తున్నారు. ఇక్కడ ఈటలను ఢీకొంటున్నది టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ కాదు. నేరుగా కేసీఆరే. పోటీచేసేది ఎవరైనా కేసీఆర్ ముఖం చూసే ఓటు వేస్తారని టీఆర్ఎస్ నేతలే చెప్తున్నారు. అయినా, ఇక్కడ పోటీని తేలికగా తీసుకోవడంలేదు. మండలానికో మంత్రిని, గ్రామానికో ఎమ్మెల్యేను కేటాయించారు. అప్పజెప్పిన బాధ్యతలలో విఫలమైతే సీరియస్‌గానే వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రులను, ఎమ్మెల్యేలను హెచ్చరించారు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం కార్పొరేషన్ల పదవులను, గవర్నర్ కోటా ఎమ్మెల్సీని ఇక్కడివారికే కేటాయించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ సమయాన్ని ప్రగతిభవన్‌లోనే గడుపుతున్నారు. ఇంతకాలం మంత్రులకే ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ దొరకని పరిస్థితులలో ఇప్పుడు హుజూరాబాద్ స్థానిక నేతలకు కూడా ఆయనను కలిసే అవకాశం లభిస్తున్నది.
కేసీఆర్ ప్రజాదరణను తేల్చే ఎన్నిక
కేసీఆర్‌కు ఎంతటి ప్రజాదరణ ఉన్నదో, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఎలాంటి నమ్మకం ఉన్నదో హుజూరాబాద్ ఫలితం తేల్చనున్నది. ఆయన మాటలకు, చేతలకు ప్రజలు ఈ నియోజకవర్గంలో ఓటు ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, లబ్ధిదారులుగా ఓటర్లు అందుకుంటున్న ఫలాలు, తాజాగా తెరమీదకు వచ్చిన దళితబంధు. ఇవన్నీ ఆయన పట్ల ఉన్న విశ్వసనీయతను బహిర్గతం చేయనున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు హుజూరాబాద్ ఫలితం ఆ పార్టీకి ఒక రిఫరెండం అని భావించక తప్పదు. హుజూరాబాద్‌లో గెలిచినా ఓడినా ఆ క్రెడిట్ కేసీఆర్‌కే దక్కుతుంది. ప్రజలలో ఆయనకున్న ఇమేజ్‌ను ఈ ఫలితం ఖరారు చేయనున్నది.
ఎన్ని పథకాలు తెచ్చినా క్షేత్రస్థాయి పరిణామాలు కేసీఆర్‌కు సంతృప్తి ఇవ్వడంలేదు. 'ఒక్క ఈటల రాజేందర్ రాజీనామా చేసినందువల్లనే కదా.. ఇవన్నీ వచ్చింది' అని సాధారణ ప్రజలలో చర్చ జరుగుతున్నది. విపక్షాలు కూడా దీన్నే ప్రస్తావిస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పుకోవడం ఇప్పుడు గులాబీ నేతల వంతయింది. ప్రజలలో తన విశ్వసనీయతను పెంచుకోడానికి గ్రామాలలో సిమెంటు రోడ్లు లాంటి అభివృద్ధి పనులు, ఆగమేఘాల మీద ఆసరా పింఛన్ల మంజూరు, కొత్త రేషను కార్డుల జారీ, అనుకూలంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులను నియమించుకోవడం, ఈ నియోజకవర్గానికి చెందిన నేతలకు కొత్త పదవులను కట్టబెట్టడం.. ఇలా అనేక ప్రయోగాలు చేస్తున్నారు.
దళితబంధు భవిష్యత్తేంటి?
ఏడున్నరేళ్ల బంగారు తెలంగాణ ప్రయాణానికి ఎన్ని మార్కులు పడతాయో హుజూరాబాద్ నిర్ణయించనున్నది. ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఉప ఎన్నిక కీలకంగా మారనున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే తెరమీదకు వచ్చిన దళితబంధుకు దళితుల నుంచి ఎలాంటి ఆదరణ ఉన్నదో తేలిపోనున్నది. 'దళితబంధు ఒక కార్యక్రమం కాదు.. ఒక ఉద్యమం. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్తు తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉంటది. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలి' అంటూ స్వయంగా కేసీఆర్ చెప్పినందున ఇక్కడ కేసీఆర్ అనుకున్నదానికి భిన్నంగా ఫలితం వస్తే దళితబంధు ఏమవుతుందనే సందేహాలు సహజంగానే ఉన్నాయి. హుజూరాబాద్ ఓటర్లలో దళితబంధు పట్ల నమ్మకం కలిగించడానికి వాసాలమర్రి గ్రామంలో అందరికీ ఈ పథకం కింద నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని దళితులందరికీ నమ్మకం కలిగించడానికి హుజూరాబాద్‌లోని మొత్తం దళిత కుటుంబాలకు నిధులను విడుదల చేస్తూ ఉన్నారు. 'రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా? ' అంటూ స్వయంగా కేసీఆరే వ్యాఖ్యానించారు. అయినా ప్రజలలో అనుమానాలు ఉన్నాయి. ఈ పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. చివరకు ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావు దానికి క్లారిటీ ఇచ్చారు. 'సీఎం దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. భూములను అమ్మి నిధులను సమకూర్చుకుంటాం' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఈ గెలుపుతో రాస్తా క్లియర్
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లాంటి ప్రతిపక్షాలు ఉన్నా కేసీఆర్‌కు పెద్దగా లెక్క లేదు. ఐదేళ్లపాటు ప్రతిపక్షాలను ఎక్కడ ఉంచాలో ఆయన తన ప్రాక్టీసు ద్వారా తేల్చేశారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలో గెలుపు ఎలా ఉన్నా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు అత్యంత కీలకం. 'ఈటల రాజేందర్ లాంటి వ్యక్తినే ఓడించాం.. ఇక ప్రతిపక్షాలు ఒక లెక్కా' అనే మెసేజ్‌తో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకుంటారు. ఇక్కడ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు కేక్ వాక్‌గానే ఉంటుంది. హుజూరాబాద్‌లో ఫలితం తారుమారైతే అది మొత్తం పార్టీకి, అధినేతగా కేసీఆర్‌కు అనేక చిక్కులను తీసుకొస్తుంది. అందుకే సాధారణ ఎన్నికలకు సమానంగా ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నికను కీలకంగా తీసుకుంటున్నారు. ఉద్యమ సహచరుడిగా మాత్రమే కాక పార్టీ నిర్మాణం, పరిపాలనలో నమ్మకస్తుడిగా ఇంతకాలం ఈటల రాజేందర్‌తో కేసీఆర్‌కు గాఢమైన అనుబంధమే ఉన్నది. కేసీఆర్ ఎలా ఆలోచిస్తారో, రాజకీయ ఎత్తుగడలను ఎలా అమలు చేస్తారో, గెలుపు కోసం ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తారో.. సుదీర్ఘ అనుబంధం ఉన్న ఈటలకు బాగా తెలుసు. ఇప్పుడు అవే ఎత్తుగడలు ఫలించవన్న ఉద్దేశంతో కేసీఆర్ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. ఒకటిన్నర దశాబ్దంపాటు నియోజకవర్గంలో ప్రజలకు తలలో నాలుకగా మారిన ఈటలను ఢీకొట్టడం సులువేమీ కాదని కేసీఆర్ గ్రహించారు. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్ర తరహాలో భారీస్థాయి దళితబంధును తెరపైకి తెచ్చారు.
గులాబీ జెండా ఓనర్ ఎవరు?
హుజూరాబాద్‌కు కేసీఆర్ ఇంతకాలం చేసింది ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం తాత్కాలిక తాయిలాలతో ఓటర్లను దగ్గర చేసుకోవాలనుకుంటున్నారు. 'గులాబీ జెండా ఓనర్లం మేమే' అంటూ కామెంట్ చేసిన ఈటల ఒకవైపు, గులాబీ జెండా ఓనర్‌గా కేసీఆర్ మరోవైపు ఉండి జరుగుతున్న ఈ ఉప ఎన్నిక తెలంగాణలో సరికొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించనున్నది. జాతీయస్థాయి రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌కు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాలుగా మారింది. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కేసీఆర్‌కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక సెంటిమెంట్. విజయానికి తొలి మెట్టు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ హుజూరాబాద్‌లో రిపీట్ అవుతుందా? కొత్త చరిత్రను సృష్టిస్తుందా? వేచి చూడాల్సిందే!
ఎన్. విశ్వనాథ్