బాధ్యత మరిచిపోయిన ఎంపీలు

by Viswanth |   ( Updated:2022-03-10 09:40:41.0  )
బాధ్యత మరిచిపోయిన ఎంపీలు
X

పార్లమెంటును ప్రజాస్వామ్యానికి దేవాలయంగా చెప్పుకుంటారు. అదొక పవిత్రమైన భవనం అనే భావన కూడా ఉంటుంది. కానీ, గతంలో అనేకసార్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లుగానే ఇప్పుడు కూడా ఎంపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించాలన్న గురుతర బాధ్యతను విస్మరించారు. పెగాసస్ అంశంపై పదకొండు రోజులుగా సభా కార్యక్రమాలు జరగడమే లేదు. 'తిలా పాపం తలా పిడికెడు' అన్న చందంగా అటు అధికార పార్టీకి చెందినవారు, ఇటు విపక్షాల సభ్యులు ఇందుకు కారణం. 'పెగాసస్'ను మించిన అంశమేలేదన్నట్లుగా పార్టీలు, వాటికి చెందిన సభ్యులు వ్యవహరిస్తున్నారు. ప్రధానిగా ఎన్నికైన వెంటనే పార్లమెంటు మెట్లకు దండం పెట్టిన నరేంద్రమోడీ దానికి ఉన్న పవిత్రతను గుర్తుచేశారు. చాలా మంది రాజకీయ నాయకులు ఒక్కసారైనా ఎంపీగా ఎన్నికై ఆ భవనంలోకి ఎంటర్ కావాలని కోరుకుంటారు. ప్రధాని మొదలు సభ్యుల వరకు సభా కార్యకలాపాలు సజావుగా జరగడంపై బాధ్యతతో వ్యవహరించడంలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరించడం సభ్యుల బాధ్యత. అది అటకెక్కింది. గతంలోనూ బోఫోర్స్, 2-జీ స్కామ్, 'కోల్‌గేట్', వ్యవసాయ చట్టాలు లాంటి పలు అంశాలపై సభా సమయం వృథా అయింది. ఇప్పుడు అది పెగాసస్ వంతయింది.

సమస్యల ప్రస్తావనలో విఫలం

ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా కష్టాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, పెట్రోలు-డీజిల్ ధరలు ఊహకు అందని విధంగా పెరగడం, నిరుద్యోగం, వలస కార్మికుల బాధలు, ద్రవ్యోల్బణం ఇలా అనేక అంశాలు ప్రజలకు జీవన్మనరణ సమస్యగా మారాయి. కరోనా కాలంలో కోట్లాది మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఆప్తులను కోల్పోయిన వేలాది కుటుంబాల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఆక్సిజన్ కోసం, ఆస్పత్రులలో బెడ్‌ల కోసం పడరాని పాట్లు పడ్డారు. వైద్యం కోసం సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పటికీ ఆ బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఇవేవీ పార్లమెంటులో ప్రస్తావనకు రాలేదు. ఆ మాటకొస్తే కరోనా కారణంగా పలువురు కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ సభ్యులు చనిపోయారు. కరోనా తీవ్రత ఎంతో ప్రభుత్వానికి, పార్లమెంటు సభ్యులకు తెలియందేమీ కాదు. ఎంపీలుగా వారి నియోజకవర్గంలోని ప్రజల నుంచి ఆస్పత్రుల్లో బెడ్‌ల కోసం, మందుల కోసం, ఆక్సిజన్ కోసం వచ్చిన వేలాది విజ్ఞప్తులూ చాలామందికి స్వీయానుభవం. గతంలో ఎన్నడూ లేనంతటి ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం తరపున ఒక దారిని చూపించాల్సిన బాధ్యత ఎంపీలది. ఏ ప్రజలు ఓట్లేయడం ద్వారా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ఎంపీలుగా ఈ సభలోకి అడుగు పెట్టారో ఆ ప్రజల సమస్యలను ప్రస్తావించడంలో మాత్రం విఫలమయ్యారు.

కరోనా బాధలు గాలికి

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభలో ప్రస్తావించి భారాన్ని తగ్గించాలన్న స్పృహ ఎంపీలలో లేకపోవడం బాధాకరం. కరోనా సెకండ్ వేవ్ టైమ్‌లో ట్విట్టర్ ద్వారా అనేక మంది పార్టీల అధినేతలు, ఎంపీలు ప్రధానిని, ప్రభుత్వాన్ని నిందించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తీరా పార్లమెంటు సమావేశాలు వచ్చేటప్పటికి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెగాసస్ వ్యవహారాన్ని మించిన అంశం లేదనే భావనలో ప్రతీరోజూ సమావేశాలను అడ్డుకుంటున్నారు. ఆ ఒక్క సమస్య తప్ప మరోటి లేదన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం సైతం అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దేశం మొత్తంమీద మూడు కోట్ల మందికిపైగా కరోనాబారిన పడ్డారు. నాలుగు లక్షల మందికిపైగా చనిపోయారు. ఇక లెక్కలలోకి రాకుండా చనిపోయినవారు దీనికి రెండు రెట్లు ఎక్కువగానే ఉంటారని అంచనా. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అందక వేలాది మంది కన్నుమూశారు. ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకుని 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్' పేరుతో ప్రత్యేక గూడ్సు రైళ్లను నడిపింది. ఏ రాష్ట్రానికి ఎంత అవసరమో లెక్కలు తేల్చి సరఫరా చేసే చర్యలు తీసుకున్నది. మందులు దొరకకపోతే ఉత్పత్తిని పెంచి రేషను వ్యవస్థను రూపొందించింది. తీవ్రత ఇంత భారీ స్థాయిలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ దేశంలో ఒక్కరు కూడా ఆక్సిజన్ అందని కారణంగా చనిపోలేదు అని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నది.

రూ.130 కోట్ల ప్రజా ధనం వృథా

ఒక్కో నిమిషానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున ఖర్చవుతుందని అంచనా. ఒక రోజుకు సగటున పది కోట్ల రూపాయల చొప్పున ఈ పదకొండు రోజులలో సుమారు రూ. 130 కోట్ల మేర ప్రజా ధనం వృథా అయినట్లు లెక్కలు తేలాయి. విపక్షాల కార్యాచరణ ఎలా ఉన్నా సభను సజావుగా నడిపించే బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. గత బడ్జెట్ సమావేశాల సమయంలో వ్యవసాయ చట్టాల విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడూ ఆ పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నా దిద్దుబాటు చర్యలు శూన్యం. తన పని తాను చేసుకుంటూ అవసరమైన బిల్లులను ఆమోదించుకుంటూ ఉన్నది. ఇరుపక్షాల తీరు 'చిత్తశుద్ధి లేని శివపూజ' తరహాగా మారిపోయింది. పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయని తెలియగానే ఎంపీలు అనేక అంశాలపై అధ్యయనం మొదలుపెడతారు. స్థానికంగా ప్రజల సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటారు. లోతుగా వివరించడానికి స్పీకర్‌కు, చైర్మన్‌కు ప్రత్యేక విజ్ఞప్తి చేసి తగిన సమయాన్ని ఇవ్వాలని కోరుతూ ఉంటారు. దేశ ప్రజల తలరాతను మార్చే చట్టాల విషయంలో 'పెనం మీద నుంచి పొయ్యి'లో పడకుండా ఉండాలని తపన పడుతూ ఉంటారు. చర్చలలో వీలైనంత ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటారు. వ్యక్తిగతంగా ఎలాంటి ప్లానింగ్ వేసుకున్నా పార్టీ లైన్ ప్రకారమే నడుచుకోవడం వారి ధర్మం. అందుకే ఇప్పుడు పార్టీ తీసుకునే విధాన నిర్ణయానికి అనుగుణంగా పెగాసెస్ విషయంలో రోజూ ధర్నాలు, నిరసనలతో వార్షాకాల సమావేశాలను వృథా చేస్తున్నారు.

విఫలమవుతున్న ప్రభుత్వం

ప్రతిపక్షాలు ఎలా వ్యవహరించినా దారిలో పెట్టి సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దురదృష్టవశాత్తూ ఆ బాధ్యతను గాలికొదిలేసి ఇదే సరైన అవకాశం అనుకుంటూ, చర్చలకు ఆస్కారమే ఇవ్వకుండా అనుకున్న బిల్లులన్నింటినీ ఆమోదించుకుంటూ ఉన్నది. అధికార, విపక్ష సభ్యులు బాధ్యత నుంచి తప్పుకున్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని నీతులు చెప్పే నేతలు ఇప్పుడు ప్లకార్డులు పట్టుకోవడం, బిల్లులను చింపివేయడం, నినాదాలు చేయడంలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పార్లమెంటు సమావేశాలను కళ్లారా చూడాలని చాలా మంది ప్రజలు లోపలికి వెళ్తుంటారు. ఏం చేయవచ్చో, ఏం చేయకూడదో వారికి నిర్దిష్టమైన నిబంధనలే ఉన్నాయి. ఎంపీల తీరు మాత్రం అతీతులం అనే విధంగా ఉంది. పార్లమెంటు సభ్యుడిగా ప్రొటోకాల్ ఇవ్వలేదని ఘర్షణ పడే ఈ ఎంపీలు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నామంటూ వారిని వారు ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును కోరుకోవడమే కాదు. ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కర్తవ్యాన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రభుత్వాన్ని నిందించడమే కాదు లోపాలను ఎత్తిచూపి చక్కదిద్దే బాధ్యత కూడా వారిపై ఉంది.

ఎన్.విశ్వనాథ్

Advertisement

Next Story

Most Viewed