బ్రేకింగ్ : ఎన్నికల వేళ ఈటల మాస్టర్ ప్లాన్.. గులాబీ శ్రేణుల్లో ఓటమి భయం!

by Anukaran |   ( Updated:2021-12-09 01:28:30.0  )
Eatala-Rajender-Vs-TRS
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కరీంనగర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రధాన దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచి మాజీ మేయర్ సర్దార్​ రవీందర్​సింగ్‌ను గెలిపించేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. నిన్నటి వరకు క్యాంపుల్లో ఉన్న ఓటర్లను వదిలేసి కుటుంబాలను టార్గెట్ చేసి ప్లాన్ అమలు చేస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా పాత రిజర్వేషన్లే అమలులో ఉండటంతో మళ్లీ వారినే పోటీకి దింపుతామని, వారిని గెలిపించుకునే బాధ్యత తనదేనని, ఇప్పుడు మండలి ఎన్నికల్లో మాత్రం తాను చెప్పినట్లు ఓట్లేయించాలంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కుటుంబాలకు హామీలిస్తున్నారు. ఓటర్లను వదిలేసి ఫ్యామిలీ ప్లాన్ అమలు చేస్తున్నారు.

ఈటలకు టచ్‌లో..!

మొన్నటి హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత చాలా మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు మళ్లీ ఈటలకు టచ్‌లోకి వెళ్లారు. తాము అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడ్డామని, కానీ లోపాయికారికంగా మీకు సపోర్ట్ చేశామంటూ స్థానిక ప్రజాప్రతినిధులు ఈటల రాజేందర్‌కు మధ్యవర్తుల ద్వారా సమాచారం పంపించారు. కొంతమంది నేరుగా ఫోన్ చేసి కూడా వివరణ ఇచ్చుకున్నారు. అయితే, గత స్థానిక ఎన్నికల్లోనూ వారికి వెన్నంటి ఉన్న ఈటల రాజేందర్​.. ఇటీవల హుజురాబాద్​ బై ఎలక్షన్స్‌లో తనకు వ్యతిరేకంగా పని చేసినా.. మళ్లీ వారందరినీ చేరదీస్తున్నారనేది ఆ సెగ్మెంట్‌లో జరుగుతున్న ప్రచారం.

ఈ నేపథ్యంలోనే వారందరినీ మరోసారి తనపై ఉన్న అభిమానం, ఉప ఎన్నిక తర్వాత తనతో చెప్పిన వాగ్ధానాలను నిరూపించుకునే సమయం మండలి ఎన్నికలేనని వారికి సంకేతాలిస్తున్నారు. కేవలం హుజురాబాద్ సెగ్మెంట్‌లోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈటల రాజేందర్ నుంచి రాయబారం వెళ్తోంది. టీఆర్‌ఎస్‌కు సరైన సమయంలో బుద్ది చెప్పే సమయం ఇదేనని, ఇప్పుడు ఇక్కడ దెబ్బ కొడితే తనపై బాంబులు పేల్చిన మంత్రులకు కూడా దిమ్మదిరుగుతుందనే కోణంలో మండలి ప్లాన్​వేస్తున్నారు.

మళ్లీ మీకే.. మీ ఖర్చంతా నాదే..

ప్రధానంగా హుజురాబాద్​సెగ్మెంట్‌తో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు వారి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరుల నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమాచారం పంపిస్తున్నారు. ఓటర్లంతా క్యాంపుల్లో.. అధికార పార్టీ నేతల గుప్పిట్లో ఉండగా.. లోకల్‌గా మాత్రం వారి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులతో రాయబారం చేస్తున్నారు. అయితే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ వారికే అవకాశం ఇస్తామని, దానికి సంబంధించిన ఖర్చును కూడా తానే భరిస్తానని, వారిని ఎలాగైనా గెలిపించుకుంటానని హామీ ఇస్తున్నారు.

క్రాస్ ఓటింగ్ తప్పదా..?

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. కొన్నిచోట్ల ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా తమ క్యాంపుల్లో భాగస్వామ్యం చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్రులను కూడా తమ ఓటర్లుగానే లెక్కేస్తున్నారు. కానీ, వారంతా ఇప్పుడు కారు గుర్తుకు ఓటేస్తారా.. లేకుంటే క్రాస్​ ఓటింగ్​కు పాల్పడుతారా అనేది మంత్రులను సైతం వణికిస్తోంది. ఇప్పటికే కరీంనగర్​ జిల్లా అంటే సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. హుజురాబాద్​ఉప ఎన్నికల్లో ఓటమి ఓవైపు ఉంటే.. చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈటలకు టచ్‌లో ఉంటుందని గులాబీ బాస్‌కు సంకేతాలందుతున్నాయి.

ఈ నేపథ్యంలో మండలి ఎన్నికల్లో 90 శాతం బలం ఉండి కూడా అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోతే ప్రజా వ్యతిరేకత కిందే పరిగణించాల్సి వస్తుందంటున్నారు. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ప్రభావం చూపించనుంది. దీంతో అధికార పార్టీ ఈ ఎన్నికలకు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ, అంతే ధీటుగా అటు ఈటల, ప్రాధాన్యత దొరకని తెలంగాణ ఉద్యమకారులు మాత్రం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక నేతలు తమవైపే ఉన్నారనే సంకేతాలిచ్చేందుకు ఇటీవల రవీందర్​సింగ్..​ స్నేహితులు, కార్పొరేటర్లతో ఓ వీడియోను కూడా బయటకు లీక్ చేశారు. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయనేది కొంత ఆందోళనకరంగానే మారింది.

ఉద్యమ వీరుడు కేసీఆర్ ప్రస్థానానికి నేటితో పన్నెండేళ్లు

Advertisement

Next Story