పర్యావరణ పరిరక్షణకు ‘ఎర్త్ షాట్’ ప్రైజ్

by Shyam |
పర్యావరణ పరిరక్షణకు ‘ఎర్త్ షాట్’ ప్రైజ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
సమస్త మానవాళికి, జీవజాతులకు ఆధారం పర్యావరణం. కానీ ఈ భూమండలాన్ని మనకు మనమే నాశనం చేసుకుంటూ, ముప్పును కొనితెచ్చుకుంటున్నాం. జీవజాతుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాం. ఓ వైపు లెక్కకు మించిన ప్లాస్టిక్‌ను వాడేస్తూ, కాలుష్యాన్ని పెంచేస్తూ.. భూతాపం పెరిగిపోతుందని, హిమానీ నదాలు కరిగిపోతున్నాయని, సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడతాం. కానీ వాటికి పరిష్కార దిశగా మనవంతు ప్రయత్నానికి మాత్రం పూనుకోం. అందుకే భూమి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వారికి బిగ్గెస్ట్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రిన్స్ విలియం, ప్రక‌ృతి ప్రేమికుడు సర్ డేవిడ్ అటెన్‌బరో ప్రకటించారు. ‘ఎర్త్ షాట్’గా పిలిచే ఈ ప్రైజ్‌‌ను పర్యావరణ పరిరక్షణకు పాటుపడే వారికిచ్చే.. నోబెల్ ప్రైజ్‌గా అభివర్ణించారు విలియం.

మన శరీరంలో చిన్న మార్పు వచ్చినా.. వెంటనే అనారోగ్యానికి గురవుతాం. అలాంటిది జీవకోటికి ఆధారభూతమైన ప్రకృతికి మనందరం ఎంత విఘాతం కలిగిస్తున్నామో ఒకరు చెప్పాల్సిన పనిలేదు. అవన్నీ నిత్యం మన కళ్లెదురుగా కనబడుతున్న దృశ్యాలే. నీరు, భూమి, గాలి.. అన్నీ కూడా కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దశాబ్దాలుగా మానవులు చేస్తున్న తప్పిదాలు.. భూమాతకే కాదు, జీవకోటికి ప్రమాదంగా మారాయి. పెరుగుతున్న భూతాపమే అందుకు నిదర్శనం. అయితే కొద్ది మంది పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు చేయి కలిపినంత మాత్రాన ఈ విపత్తు నుంచి బయట పడలేం. అందుకే ఇందులో ప్రతీ ఒక్కరు భాగస్వాములవ్వాలి. ఈ దిశగా అందరినీ ఆలోచింపజేసేందుకే ప్రిన్స్ విలియం ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

ఐదు విభాగాలు :

1. ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్ (ప్రకృతిని కాపాడటం, పునరిద్ధరించడం)
2. క్లీన్ అవర్ ఎయిర్ (గాలి కాలుష్యాన్ని తగ్గించడం)
3. రివైవ్ అవర్ ఓసియన్స్ (సముద్రాలను పునరుద్ధరించడం)
4. బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ వరల్డ్ (వ్యర్థరహిత ప్రపంచాన్ని నిర్మించడం )
5. ఫిక్స్ అవర్ క్లైమేట్ (వాతావరణాన్ని సమతుల్యపర్చడం)

ఈ ఐదు విభాగాల్లో విశేష కృషి చేసి, ఆయా వాతావరణ సమస్యలకు పరిష్కారం కనుగొన్న వారికి ప్రైజ్ మనీ అందించడంతో పాటు ‘ఎర్త్ షాట్’ ప్రైజ్ అందిస్తారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో విజేతకు 1 మిలియన్ పౌండ్స్ (రూ. 9.5కోట్లు). 2021 నుంచి 2030 వరకు లండన్‌లో ప్రతి ఏటా ఈ ప్రైజ్ ఈవెంట్ ఉంటుంది. 2030 వరకు కనీసం 50 సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ఇది సాగాలని విలియం అన్నారు.

‘నేను, సర్ అటెన్‌బరో ఆలోచనతో ఇది రూపొందింది. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలన్నదే దీని ఉద్దేశం. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ ప్రైజ్ మనీ అందుకునేందుకు కృషి చేయాలి. కమ్యూనిటీలు, స్కూల్స్, బ్యాంక్స్, గవర్నమెంట్స్, కార్పొరేషన్స్, సైంటిస్టులు, యాక్టివిస్టులు, ఎకనామిస్టులు, లీడర్లు, సంస్థలు, వ్యక్తులు అందరూ పర్యావరణ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు పాటుపడాలి. ఇప్పటికే భూమి ప్రమాదకర స్థితిలో ఉంది. పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే పదేళ్లలో వీలైనంతగా పర్యావరణ సమస్యలను పరిష్కరించాలి’ అని విలియం పేర్కొన్నారు. ‘కోరల్ రీఫ్స్ చనిపోతున్నాయి. అడవులు కనుమరుగై పోతున్నాయి. నార్త్ పోల్ కరిగిపోవడం మొదలు పెట్టింది. ఇది మనకు ఆపత్కాలం. అందుకే పర్యావరణాన్ని కాపాడాలి’ అని అటెన్‌బరో అన్నారు.

ఈ నవంబర్‌ 1 నుంచి నామినేషన్స్ స్వీకరిస్తున్నారు. వచ్చే ఏడాది లండన్‌లో తొలి సెర్మనీ ఉండగా.. ప్రతి ఏడాది ఒక్కో సిటీలో ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌టైన్మెంట్, స్పోర్ట్స్, బిజినెస్, చారిటీ, ఎన్విరాన్‌మెంట్ విభాగాలకు చెందిన వ్యక్తుల్ని ఎర్త్ ప్రైజ్ కౌన్సిల్‌ సభ్యులుగా నియమించారు. జోర్డాన్ రాణి రానియా అల్ అబ్దుల్లా, పర్యావరణవేత్తలు అటెన్‌బరో, యా మింగ్, హిందొవో ఒమరోవు ఇబ్రహీం, పుట్‌బాల్ క్రీడాకారుడు డానీ అల్వెస్, నటి కేట్ బ్లెంచెట్, వ్యాపారవేత్త జాక్ మా, పాప్ సింగర్ షకీరా, వ్యోమగామి నవకో యమజకి, ఆర్థికవేత్త ఒకంజో ఇవెల ఉండగా, ఇండియా నుంచి పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయి ఉన్నారు. ప్రస్తుతం ఎర్త్ షాట్ బాధ్యతలను ‘ది రాయల్ ఫౌండేషన్’ తీసుకుంది.

ప్రిన్స్ విలియం ఎర్త్ షాట్ కోసం ‘ది రాయల్ ఫౌండేషన్’‌తో కలిసి 50 మిలియన్ పౌండ్ల ఫండ్ ఏర్పాటు చేశాడు. చైనా వ్యాపారవేత్త జాక్ మా కూడా ఇందుకోసం 3 మిలియన్ పౌండ్స్ అందించాడు. మూన్ షాట్ స్ఫూర్తిగా ‘ఎర్త్ షాట్’ పేరును ఖరారు చేశారు.

Advertisement

Next Story