గులాబీ గూటికి శ్రీధర్ బాబు.. నిజమా..?

by Shyam |   ( Updated:2020-02-28 07:47:57.0  )
గులాబీ గూటికి శ్రీధర్ బాబు.. నిజమా..?
X

దిశ, కరీంనగర్:
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేసులో ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధానికి ఇక పుల్‌స్టాప్ పెట్టబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే శ్రీధర్‌బాబు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైందని, సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జిల్లా టీఆర్ఎస్ నేతలు ఒకింత గర్వంగానే చెప్పుకుంటున్నారు. రెండు రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా శ్రీధర్ బాబు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్త పోస్టింగ్‌ల రూపంలో చక్కర్లు కొడుతోంది. గులాబీ కండువా కప్పేందుకు మార్చి 7న ముహూర్తం కూడా ఖరారైందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న శ్రీధర్ బాబు ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను టీఆర్ ఎస్ లో చేరబోవడంలేదని స్పష్టం చేసారు. మరి ఏది నిజం..? ఏది అబద్ధం..? పూర్వాపరాలను పరిశీలిద్దాం.

కేటీఆర్‌తో శ్రీధర్‌బాబు దోస్తానా

వరుస దెబ్బలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుదైలైపోయిందన్న భావనకు శ్రీధర్ బాబు వచ్చినందువల్లనే టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయనతో సన్నిహితంగా ఉన్న నాయకులు చెప్తున్న మాట. టీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ పార్టీ మరింతగా చతికిలపడుతోందే తప్ప బలోపేతం అయ్యే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదని వారు వ్యాఖ్యానించారు. అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతనే శ్రీధర్ బాబు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు వారి ద్వారా తెలిసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కుటుంబానికి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ నూతన పరిణామానికి బీజం వేసింది. చాలా కాలంగా శ్రీధర్ బాబు పార్టీ ఫిరాయిస్తారని, ఇప్పటికే కేటీఆర్‌తో చర్చలు కూడా జరిగాయని చాలా సందర్భాల్లో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ శ్రీధర్‌బాబు ఈ వ్యాఖ్యలపై ఏ రకంగానూ స్పందించలేదు. దీంతో అవన్నీ పుకార్లేనని అభిప్రాయం ఏర్పడింది.

దీనికి తోడు, శ్రీధర్ బాబు చేరికకు కేసీఆర్ కుమార్తె కవిత అడ్డుపడ్డ కారణంగానే ఇంతకాలం గులాబీ పంచన చేరలేకపోయారన్న వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కవిత మహాముత్తారం మండలం యామన్‌పల్లిలో కుమ్రం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్ళగా ఆ సమయంలో మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు ఉద్దేశపూర్వకంగానే పోలీసులకు చెప్పి ఆమెను నిలబెట్టించారన్న సంఘటనను ఇందుకు ముక్తాయింపుగా జోడించారు. ఆ కారణంగానే టీఆర్ఎస్‌లో ఆయన చేరికకు ఆమె అడ్డుకట్ట వేశారని సమాచారం.

కొత్త పరిణామానికి శ్రీకారం

కానీ ఉత్తర తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కొత్త పరిణామానికి శ్రీకారం చుట్టినట్లు టీఆర్ఎస్ స్థానిక నాయకులు చెప్పుకుంటున్నారు. పార్టీలో నిర్ణయాత్మకమైన శక్తిగా కేటీఆర్ ఎదిగిన తరువాతనే హితులు, సన్నిహితులను పార్టీలో చేర్చుకునే ప్రక్రియ ఊపందుకుంది. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ టీఆర్ఎస్‌లో చేరడం, మంత్రి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. అజయ్, కేటీఆర్‌ల మధ్య ఉన్న స్నేహబంధం వల్లనే గులాబీ తీర్థం సాధ్యమైందని బహిరంగంగానే టీఆర్ఎస్‌ నేతలు వ్యాఖ్యలు చేశారు.

శ్రీధర్ బాబు కుటుంబం మొదటి నుండీ కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంది. ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న సమయంలో కూడా శ్రీధర్ బాబు ఇంట జరిగిన వేడుకలకు కేటీఆర్ హాజరయ్యేవారు. ఇప్పటికీ కేటీఆర్, శ్రీధర్ బాబులు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారనేది బహిరంగ రహస్యం. శ్రీధర్ బాబు కుటుంబానికి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉండడంతో ఈ బంధం మరింత బలపడిందని చెప్తున్నవారు లేకపోలేదు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యమే ఇప్పుడు శ్రీధర్ బాబు జాయినింగ్‌కు లైన్ క్లియర్ అయ్యేలా చేసిందంటున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ పార్టీలో చేర్పించుకుంటే భవిష్యత్తులో తన లక్ష్యాలకు కూడా ఇబ్బంది ఉండదనేది కూడా ఇందుకు ఒక కారణంగా చెప్తున్నారు. కేటీఆర్ తన కోటరీని బలోపేతం చేసుకోవడంలో భాగమే ఇతర పార్టీల నుంచి చేరికలు అనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపున శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ అధికారిణి శైలజ రామయ్యర్ ద్వారా కూడా రాయబారం నడిపించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే మొదటి నుండి పార్టీలు వేరైనా కేటీఆర్, శ్రీధర్ బాబుల మధ్య ఉన్న బలమైన స్నేహమే టీఆర్ఎస్‌లో చేరేందుకు కారణమని స్పష్టం అవుతోంది.

టికెట్ ఖాయం?

మంథని నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న పుట్ట మధుకు కూడా పార్టీ నాయకత్వం ప్రాధాన్యం కల్పించనుందని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబుకు వచ్చే ఎన్నికల్లో మంథని నుంచి టికెట్ ఇవ్వడం ఖాయం అనే ఒప్పందం కూడా కుదిరినట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికి చెందిన పుట్ట మధుకు మాత్రం పెద్దపల్లి లేదా మరో నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో నాయకత్వం ఉన్నట్టు తెలిసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటానని తనకు తానుగా సంకేతాలు ఇవ్వడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

శ్రీధర్ బాబు గులాబీ గూటికి చేరుతాడా లేక కాంగ్రెస్ లోనే ఉండి అధికారపక్షానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాడా.. అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

Advertisement

Next Story