- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిత్యావసరాలుగా ఔషధాలు.. వ్యాపారం డబుల్
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా దెబ్బకు ఔషధాలు నిత్యావసరాలుగా మారాయి. ఇంటింటా… ప్రతి ఒక్కరూ విరివిగా మందులు వాడారు. అటు మళ్లీ లాక్డౌన్ ప్రచారంతో మందుల కొనుగోళ్లు మరింత పెరిగాయి. కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు స్తోమతకు మించి ఖర్చు చేశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ కేవలం 5 నెలల్లో కొవిడ్ సంబంధిత ఔషధాలు, రెగ్యులర్ మందులు, కొన్ని వైద్య పరికరాల కోసం దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా వ్యయం చేసినట్లు ఔషధ నియంత్రణ విభాగం అంచనా వేసింది.
కరోనా వస్తే అంతే..
ఒక కుటుంబంలో ఒక్కరికి పాజిటివ్ వచ్చినా ఇంటిల్లిపాది మందులను వాడుతున్నారు. వైద్యుల సూచనలో, సోషల్ మీడియా ప్రభావమో కానీ… ఔషధాల వినియోగం రెట్టింపుగా మారింది. హోం ఐసోలేషన్‌లో ఒక్కరు ఉన్నా… 4 వారాల పాటు కుటుంబమంతా ఔషధాలు వాడుతున్నారు. కేవలం ఒక్క కుటుంబం మందుల కోసం ఈ సమయంలో రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకు వెచ్చిస్తోంది.
ఇక ఎలాగు తప్పనిసరి అంటూ ఒకటీ, రెండు పల్స్ ఆక్సిమీటర్లను రూ.6 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కరోనా భయంతో ప్రతి ఇంటిలో విటమిన్ మాత్రలు వాడుతూనే ఉన్నారు. ఇలా కొంతమంది ఈ 5 నెలలుగా విటమిన్ సి, మల్టీవిటమిన్, జింకు, విటమిన్ డి మాత్రలు వాడుతున్నారు. ఎవరూ కొవిడ్ బారినపడకున్నా… కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యుల సూచనల మేరకు విటమిన్ మాత్రలను వాడుతున్నారు. కేవలం వీటికోసం నెలకు రూ.5వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంకా ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్, వేపరైజర్ పరికరాలు కొని పెట్టుకుంటున్నారు. వీటితో పాటుగా మాస్కులు, శానిటైజర్లకు ఎంత ఖర్చు చేశారో లెక్కేలేదు.
భారీగా పెరిగిన వ్యాపారం
రాష్ట్రంలో కరోనా పుణ్యామని ఏడాది వ్యాపారం నాలుగైదు నెలల్లోనే సాగుతోంది. నిత్యవసరాలుగా మారిన ఔషధాల ఖర్చు అదనమవుతోంది. విరివిగా వినియోగిస్తున్న మందుల్లో విటమిన్ మాత్రలు, యాంటీ బయాటిక్స్ తదితరాల కోసమే సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చించగా.. పల్స్ ఆక్సిమీటర్ల కోసం రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సహా జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి నుంచి ఉన్నతవర్గాల వరకూ ఒక్కో కుటుంబం 5 నెలల్లో దాదాపు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకూ ఆర్థిక భారాన్ని మోసినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఖర్చు సరాసరి రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఉంటుందని అంచనా.
విటమిన్ గోలీల వినియోగం అదుర్స్..
ఒక సాధారణ ఒక ఏరియాలో విటమిన్ సి, డి 3, జింక్, బీ కాంప్లెక్స్ మాత్రలు నెల మొత్తంలో సుమారు రూ. 30 నుంచి రూ. 40 వేలు అమ్ముడయ్యేవి. కానీ ఈ జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఏకంగా నెలకు రూ. 3 లక్షలకు పైగా వీటి వ్యాపారం పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా విటమిన్ సి, డి మాత్రల అమ్మకాలు నెలకు రూ. 20 నుంచి రూ. 30 కోట్లు ఉండగా.. కొవిడ్ కాలంలో రూ.70 నుంచి 80 కోట్ల రూపాయలకు పెరిగాయి. జింక్ మాత్రలు కరోనాకు ముందు నెలకు రూ. 50 నుంచి రూ. 60 కోట్ల మేరకు అమ్మకాలు ఉండగా… ఇప్పుడు వాటి విక్రయం రూ.180 కోట్ల వరకూ వెళ్లిందని ఔషధ వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
పారాసిటమాల్ మాత్రలు కరోనాకు ముందు నెలకు సుమారు రూ. 70 కోట్ల వరకు విక్రయిస్తుండగా ఇటీవలీ కాలంలో వీటి అమ్మకాలు రూ. 120 నుంచి రూ. 150 కోట్లకు పెరిగాయి. ఇంకా అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ అమ్మకాలు కూడా సాధారణంగా నెలకు రూ.150 నుంచి రూ. 160 కోట్లు ఉండగా… ఈ సమయంలో ఏకంగా రూ. 500 నుంచి రూ. 600 కోట్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు కొవిడ్ సంబంధ ఔషధాలు, వస్తువుల విక్రయాలు 15 నుంచి 25 శాతం వరకు రేట్లు పెరిగాయి.
30 లక్షల పల్స్ ఆక్సిమీటర్ల విక్రయం
సాధారణంగా పల్స్ ఆక్సిమీటర్లు ఒక చిన్న ఔషధ దుకాణంలో నెలకు ఒకటో రెండో అమ్ముడవుతాయి. అదే హైదరాబాద్‌లోని ఓ పెద్ద ఫార్మసీలో నెలకు 30 నుంచి 50 వరకు విక్రయిస్తే ఎక్కువ. కొవిడ్ సమయంలో ప్రతినెలా 20 వేలకు పైగా పల్స్ ఆక్సిమీటర్లను ఒకే దుకాణంలో అమ్మారంటే ఎంతలా కొనుగోలు చేశారో అర్థమవుతోంది. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 30 లక్షల పల్స్ ఆక్సిమీటర్లు ప్రజలు కొన్నట్లు మెడికల్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. సాధారణ రోజుల్లో వీటి ధర రూ. 500 వరకూ ఉండగా కరోనా సమయంలో రూ.3 వేల వరకూ పెరిగింది. ఇక శ్వాస తేలిగ్గా ఆడడం కోసం ఆవిరి పట్టడానికి ఉపయోగించే వేపరైజర్ల వ్యాపారం రూ.500 కోట్ల మేర జరిగినట్లు అంచనా. ఒక మెడికల్ షాపులో థర్మామీటర్లు నెలకు 3-4 కూడా అమ్మని పరిస్థితి గతంలో ఉండగా… ఇప్పుడు నెలకు 30 నుంచి 40 వేల వరకు విక్రయించారు. వీటితో పాటుగా ఫావిపిరవిర్ మాత్రలు లక్షల్లో అమ్ముడుపోయాయి. ఒక్కో రోగి 100 మాత్రలు వాడాల్సి వచ్చేది. వీటికోసం రూ. 10 వేల వరకు కూడా వెచ్చించి కొనుగోలు చేశారు.
ప్రభుత్వాస్పత్రుల్లోనూ పెరిగాయి
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్ చికిత్సల కోసం వినియోగించిన ఔషధాలు గత ఏడాదితో పోల్చితే ఈ నాలుగు నెలల వ్యవధిలో రెట్టింపు కంటే అధికంగా వినియోగించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఉదాహరణకు విటమిన్ సి మాత్రలు గతేడాది మొత్తమ్మీద 4.10 కోట్లు వినియోగించగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకే 6.9 కోట్లు వాడారు. డాక్సిసైక్లిన్ మాత్రలు గతేడాది 1.27 కోట్లు వాడగా… ఈసారి 5.30 కోట్లు చికిత్సకు ఉపయోగించారు. అజిత్రోమైసిన్ గోలీలు గత ఏడాది 2.5 కోట్లకు పైగా రోగులకు అందించగా… ఈసారి ఈ సంఖ్య రూ. 4 కోట్లకుపైగా చేరింది.