అంబులెన్స్ డ్రైవర్లకు కష్టమొచ్చింది..

by Shyam |
అంబులెన్స్ డ్రైవర్లకు కష్టమొచ్చింది..
X

దిశ, ‌న్యూస్‌బ్యూరో: ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ అనారోగ్య పరిస్థితిలో గమ్యస్థలానికి చేర్చే అంబులెన్స్ డ్రైవర్ల జీవనం దుర్భరమైన స్థితికి చేరింది. పేషెంట్‌కు వచ్చిన రోగమేమైనా సరే తన ప్రాణాలను లెక్కచేయకుండా వైద్యం చేయించి మానవత్వాన్ని చాటుకునేవారు ఆపదలో చిక్కుకున్నారు. లాక్‌డౌన్‌తో జనరల్ వైద్యం చేయడానకి వీలులేదని ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు తప్ప ఓపీకి అనుమతి లేదని ఆంక్షలు విధించింది. దీంతో వైద్యం కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోయింది. దీని ఎఫెక్ట్ బతుకు జీవుడా అంటూ బతుకు దెరువు కోసం ప్రైవేటు అంబులెన్స్‌లు నడుపుతూ జీవనం సాగించే డ్రైవర్లపై పడింది. సాధారణంగా అంబులెన్స్ డ్రైవర్ల కుటుంబం గడువడం కత్తిమీది సాములాంటింది. ఇక లాక్‌డౌన్ సందర్భంగా వీరి జీవనం వర్ణనాతీతంగా మారింది.

‘ఎలాంటి కల్మషం లేకుండా కులం, మతమన్న తారతమ్యం చూపక ఎవరికి ఆపద వచ్చినా.. ఆ ఆపద తమ కుటుంబానికే వచ్చిందని ఆదుకునే మాకు కష్టం వచ్చింది. మమ్మల్ని ఈ కష్టకాలం నుంచి గట్టేక్కించాలి’’ అని అంబులెన్స్ డ్రైవర్ల యునియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి పేద బడుగు, బలహీన వర్గాల బతుకులను ఛిద్రం చేస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి బతుకుదెరువు కోసం వచ్చి వివిధ పనులు చేసుకుంటూ బతుకు బండిని నెట్టుకొస్తున్నవారి బతుకులు రోజు రోజుకూ దిగజారుతున్నాయి.

ఇదే కోవకు చెందిన ప్రైవేటు అంబులెన్స్‌లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్ల బతుకులు కూడా రోడ్డున పడ్డాయి. లాక్‌డౌన్‌తో వీరికి పైస పనిచెప్పేవారు లేక, పూటగడువక నానా అవస్థలు పడుతున్నారు. వీరి బతుకులు వలస కూలీల కంటే దీన స్థితికి చేరింది. వలస కూలీలకు రోడ్ల మీద అక్కడో ఇక్కడో ఎవరైన అన్నదానం చేస్తే పూటగడుపు కుంటున్నారు. కానీ, వీరు బయటికి వెల్లి చేయి చాచలేక.. కడుపు మాడ్చుకోలేక లోలోపల మథనపడుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో అంబులెన్స్ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు సుమారు 2000లకే పైమాటే. వీరి జీవనం దినదిన గండం అన్నట్లు ఉంటుంది. గిరాకీ ఉన్నరోజే పండుగా. లేని రోజులు అంతే సంగతులు నెలాంతా కష్టపడ్డ వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. రూ.10 నుంచి 15 వేలు గిట్టుబాటు అయితే ఆ నెల మంచిగా గిరాకీ ఉన్నట్లు. దీనిని బట్టిచూస్తే ఉన్నపరిస్థితిలో వారి జీవన విధనం ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. ఇకా ఇందులో అద్దె బండ్లు నడుపు కుంటూ జీవనం సాగించే వారు ఉంటారు. సొంత బండ్లు నడుపుకునే వారికే రూ.10 నుంచి 15 వేలు గిట్టుబాటు అవుతున్నయంటే. వీరి అద్దెపోను నెలకు రూ.10వేలు మిగులే అంతేచాలు అన్నట్లు జీవనం సాగిస్తుంటారు.

అయితే కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలో భాగంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అమలులో ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయడం. జనరల్ సర్జరీలు నిల్పివేయడంతో ప్రైవేటు అంబులెన్స్‌లకు పనిలేకుండా పోయింది. ఇక అత్యవసర సేవలకు ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ప్రైవేటు అంబులెన్స్‌లకు వారంలో రెండు, మూడు గిరాకీలు తగలడం గగనం. పెద్ద పెద్ద ఆస్పత్రులు గాంధీ, ఉస్మానియ, నిమ్స్, యశోద లాంటి ఆస్పత్రుల వద్ద సీరియల్ లెక్కనా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పడు అది కూడా లేకుండా పోయిందని డ్రైవర్లు వాపోతున్నారు. రెండు వారాల నుంచి ఒక్కటంటే ఒక్క గిరాకీ కూడా రాకపోవడంతో పూట గడువడం కష్టంగా మారిందంటున్నారు. దీంతో అద్దె డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా మారింది. యజమానికి అద్దె చెల్లించలేక, ఇటు ఇంటి అద్దెలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఈ కష్టకాలం నుంచి గట్టేక్కించే మార్గం చూపాలని వాపోతున్నారు.

రెండు వారాల నుంచి గిరాకీ లేదు: అంజయ్య

‘లాక్‌డౌన్ నుంచి గిరాకీ చెప్పిన వారే లేరు. పొద్దున సద్ధిపెట్టుకొని వస్తున్నం ఆస్పత్రుల ఎదుట సాయంత్రం దాక చూసి చూసి తెచ్చుకున్న సద్ధి తిని పోతున్నాం తప్ప ఇంటికి రూపాయి తీసుకుపోవుడు లేదు. ఇంట్లో తినడానికి తిండి లేక పిల్లలు అల్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో అప్పు ఇచ్చేవారు కూడా లేరు. ఎట్లా చేయలో ఏమీ ఆర్థం కావడం లేదు. ప్రభుత్వం బండి కిస్తీ కట్టనవసరం లేదంటుంది. నేను తీసుకున్నది ప్రైవేటు ఫైనాన్స్ వారు రోజు ఫోన్ చేస్తున్నారు. బండి కిస్తీ ఎట్లాకట్టాలో.. కుటుంబం ఎట్లాసాకలో దిక్కుతోచడం లేదు’ అని బోరబండాకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ అంటున్నాడు.

ప్రభుత్వం మాకు దారి చూపాలి: నీలకంఠం, డ్రైవర్

‘మాములు రోజుల్లోనే మా బతుకు బండి నడవడం కష్టమైన పని. ఒక పూటతింటే మారో పూటకు ఉండదు. ఇలాంటి పరిస్థితిలో కరోనా రోగం వచ్చి మరింత మమ్మల్ని ఆగం చేసింది. ఆస్పత్రులకు ఎవరూ రావాడం లేరు. మాకు పనిచేప్పేవారు లేరు. చేతిల రూపాయి లేక పూట గడవని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం మా వైపు కండ్లు తెరిచి మమ్మల్ని ఈ గడ్డుకాలం నుంచి గట్టెక్కించి ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించాలని కోరుతున్నాము’ అని నీలకంఠం అనే ఓ డ్రైవర్ అని తెలిపాడు.

Tags: Ambulance, hyderabad, drivers, corona effect

Advertisement

Next Story

Most Viewed