- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగరంగా వైభవంగా.. ‘డ్రైవ్ ఇన్’ పెళ్లి
దిశ, వెబ్‌డెస్క్ : ఓపెన్ థియేటర్లు, డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ల గురించి అందరికీ తెలిసిందే. ఓపెన్ థియేటర్ల విషయానికొస్తే.. గ్రౌండ్ లాంటి ఓపెన్ ప్లేసులో ఓ తెర ఉంటుంది. కారులో సినిమాకు వచ్చిన ప్రేక్షకులు.. అందుంలోంచే సినిమా చూస్తుంటారు. డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లు కూడా అంతే. అక్కడికి వెళ్లి కారులోనే కూర్చుంటే.. వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుని ఫుడ్ తీసుకొస్తాడు. మరి ‘డ్రైవ్ ఇన్’ పెళ్లి గురించి తెలుసా?
కరోనా కారణంగా పెళ్లిళ్లన్నీ ఏదో తూతూ మంత్రంగా, పది మంది బంధువుల నడుమ ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే లండన్‌కు చెందిన ప్రేమ జంట రోమా పోపట్, వినాల్ పటేల్‌లు అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టాకే పెళ్లి చేసుకుందామని అనుకున్నా.. కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదు. దీంతో ఆ జంటకు ‘డ్రైవ్ ఇన్’ పెళ్లి ఆలోచన తట్టింది. కరోనా నిబంధనలను పాటిస్తూనే.. 250 మంది అతిథుల ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ డ్రైవ్ ఇన్ పెళ్లి ఎలా చేసుకున్నారనే కదా అనుమానం. డ్రైవ్ ఇన్ కారు, ఓపెన్ థియేటర్ వంటి కాన్సెప్టులను పెళ్లికి అన్వయించి.. అందరి సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు అంతే.
పెళ్లి వేడుకలకు 250 మందిని ఆహ్వానించి.. అందరికీ నాప్‌కిన్లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. పెళ్లి వేదికపై కుటుంబ సభ్యులు, స్నేహితులు 30 మందికి మించకుండా చూసుకున్నారు. ఇక పార్క్ గ్రౌండ్‌లో వివాహం కనిపించేలా.. పెద్ద పెద్ద స్క్రీన్లను అక్కడక్కడా ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్లను పార్కు చేశారు. ఆ కార్లలోనే ఉండి వివాహాన్ని తిలకించారు. ఆ తర్వాత పెళ్లి వారు సూచించిన ఫుడ్ వెబ్‌సైట్ నుంచి తమకు నచ్చిన ఫుడ్‌ను తమకు ఇష్టమైన హోటళ్ల నుంచి ఆర్డర్ చేశారు. హోటళ్ల నుంచి వచ్చిన ఫుడ్ పార్సిళ్లను వెయిటర్ల బృందం కార్లలో కూర్చున్న అతిథులకు అందించింది. పెళ్లి ముగిసిన తర్వాత కొత్త దంపతులు గోల్ఫ్ బగ్గీలో మైదానంలో తిరుగుతూ.. అతిథుల ఆశీర్వాదాలు, ఆశీస్సులు తీసుకున్నారు. వీళ్లే కాకుండా మరో 300 మంది వరకు ఆన్‌లైన్ ద్వారా తమ పెళ్లి వేడుకను వీక్షించారు. ఇలా డ్రైవ్ ఇన్ పెళ్లితో రోమా, వినాల్‌లు సరికొత్త ట్రెండ్‌కు తెర తీశారు. రాబోయే కాలంలో కచ్చితంగా వీరి బాటలో మరిన్ని పెళ్లిళ్లు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.