వేర్వేరు టీకాలు తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు : కేంద్రం

by vinod kumar |   ( Updated:2021-05-27 07:51:35.0  )
Dr. VK Paul, Chairman, National Expert Group
X

న్యూఢిల్లీ: రెండు వేర్వేరు టీకాల డోసులు తీసుకున్నా తీవ్ర దుష్ప్రభావాలు ఉండకపోవచ్చునని కేంద్రం గురువారం వెల్లడించింది. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని, శాస్త్రీయ అవగాహన రావలసి ఉన్నదని వ్యాక్సినేషన్‌పై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ చైర్ డాక్టర్ వీకే పాల్(VK Paul) వివరించారు. ఒకవేళ రెండు వేర్వేరు టీకాల డోసులను ఇచ్చినప్పటికీ ఖంగారు పడాల్సిన పనిలేదని తెలిపారు. సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చునని అన్నారు. కానీ, దీన్ని ఇంకా పరిశీలించాల్సి ఉన్నదని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో సిద్ధార్థనగర్ జిల్లాలో కనీసం 20 మందికి తొలిగా ఏప్రిల్‌లో కొవిషీల్డ్ డోసు ఇచ్చి, సెకండ్ డోసుగా కొవాగ్జిన్ ఇచ్చారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేయడం గమనార్హం. వేర్వేరు టీకా డోసుల సామర్థ్యం అంశం ఇంకా అంతర్జాతీయంగా పరిశోధనాస్థాయిలో ఉన్నది. తొలి డోసు ఆస్ట్రా జెనెకా, సెకండ్ డోసుగా ఫైజర్ వేసి చేస్తు్న్న ప్రయోగాల ప్రాథమిక ఫలితాలను ఇటీవలే లాన్సెట్ ప్రచురించింది. సదరు వలంటీర్లలో స్వల్పస్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, అవి కూడా తాత్కాలికంగానే ఉన్నాయని పరిశోధన పత్రిక తెలిపింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో ఈ మిశ్రమ డోసుల సామర్థ్యంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed