- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ ప్రత్యర్థికి కలిసొస్తుందా?
దిశ ప్రతినిధి, మెదక్ : ప్రస్తుతం దుబ్బాకలో జరుగుతున్నది కేవలం ఉప ఎన్నిక. అక్కడ గెలవడం వల్ల తక్షణం ఒనగూరే ప్రయోజనం ఏ పార్టీకి లేదు. కానీ ఆ ఒక్కచోట గెలుపు కోసం అన్ని పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అక్కడ గెలిస్తే చాలు అని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తుంటే, తమ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే కాకుండా లక్ష మెజార్టీ సాధిస్తామని అధికార పార్టీ మొదటి నుంచి గొప్పలకు పోతోంది. అయితే అవన్నీ ఉత్తి మాటలని, అది ఆ పార్టీకి కలగానే మిగలనుందని, ఉప పోరు గండం నుండి గట్టెక్కడమే మహా ఎక్కువని, టీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ ప్రత్యర్థికి పనికొచ్చే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా దుబ్బాకలో త్రిముఖ పోటీ తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.
దుబ్బాక ఉప పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. హైడ్రామాలు, ఉద్రిక్తతలు, అరెస్టులతో రణరంగాన్ని తలపిస్తోంది. ఎవరికి వారే గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకుని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గెలుపు తమదంటే తమదంటూ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ తమకు కేసీఆర్ పథకాలు, రామలింగారెడ్డి మరణంతో వచ్చిన సానుభూతి గెలిపిస్తుందని ఆశలు పెట్టుకుంటే, పాలకపక్షంపై వస్తున్న వ్యతిరేకత, దుబ్బాకలో కానరాని అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీకి కలిసి వస్తాయని ఆ పార్టీలు ఆశతో ఉన్నాయి.
అధికార పార్టీది అత్యుత్సాహమా?
అధికార పార్టీకి అన్నీతానై గెలుపు బాధ్యతలను భుజానెత్తుకొని మరీ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ట్రబుల్ షూటర్ హరీశ్ రావు. సుజాత రామలింగారెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తానని పలు సందర్భాల్లో బాహటంగానే ప్రకటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతలే హరీశ్ రావు ప్రచారం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల సంఖ్యనే లక్ష 90వేలు అయితే, అందులో పోల్ అయ్యే ఓట్లు ఎన్ని, చెల్లని ఓట్ల సంఖ్య ఎంత, ప్రతిపక్షాలు చీల్చే ఓట్లెన్ని ఇలా ప్రతీ అంశాన్ని లెక్క గడుతున్నారు. హరీశ్ రావు ప్రాస కోసం లక్ష ఓట్ల మెజార్టీ అన్నారా? లేక శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి అన్నారా? తెలియదు కానీ దుబ్బాకలో లక్ష ఓట్ల మెజార్టీ అసాధ్యమైన పని అని ఆపార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ అత్యుత్సాహం అధికార పార్టీకి మేలు చేయకపోగా ప్రత్యర్థికి ఉపయోగపడేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారంలోనూ అంతంత మాత్రమే స్పందన
దుబ్బాక ఉప పోరులో టీఆర్ఎస్ గెలుపు కోసం హరీశ్ రావుతోపాటు జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ గ్రామ, మండల స్థాయిలో ఇన్‌చార్జీలను నియమించి ఎప్పటికప్పుడు అనుకూలతలు, ప్రతికూలతలపై ఆరా తీస్తున్నారు. అయినా వారి ప్రచారానికి ప్రజల నుండి ఆశించిన స్పందన రావడంలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో లక్ష ఓట్ల మెజార్టీ కాదు కదా, ఈ ఉప పోరు గండం నుండి గట్టిక్కితే చాలు అని ఆ పార్టీ నేతలే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏదేైమైనా దుబ్బాకలో జయభేరి మోగించాలన్న పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తున్నాయి. బీజేపీ నుండి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ మహిళా అధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీలు, జితేందర్ రెడ్డి, వివేక్ ఇలా చాలామంది నేతలు దుబ్బాక ఎన్నికల్లో తమ అభ్యర్థి రఘునందన్ రావు తరుఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీతక్కతో పాటు ఇతర నాయకులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో పక్కాగా త్రిముఖ పోటీ ఉంటుందని పలువురు స్పష్టం చేస్తున్నారు.