అపోలో ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులపై కర్రలతో పేషెంట్ బంధువుల దాడి

by Anukaran |   ( Updated:2024-06-29 15:41:31.0  )
అపోలో ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులపై కర్రలతో పేషెంట్ బంధువుల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ఏర్పడుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, వెంటిలేటర్స్ లేకపోవడంతో రోగులు మృతి చెందుతున్నారు. అలాంటి ఘటనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అపోలో ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ లభించకపోవడంతో కరోనా సోకిన ఓ మహిళా రోగి మరణించింది.

దీంతో ఆగ్రహానికి లోనైన ఆ మహిళ బంధువులు మూకుమ్మడిగా వచ్చి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలోకి వెళ్లి డాక్టర్లు, నర్సులను కర్రలతో చితకబాదారు. రక్తం వచ్చేలా వైద్య సిబ్బందిని కొట్టారు. అంతటితో ఆగకుండా ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం చేసి, భవనం అద్దాలను పగులగొట్టారు.

ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యులు స్పందిస్తూ.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఈ రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే ఆమెకు చికిత్స అందిందని, కానీ బెడ్స్ కొరత వల్ల ఆమెను మరో ఫెసిలిటీకి మార్చాలని కోరామని వెల్లడించారు. ఇంతలోనే ఆమె మృతి చెందిందని అన్నారు. దీంతో ఆమె బంధువులు తమ వైద్య సిబ్బందిపై దాడికి దిగారని, హాస్పిటల్ ఆస్తులకు నష్టం కలిగించారని తెలిపారు. కరోనా కష్ట కాలంలో ఎంతో శ్రమిస్తూ వైద్య సేవలు అందిస్తున్న తమపై ఇలా దాడులు చేయడం దారుణమని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed