కొనసాగుతున్న సాంప్రదాయం.. ఆ ఇంటా అలా ఆనందాల దీపావళి

by Shyam |   ( Updated:2021-11-04 05:47:47.0  )
కొనసాగుతున్న సాంప్రదాయం.. ఆ ఇంటా అలా ఆనందాల దీపావళి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రెండు మూడు కుటుంబాలు కలిసి ఒకేచోట ఆనందంగా పండుగలు జరుపుకోవడం కష్టంగా ఉన్న నేటి రోజుల్లో ఏకంగా 185 మందికిపైగా ఒకే చోట ఉంటూ మూడు రోజులపాటు మురిపంగా.. దీపావళి పండుగ జరుపుకోవడం ఆ ఇంట ఆనవాయితీగా వస్తోంది. ఒక్క సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు. ఏకంగా వంద సంవత్సరాలుగా ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట పండగ జరుపుకోవాలని ఆశించిన ఆ ఇంటి పూర్వీకుల ఆశలను సజీవంగా ఉంచుతూ.. ఆనందాలను పంచుకుంటూ, ఆ కుటుంబం నిజమైన దీపావళి ఆనందాలను పొందుతోంది.

వివరాలలోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కమిటీ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త చంద్రమౌళి గుప్తా కుటుంబానిది స్వగ్రామం అడ్డాకుల మండలం నంది పేట గ్రామం. వెంకయ్య గుప్తా, బాలమ్మ దంపతులకు రాములు అనే కుమారుడు జన్మించాడు. ఆయనకు పదహారేళ్ళ వయసులోనే సత్యమ్మతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే వెంకయ్య ప్రతియేటా దీపావళి వేడుకలు కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా కుటుంబ సభ్యులు ఎక్కడున్నా వారందరినీ ఆహ్వానించి దీపావళి పండగ జరుపుకొనేవారు. ఈ క్రమంలో రాములు, సత్యమ్మ దంపతులకు కృష్ణయ్య, బాలస్వామి, శేకరయ్య, చంద్రమౌళి అనే ముగ్గురు కుమారులతో పాటు సుభద్రమ్మ, లక్ష్మీదేవమ్మ, సరోజమ్మ అనే కూతురు జన్మించారు. వీరందరికీ వివాహాలు జరిగాయి. వారి పిల్లలు, మనమలు, మనవరాళ్ళు వారి పిల్లలు కలిసి మొత్తం 175 మందికి పైగా ఉన్నారు. వీరిలో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా తదితర విదేశాలలోనూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. ఎవరు ఎక్కడ స్థిరపడిన అందరూ దీపావళిపండుగకి ఒకే చోట కలవాలి.. ఆనందాలను పంచుకోవాలి అన్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ సుభాష్ నగర్‌లో ఉన్న చంద్రమౌళి ఇంటికి వారి కుటుంబ సభ్యులు అందరూ రెండు రోజుల క్రితమే చేరుకున్నారు. అందరూ కలిసి మూడు రోజులపాటు దీపావళి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఆత్మీయ పలకరింపులు.. ఆట పాటలు, టపాసులు మోతలు, పిల్లల కేరింతలు ఆ ఇంట ఆనందాల వెలుగులు విరజిమ్ముతుంటాయి.

Advertisement

Next Story