సాగుబడికి మెతుకుసీమ సన్నద్ధం

by Shyam |
సాగుబడికి మెతుకుసీమ సన్నద్ధం
X

దిశ, మెదక్: వానాకాలం పంట సాగుబడికి జిల్లా రైతాంగం సమాయత్తమవుతోంది. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) ప్రభావం ఉన్నప్పటికీ జిల్లాలో అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సీజన్ ముగిడంతో వానాకాలం పంటలకు తయారవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేసి ప్రభుత్వానికి పంపించారు. పంట‌సాగు విస్తీర్ణానికి విత్తనాలు, ఎరువులు ఎంత కావాలో ఆ నివేదికలో పేర్కొన్నారు. గతేడాది వానాకాలం కంటే ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో పంట సాగవుతుందని అంచనా వేశారు. మెదక్ జిల్లాలో 2,34,800 ఎకరాలు సాగవుతుందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 26,368 ఎకరాలు ఎక్కువ. వరి, మొక్కజొన్న పంటల సాగు పెరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో గతేడాది వానాకాలంలో 2,08,432 ఎకరాల్లో పంటలు సాగు చేశారు.

సాగు పెరుగుతుందని అంచనా..

ఈసారి వానాకాలం వరి అత్యధికంగా సాగవుతుందని అధికారులు అంచనా కట్టారు. దాంతో వర్షాలు వచ్చే వరకు ఎరువులు, విత్తనాలు రైతులకు సరిపడా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. గతేడాది వానాకాలంలో 87,462.5 ఎకరాల్లో వరి సాగు కాగా, ఇప్పుడు 1.20 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశముంది. జిల్లాలో ఘణపురం ప్రాజెక్టు పరిధిలో మినహా చెరువులు, కుంటల్లో నీరుండటంతో సాగు పెరుగుతుందని అంచనా. ఈసారి మొక్కజొన్న 30 వేల ఎకరాలు, జొన్నలు 2,500 ఎకరాలు, పత్తి 64 వేల ఎకరాలు, సోయాబీన్ 1,000 ఎకరాల్లో సాగువుతుందని అంచనా. వానాకాలం సీజన్‌కు 38,887 క్వింటాళ్ల విత్తనాలు సబ్సిడీగా అందించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాల్లో వరిసాగు ఎక్కువగా ఉన్నందున సబ్సిడీ విత్తనాల్లో 25, 000 క్వింటాళ్ల వరి విత్తనాలు కావాలని కోరారు. ఎంటియు 1,010, కెఎస్ఎం, జెజెఎల్ రకం వరి విత్తనాలు సబ్సిడీపై అందించనున్నారు. సోయాబీన్ విత్తనాలు 1,150 క్వింటాళ్లు, మొక్కజొన్న 5,500 క్వింటాళ్లు, జొన్న 500 క్వింటాళ్లు కావాలని కోరారు. సోయాబీన్, దైంచా, సన్హిమ్, పిల్లి పెసర అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది.జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నందున 50,983.19 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. యూరియా 28,600 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,830.44 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1259.12 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 3703.63 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 12,590 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని ప్రణాళికలో పేర్కొన్నారు. ప్రభుత్వాల ఆదేశం ప్రకారమే జిల్లా రైతాంగినికి కావాల్సిన అంశాలపై ప్రణాళిక తయారు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం తెలిపారు.

Tags: farmers, farming, monsoon action plan, district agriculture officers, fertilisers, subsidy

Advertisement

Next Story