- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమాధానం లేని ప్రశ్నగా టీకాల పంపిణీ
దిశ, తెలంగాణ బ్యూరో : “వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ టీకాను ఉచితంగానే ఇస్తాం. ఇందుకు సుమారు రూ. 2,500 కోట్లు ఖర్చవుతుంది. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తాన’’
– ముఖ్యమంత్రి కేసీఆర్, ఏప్రిల్ 24న పత్రికా ప్రకటనలో.
“వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రానికి వచ్చే డోసులు తక్కువగా ఉంటున్నాయి. కోటా పెంచాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నాం. వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. జూలై చివరకులేదా ఆగస్టు ప్రారంభంలో డిమాండ్‌కు తగిన సప్లయ్ అందొచ్చు”
– మంత్రి కేటీఆర్, మే 13న ట్విట్టర్‌లో
”మనకు కేంద్రం వస్తున్న వ్యాక్సిన్లు అవసరాలకు తగినంతగా లేవు. ఇప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు కేవలం సెకండ్ డోస్ తీసుకోవాల్సినవారికి మాత్రమే వినియోగిస్తున్నాం. ఈ నెల 31 వరకూ కేవలం సెకండ్ డోస్ మాత్రమే. ఫస్ట్ డోస్‌లు ఉండవు”
– డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, మే 13న మీడియా సమావేశంలో.
రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీ గందరగోళంగా మారింది. ఎవరికి ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో, ఎక్కడ ఇస్తారో ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ప్రజలు టీకాల కోసం ప్రతీరోజు సెంటర్లకు రావడం, అక్కడ అందకపోవడంతో నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు. తొలినాళ్ళలో రోజుకు లక్షన్నర డోసులు ఇవ్వగా ఇప్పుడు అది వేలల్లోకి పడిపోయింది. ‘కొవిన్‘ పోర్టల్‌లో నమోదు చేసుకున్న స్లాట్ ప్రకారమే ఇస్తామని మొదట చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్‌తో కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అప్పటికే స్లాట్లలో బుక్ చేసుకున్నవారు తీరా సెంటర్‌కు వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సెంటర్లలో కాకుండా కొన్ని ఎంపిక చేసిన సెంటర్లలో మాత్రమే టీకాలు అందుతున్నాయి. తొలి డోస్‌ను ప్రైవేటు ఆస్పత్రుల్లో తీసుకున్నవారికి ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకోవడం ఒక ప్రహసనంగా మారింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది.
‘టీకా ఉత్సవ్‘లో భాగంగా 18-44 ఏళ్ళ వయస్కులకు మే నెల 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తగినన్ని డోసులు లేవన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొదలుపెట్టలేదు. అందరికీ ఉచితంగానే ఇస్తామని సీఎం ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. నేరుగా వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచే కొనుగోలు చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇంకా గాడిలో పడలేదు. దీంతో ఉచిత వ్యాక్సిన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది సమాధానంలేని ప్రశ్నగానే మిగిలిపోయింది. మే నెల 31వ తేదీ వరకూ కేవలం సెకండ్ డోస్ మాత్రమే ఇస్తామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ తేల్చి చెప్పేశారు. అప్పటిదాకా ఫస్ట్ డోస్ లేదనేది తేలిపోయింది. వ్యాక్సిన్ నిల్వలు ఎప్పుడు వస్తాయో, ఎన్ని డోసులు వస్తాయో అధికారులకు కూడా అంతుచిక్కడంలేదు.
విదేశీ దిగుమతులపైనే ఆశలన్నీ..
భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ కంపెనీల నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ డోసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. సుమారు నాలుగు లక్షల డోసులు రావాల్సి ఉంది. పేమెంట్ అయిపోయినా నిల్వలు ఇంకా చేతికందలేదు. ఒకవేళ వచ్చినా ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయి. ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలపడంతో ‘రెడ్డీస్ లాబ్’ ద్వారా సమకూర్చుకునేలా సంప్రదింపులు జరిపిన ప్రభుత్వానికి ఎంత స్టాక్ అందుతుందనేదానిపై స్పష్టత రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాల మేరకు సరఫరా సాధ్యం కాదని తేలిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మినహా మరో మార్గం లేకపోయింది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని, వీలైనంత తొందరగా అవసరానికి తగినంతగా దిగుమతి చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టాస్క్ ఫోర్సును కూడా ఏర్పాటు చేశారు. త్వరలో గ్లోబల్ టెండర్ ప్రక్రియ రోడ్కెక్కనుంది.
జూలైలోనే క్లారిటీ!
కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రారంభంలో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. కానీ తగినంత స్టాకు లేకపోవడంతో పరిమితులు ఏర్పడ్డాయి. కేటీఆర్ అంచనా ప్రకారం రాష్ట్రంలో 18-44 ఏళ్ళ వయస్కులకు ఉచిత టీకా పంపిణీ జూలై దాకా మొదలయ్యే అవకాశం లేదు. గ్లోబల్ టెండర్లు ఫైనల్ అయ్యి దిగుమతులు రాష్ట్రానికి చేరడాన్ని బట్టి నిర్దిష్ట యాక్షన్ ప్లాన్ మొదలవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌డీఏ అనుమతి లభించిన ఏ వ్యాక్సిన్ అయినా వాడవచ్చని కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ రెండు రోజుల క్రితం స్పష్టం చేయడంతో చైనాకు చెందిన సినోవాక్ మొదలు జాన్సన్, ఫైజర్ లాంటి అనేక రకాల టీకాలను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. చైనా తయారు చేసిన సినోవాక్ పట్ల రకరకాల వివాదాలు ఉన్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి గుర్తింపు ఇవ్వడంతో గ్లోబల్ టెండర్లను ఖరారు చేసే సమయంలో ఏయే వ్యాక్సిన్లు వస్తాయనేదానిపై క్లారిటీ వస్తుంది.
కేంద్ర ప్రభుత్వ కోటాలో పెరుగుదల, సీరం, భారత్ బయోటెక్, రెడ్డీస్ లాబ్ సంస్థలు ఎన్ని డోసుల్ని సప్లయ్ చేయగలుగుతాయో స్పష్టత వచ్చిన తర్వాత గ్లోబల్ టెండర్ ద్వారా ఎన్ని డోసుల్ని కొనుగోలు చేయాలనే అంశంలో క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం టెండరు దక్కించుకున్న సంస్థకు ఎన్ని డోసుల్ని ఆర్డర్ చేయాలో తేలిపోతుంది. అది అందించే స్టాక్‌ను బట్టి సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘ఉచిత వ్యాక్సిన్‘ ఎప్పటినుంచి ప్రారంభమవుతుందనేది ఖరారవుతుంది. ఈ ప్రహసనమంతా కొలిక్కి రావడానికి కనీసంగా రెండు నెలలు పట్టే అవకాశం ఉన్నందున జూలైలోనే టీకాల పంపిణీ లాంఛనంగా, ముమ్మరంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాల ప్రాథమిక అంచనా. కేటీఆర్ కూడా అదే భావనతో ఉన్నారు.