రాష్ట్రంలో భిన్న వాతావరణం.. IMD కీలక ప్రకటన

by Jakkula Mamatha |
రాష్ట్రంలో భిన్న వాతావరణం.. IMD కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రభావం చూపడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో నేడు(శనివారం) పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఏపీ వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల వర్షాలు పడుతున్న వడగాలుల తీవ్రత మాత్రం పరాకాష్టకు చేరింది. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అలాగే 73 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. విజయనగరం-10, పార్వతీపురం మన్యం-9,అల్లూరి సీతారామరాజు-1, కాకినాడ-2, తూర్పుగోదావరి-1, ఏలూరు-1, కృష్ణా-7, ఎన్టీఆర్-4, గుంటూరు-14, బాపట్ల-3, పల్నాడు 20, ప్రకాశం-1 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

అయితే.. రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులను ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచించారు.



Next Story