TRS కేడర్‌లో అసంతృప్తి.. వారికి ‘కోట్లు’ ఇచ్చి మాకేమీ ఇవ్వరా.?

by Anukaran |   ( Updated:2021-08-22 23:22:49.0  )
TRS కేడర్‌లో అసంతృప్తి.. వారికి ‘కోట్లు’ ఇచ్చి మాకేమీ ఇవ్వరా.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంచో చెడో ఒకరిని పట్టుకుని కాలం వెల్లదీస్తే ఏదో రోజు మంచి జరగుతుంది అన్న మాట చాలా మంది నోట వినిపిస్తుంది. కానీ, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందన్న వేదన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో, సోషల్ మీడియాలో తమ బాధను వెల్లగక్కుతూ కొంతమంది చేస్తున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వారికో న్యాయం..

ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృష్టి చేసిన తమకు మాత్రం పార్టీ నుంచి సరైన గుర్తింపు రావడం లేదని, ఫిరాయింపుదారులకు మాత్రం ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పోస్టుల తీరును పరిశీలిస్తే గులాబీ జెండా మోస్తున్న కార్యకర్తలు, నాయకుల్లో ఎంతటి నైరాశ్యం నెలకొందో అర్థం అవుతోంది. వాస్తవం ఎలా ఉన్నా బాహాటంగా జరుగుతున్న ప్రచారం వారిని మానసిక సంఘర్షణకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మే మొదటి వారం వరకు పార్టీలోనే ఉన్న వారికి ఏమీ లాభం చేకూరలేదని, ఆ తరువాత పార్టీలో చేరుతున్న వారికి ఇస్తున్న ప్యాకేజీలపై జరుగుతున్న ప్రచారంతో వారు నైరాశ్యానికి గురవుతున్నారు.

వేరే పార్టీకి వెళ్లి వస్తే..

హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంతో చాలామంది టీఆర్ఎస్ కేడర్‌లో అంతర్మథనం మొదలైంది. పార్టీతోనే కలిసి ఉంటే గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా లాభపడే పరిస్థితి లేదని, ఫిరాయిస్తేనే అన్నింటా బెనిఫిట్ పొందుతామన్న చర్చ కూడా సాగుతోందట. ఈటలతో బీజేపీలో చేరి తిరిగి టీఆర్ఎస్‌లో చేరినా బాగుండేదని, కనీసం కాంగ్రెస్ పార్టీలో చేరినా బావుండేందన్న డిస్కషన్ చేసుకుంటున్నారట హుజురాబాద్‌లోని టీఆర్ఎస్ కేడర్. ఇంతకాలం పార్టీలోనే కొనసాగినా, ఈటల రమ్మన్నా వెళ్లకుండా ఉండటం తమ తప్పేనని.. అలా వెళ్లి ఇలా వస్తే మనకూ అన్ని విధాలా లాభం జరిగేది కదా అని అనుకుంటున్నారట అక్కడి టీఆర్ఎస్ నాయకులు.

ఇంతకీ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టుల పరంపర కొనసాగుతోందో మీరూ చూడండి..

– హుజరాబాద్ నియోజకవర్గంలో ‘మే’ మొదటి వారంలో పార్టీ కోసం పని చేసే వారికి జీరో అమౌంట్..
– రెండవ వారం.. ఐదు లక్షలు
3 వారం.. 7 లక్షలు
4 వారం.. 10 లక్షలు

జూన్ మొదటి వారం 12 లక్షలు
2 వారం.. 15 లక్షలు
3 వారం.. 17 లక్షలు
4 వారం 20 లక్షలు

జూలై మొదటి వారం 22 లక్షలు
2 వారం.. 25 లక్షలు
3 వారం.. 27 లక్షలు
4 వారం.. 30 లక్షలు

ఆగస్టులో మొదటి వారం 40 లక్షలు
2 వారం.. 45 లక్షలు
3 వారం.. 50 లక్షలకి
లాస్ట్ వారం కోటికి..

సెప్టెంబర్..
1st..
2nd…
మరి ఓటర్‌కి ఎంత.?.

Advertisement

Next Story

Most Viewed