ఏం చేద్దాం.. ఎంఐఎంను వదిలేద్దామా!

by Anukaran |   ( Updated:2020-12-03 01:33:17.0  )
ఏం చేద్దాం.. ఎంఐఎంను వదిలేద్దామా!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంతకాలం టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి? ప్రతిపక్షం రూపంలో మిత్రపక్షంగా ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇకపైన కూడా కొనసాగుతుందా? జీహెచ్ఎంసీ మేయర్ సీటు విషయంలోనూ, అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయి? అనే చర్చ టీఆర్ఎస్‌లో మొదలైంది.

ఈ రెండు పార్టీలూ దోస్తులుగా ఉంటున్నాయని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఇకపై అనుసరించాల్సిన వ్యూహంపైనే ఇప్పుడు ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇదే స్నేహాన్ని కొనసాగించినట్లయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందని ఒక అభిప్రాయం, దూరం పెడితే మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో ముస్లిం ఓట్లు ఎలా? అనే అంతర్థనం వారిలో వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవడం అవసరం అనే చర్చలు మొదలయ్యాయి.

జీహెచ్ఎంసీ మేయర్ సీటుకు అవసరమైన స్థానాల్ని స్వంతంగా గెలవలేని పక్షంలో అదనంగా అవసరమయ్యే సంఖ్యను ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలని ఆలోచిస్తుండగా ఈ అంశాలు ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. ఎవరి సహకారం లేకుండా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుస్తుండగానే, ‘‘రెండు నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం… పాత బస్తీలోకి అడుగు పెట్టాలంటే అసదుద్దీన్ ఒవైసీ అనుమతి తీసుకోవాల్సిందే..’’లాంటి వ్యాఖ్యలు మజ్లిస్ నేతల నుంచి వినిపించాయని, ఈ పరిస్థితులలో ఆ పార్టీని దూరంగా ఉంచడమే మంచిదని కొందరు టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

నెత్తి మీద కూర్చుంటారని..

జీహెచ్ఎంసీ మేయర్ సీటు విషయంలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ మజ్లిస్ మద్దతు తీసుకుంటే నెత్తిమీద కూర్చుంటారని, టీఆర్ఎస్ ఆ పార్టీ చెప్పుచేతల్లో ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుందని మరికొందరు టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ నోటి వెంట “ఈసారి పాతబస్తీలో సైతం మా బలం పెంచుకుంటాం. గతంకంటే ఎక్కువ సీట్లు గెల్చుకుంటాం. మజ్లిస్ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోనూ మా అభ్యర్థులే గెలుస్తారు” లాంటి కామెంట్లు యధాలాపంగా వచ్చినవి కావని, మజ్లిస్ నేతల దూకుడుకు చెక్ పెట్టే ఉద్దేశంతో చేసినవేనని, ఇదే భవిష్యత్తులో కార్యాచరణగా కూడా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆ నేతలు వ్యక్తం చేశారు.

ఒకవేళ మేయర్ సీటుకు బలం సరిపోక బయట నుంచి మద్దతు అవసరమని భావించిన పక్షంలో మజ్లిస్‌కు బదులుగా ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చన్న ఆలోచన కూడా టీఆర్ఎస్‌లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌కు చెందిన పన్నెండు మంది వచ్చి టీఆర్ఎస్‌లో చేరినట్లుగానే ఇప్పుడు మేయర్ విషయంలోనూ రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాన్ని ఒక సీనియర్ నేత వ్యక్తం చేశారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టడం పెద్ద ఇబ్బందేం కాదన్నది కూడా ఆ నేత ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారానికి ముందు వంద సీట్లు ఖాయమనుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు మేయర్ సీటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సంపాదిస్తే చాలన్న సాధారణ అభిప్రాయానికి వచ్చింది.

ముస్లిం ఓటర్లు ఏమవుతారో?

మజ్లిస్, టీఆర్ఎస్ దోస్తులన్న ప్రతిపక్ష పార్టీల అభిప్రాయానికి చెక్ పెట్టే విధంగా, ఎంఐఎంను వీలైనంత దూరంగా ఉంచాలనే నిర్ణయాన్నే టీఆర్ఎస్ తీసుకున్నట్లయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ముస్లిం ఓటర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మజ్లిస్ పోటీ చేయని చోట ముస్లిం ఓటర్లు టీఆర్ఎస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని, ఫలితంగా అది ప్రతిపక్షాలకు లాభిస్తుందన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. మజ్లిస్‌ను దూరం చేసుకుంటే, మిగిలిన పార్టీల తరహాలోనే అది కూడా ఉంటుందని, ఈ నిర్ణయం కారణంగా ముస్లిం ఓటర్లు మాత్రం టీఆర్ఎస్‌తోనే అంటిపెట్టుకుని ఉండే వ్యూహాన్ని అనుసరించక తప్పదన్న ప్రతిపాదనలు కూడా టీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్నాయి.

‘సెక్యులర్’ అని ఎంతగా చెప్పుకున్నా మజ్లిస్‌తో అంటకాగుతుండడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని, మజ్లిస్‌ను ఆ పార్టీలన్నీ మతతత్వ పార్టీగా గుర్తిస్తున్నందున రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారేంత వరకు దూరంగా ఉంచడమే ఉత్తమం అనే అభిప్రాయానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకంటే బీజేపీయే ప్రధాన ప్రత్యర్థిగా ముందుకొచ్చినందన దాన్ని ఢీకొనడానికి మజ్లిస్‌తో సంబంధాలను వీలైనంత తగ్గించుకోవడం ద్వారా విమర్శలకు తావులేకుండా ఉండొచ్చునని, ప్రజలకు చేరువకావచ్చునన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్-మజ్లిస్ బంధంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed