కరోనా కట్టడికి ఇంకా ఏం చేద్దాం?

by Shyam |
కరోనా కట్టడికి ఇంకా ఏం చేద్దాం?
X

సీఎంకు క్షేత్రస్థాయి వివరాలను ఇచ్చిన సీఎస్, డీజీపీ

కొత్తగా 15 పాజిటివ్ కేసులు, ఒకరి మృతి

దిశ, న్యూస్ బ్యూరో :

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్ పరిస్థితులు, పాజిటివ్ కేసులు పెరగడానికి కారణాలు, అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించడం తదితర అనేక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే జిల్లాల కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలతో పాటు అదనంగా ప్రత్యేక అధికారులను అక్కడికి పంపించి వీలైనంత త్వరగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వీరిద్దరూ ఈ మూడు జిల్లాల్లోని క్షేత్రస్థాయి వివరాలను సీఎంకు వివరించారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే కరోనా కట్టడి అదుపులోకి వస్తుందనే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.

కొత్తగా 15 పాజిటివ్ కేసులు, ఒకరి మృతి

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. ఇందులో పది కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటే మరో మూడు సూర్యాపేటలో, రెండు గద్వాలలో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 943కు చేరుకుంది. కరోనా కారణంగా మరొకరు బుధవారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 24కు పెరిగింది. సీఎస్, డీజీపీ సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో పర్యటిస్తున్న రోజునే ఆ రెండు చోట్ల ఐదు కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.

Tags: Telangana, Corona, CM KCR, Review with CS and DGP, Positive, Suryapet, Gadwal

Advertisement

Next Story