యూజీసీ సూచనల ప్రకారం డిగ్రీ తరగతులు

by Shyam |
Degree College
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ తరగతుల నిర్వహణ అంశంపై యూజీసీ సూచనలు విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సీట్ల భర్తీ ప్రక్రియను ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెరిట్, రిజర్వేషన్లను అమలు చేస్తూ విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. అక్టోబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి తగిన ఏర్పాట్లను చేస్తోంది. రాష్ట్రంలో 6 యూనివర్సిటీల పరిధిలోని 1,060 కళాశాలలో 4.25 లక్షల సీట్లను భర్తీ చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు. ఈ నెల 24 వరకు మొదటి విడుతలో దరఖాస్తులను స్వీకరించనుండగా ఇప్పటి వరకు ప్రవేశాల కోసం 1.53లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ఏడాది విద్యాసంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్, పరీక్షల మార్గదర్శకాలను యూనివర్సింటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసింది. నూతన అకాడమిక్ కాలెండర్ ప్రకారం డిగ్రీ ఫస్టియర్ తరగతులను అక్టోబర్ 1 నుంచి ప్రారభించాలని సూచించారు. ఇందుకోసం అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలలను సెప్టెంబర్ 30లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. 2021 అక్టోబర్ 1 నుంచి 2022 జులై 31 వరకు క్లాసులు, బ్రేక్స్, పరీక్షల నిర్వహణ, సెమిస్టర్ బ్రేక్‌లను ఉన్నత విద్యామండలి ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది అకాడమిక్ ఇయర్‌ను స్పెషల్ కేసుగా పరిగణించి విద్యార్థుల నుంచి ఎలాంటి క్యాన్సలేషన్, మైగ్రేషన్ ఫీజులు వసూలు చేయవద్దని యూనివర్సిటీలను యూజీసి కోరింది.

అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్న ఉన్నతవిద్యామండలి

ఈ ఏడాది డిగ్రీ తరగతులను అక్టోబర్ 1 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతోంది. కరోనా కారణంగా అకాడమిక్ ఇయర్ నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైనప్పటికీ యూజీసీ సూచనల ప్రకారం తరగతులను నిర్వహిచేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఈ నెల 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టారు. జులై 15 వరకు మొదటి విడుత దరఖాస్తులను అవకాశం కల్పించిన ప్రభుత్వం విద్యార్థుల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ నెల 24 వరకు గడువును పెంచారు. ఇప్పటి వరకు దోస్త్ వెబ్‌సైట్‌కు 1,53,552 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,41,158 మంది విద్యార్థులు ఫీజును చెల్లించారు. 1,05,469 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. సీట్ల భర్తీ విషయంలో రాష్ట్రంలోని రిజర్వేషన్లు పాటిస్తూ ఇంటర్ మీడియట్ లోని మెరిట్ ప్రకారం ప్రక్రియ చేపట్టనున్నారు.

రాష్ట్రంలో 4.25లక్షల సీట్ల భర్తీకి ఏర్పాట్లు

రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల పరిధిలోని 1,060 డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లను చేపట్టింది. డిగ్రీలోని అన్ని కోర్సులకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4.25 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు విడుతల్లో చేపట్టిన ప్రక్రియను సెప్టెంబర్ 31 నాటికి పూర్తి చేసి విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. అక్టోబర్ 1 నాటి పరిస్థితులకు అనుగుణంగా ఆన్ లైన్‌లో ఆఫ్ లైన్‌లో తరగతులను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఇంటర్ మీడియట్‌లో ఫీజులు చెల్లించిన 4.73లక్షల మంది విద్యార్థులు పాస్ కావడంతో డిగ్రీలో ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 1.80లక్షల మంది విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలు పొందగా ఈసారి అంతుకుమించి సీట్ల భర్తీకావచ్చని ఉన్నత విద్యామండలి భావించింది. ఇందుకు భిన్నంగా డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు.

Advertisement

Next Story

Most Viewed