'ఈటలను విమర్శించే స్థాయి, నైతిక హక్కు లేదు'

by Shyam |
ఈటలను విమర్శించే స్థాయి, నైతిక హక్కు లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను విమర్శించే స్థాయిగానీ, నైతిక హక్కుగానీ మంత్రులకు లేదని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌లకు ఈటెలను విమర్శించే స్థాయి లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దళితులను సీఎం చేస్తానని చెప్పి మాట మార్చిన కేసీఆర్… దళితులకు ఏం చేశాడని, మూడెకరాల భూమి పంపకం ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల గురించి ఎప్పుడు మాట్లాడని కొప్పుల ఈశ్వర్ .. ఇప్పడు ఎవరికోసం మాట్లాడుతున్నామని ప్రశ్నించారు.

కరీంనగర్ గుట్టలను మింగి అక్రమంగా వేల కోట్ల రూపాయలను కూడబెట్టడంతో పాటు ప్రక‌ృతి విధ్వంసం సృష్టించిన గంగుల కమలాకర్ ఎవరి మెప్పుకోసం మాట్లాడుతున్నాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన బోయినపల్లి వినోద్ కుమార్ ప్రోటోకాల్ కోసం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని తెచ్చుకున్నాడని, ఆయన ప్రజా నాయకుడైన ఈటలపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజలంతా ఈటల వెంట ఉన్నారన్నారు. కార్యక్రమంలో చిరంజీవి, నాగరాజు, నవీన్, భాస్కర్, రమేష్, రాహుల్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story