మానవ అక్రమ రవాణాకు ‘అడ్డుకట్ట’

by Sumithra |
మానవ అక్రమ రవాణాకు ‘అడ్డుకట్ట’
X

దిశ, క్రైమ్ బ్యూరో: తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, బెగ్గింగ్, రాగ్ పికింగ్, వెట్టి చాకిరీ నుంచి బాల కార్మికుల విముక్తి కల్పించేందుకు సైబరాబాద్ కమిషరేట్‌లో 2020 సెప్టెంబర్ 5న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌(ఏహెచ్ టీయూ)ను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలైలో నిర్వహించే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల్లోనూ ఈ విభాగం అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ 14 కేసులను నమోదు చేయగా, ఈ కేసులలో 32 మంది బాధితులను పోలీసులు రక్షించి, 76 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ 32 మందిలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట, కర్నాటక రాష్ట్రాలతో పాటు న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

కొన్ని కేసులు ఇలా..

కర్నూలు జిల్లాకు చెందిన రెండున్నర సంవత్సరాల బాలిక నగరంలోని చార్మినార్ ప్రాంతంలో 2005లో తప్పిపోయింది. స్థానిక పోలీసులు గుర్తించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆ తప్పిపోయిన బాలికను బోడుప్పల్ హోమ్ కు తరలించగా, అక్కడి నుంచి మియాపూర్ లోని వివేకానంద హోమ్ కు తరలించాల్సి వచ్చింది. ఇటీవల వివేకానంద హోమ్ ను సందర్శించిన సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు అక్కడ కన్పించిన 17 ఏండ్ల బాలికను చార్మినార్ ప్రాంతంలో తప్పిపోయిన అమ్మాయిగా సందేహం వ్యక్తం చేశారు. వెంటనే చార్మినార్ ప్రాంతంలో 2005లో తప్పిపోయిన కేసులన్నింటినీ పరిశీలించి వెంటనే కర్నూలు జిల్లాలోని తల్లిదండ్రులను పిలిపించి ఫొటోలు చూపించారు. తమ బిడ్డగానే గుర్తించడంతో తప్పిపోయిన 16 సంవత్సరాలకు ఆ అమ్మాయిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 14 సంవత్సరాల యువతి తప్పిపోయినట్టుగా స్థానిక మీరట్ జిల్లా గంగానగర్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. షేర్ చాట్ ద్వారా పరిచయమైన రాజస్థాన్ యువకుడు హస్రం మీనా (17) అనే యువతిని మీరట్ నుంచి రాజస్థాన్ తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం వీరిద్దరూ తెలంగాణలో తలదాచుకున్నట్టు కనుగొన్నారు. దీంతో మైనర్ బాలికను రక్షించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం పోలీసులను యూపీ పోలీసులు కోరారు.

అయితే, నిందితుడు హస్రం మీనా ఆ యువతితో సైబరాబాద్ పరిధిలో ఉన్నట్టు తేలడంతో హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. నిందితుడు హస్రం మీనా తన ఆనవాళ్లను కనిపెట్టకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్ లోని ఐఎంఈఐ నెంబర్లను గుర్తించకుండా 9 ఫోన్లు, నెంబరు కనుక్కోడానికి వీలులేకుండా ఉండేలా 30 సిమ్ కార్డులను మార్చినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని యూపీ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed