కరెంట్ అఫైర్స్: అక్టోబర్-2022

by Harish |   ( Updated:2022-10-17 15:02:51.0  )
కరెంట్ అఫైర్స్: అక్టోబర్-2022
X

అంతర్జాతీయం

ఉక్రెయిన్ పై ఐక్యరాజ్య సమితిలో తీర్మానం:

ఉక్రెయిన్ ప్రాంతాలైన దొనెట్స్క్, లుహాన్స్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను కలిపేసుకోవడానికి రష్యా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది.

సెప్టెంబర్ లో రష్యా చేసిన ప్రజాభిప్రాయ సేకరణ తతంగాన్ని ఐక్యరాజ్య సమితి ఖండించింది.

దీనికి సంబంధించి ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని ఐరాస 143-5 ఓట్ల భారీ తేడాతో ఆమోదించింది.

ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా తక్షణం, బేషరతుగా వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేసింది.

193 సభ్య దేశాలున్న ఐరాసలో 35 దేశాలు ఈ తీర్మానంపై ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.

ఉత్తర కొరియా, బెలారస్, సిరియా, నికరాగువా దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రష్యాకు తోడుగా నిలిచాయి.

భారత్, చైనా, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు.

తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల్లో సౌదీ అరేబియా, యూఏఈ, బ్రెజిల్ ఉన్నాయి.

జపాన్ రాకెట్ ఎప్సిలాన్ -6 విఫలం:

జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) ప్రయోగించిన ఎప్సిలాన్ - 6 రాకెట్ విఫలమైంది.

8 ఉపగ్రహాలతో నింగిలోకి పయనమైన కొద్ది సేపటికే ఇబ్బందులు తలెత్తడంతో ఈ రాకెట్ ను సెల్ఫ్ డిస్ట్రక్షన్ కమాండ్ తో పేల్చివేశారు.

జపాన్ రాకెట్ విఫలం కావడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి.

రాకెట్ లో రెండు ప్రైవేటు ఉపగ్రహాలు కూడా ఉన్నాయి.

వాణిజ్య ఉపగ్రహాలను ఎప్సిలాన్ మోసుకెళ్లడం ఇదే తొలిసారి.

డబ్ల్యూ హెచ్ ఓ లో అమెరికా ప్రతినిధిగా డా.వివేక్ మూర్తి:

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) కార్యనిర్వాహక మండలిలో అమెరికా ప్రతినిధిగా భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి (45)ని అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు.

అమెరికాలో సర్జన్ జనరల్ గా ఉన్నత హోదాలో ఉన్న డా.మూర్తి ఆ విధులు కొనసాగిస్తూనే కొత్త భాధ్యతలు నిర్వహిస్తారని శ్వేత సౌధం ప్రకటించింది.

=========================

జాతీయం

నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం:

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

హిమాచల్ లోని అంబ్ అందౌరా నుంచి ఢిల్లీ మధ్య తిరిగే ఈ రైలు బుధవారాలు మినహా వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది.

ఈ రైలు 385 కి.మీ దూర ప్రయాణంలో అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్ సాహెబ్ స్టేషన్లలో ఆగుతుంది.

హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాని ప్రారంభించినవి:

1. నాలుగో వందే భారత్ రైలు

2. హరోలీ వద్ద రూ. 1,900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన భారీ ఔషధ పరిశ్రమ శంకుస్థాపన చేశారు.

3. ఊనాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని జాతికి అంకితం చేశారు.

4. చంబాలోని పలు ప్రాజెక్టులతో పాటు రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

5. 3,125 కి.మీల మేర గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ఉద్దేశించిన పీఎం గ్రామ్ సడక్ యోజన -3ను మోదీ ప్రారంభించారు.

50వ సీజేఐగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్:

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ పేరును సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్ సిఫార్సు చేశారు.

జస్టిస్ డి.వై చంద్రచూడ్ నవంబర్ 9న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈయన నవంబర్ 10, 2024 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.

44 ఏళ్ల క్రితం ఈయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలలు ఆ పదవిలో కొనసాగారు.

ఈ పదవిలో సుదీర్ఘ కాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.

దేశంలో తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా మోఢేరా:

దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా గుజరాత్ లోని మోఢేరా గ్రామం రికార్డుల్లోకెక్కింది.

ప్రధాని పర్యటనలో స్వరాష్ట్రానికి విచ్చేసిన ప్రధాని మోడీ అధికారిక ప్రకటన చేశారు.

మెహసాణా జిల్లాలోని మోఢేరా గ్రామం పేరు చెప్తే ఇన్నాళ్లూ అక్కడి ప్రఖ్యాత సూర్య దేవాలయమే గుర్తుకొచ్చేదని, ఇక పై సోలార్ ఊరుగానూ ఖ్యాతి కెక్కుతుందని ప్రధాని పేర్కొన్నారు.

మోఢేరాలో ప్రభుత్వ, నివాస భవనాలు అన్నింటిపై సౌర పలకలను అమర్చారు.

వీటి ద్వారా పగలు విద్యుత్తు అందుతుంది.

భారత వృద్ధి రేటు 6.8 శాతమే:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది.

వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని జులైలో..8.2 శాతం కావచ్చని జనవరిలో ఐఎంఎఫ్ అంచనా వేసింది.

2021-22 లో వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది.

ఐఎంఎఫ్ విడుదల చేసిన వార్షిక వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ లో ఈ అంశాలను వెల్లడించింది.

అంచనా కంటే ఎక్కువగా బలహీనతలు కనిపించడం, అంతర్జాతీయ గిరాకీ మరింత తక్కువగా ఉండటంతో వృద్ధి రేటు అంచనాలు తగ్గించేందుకు కారణాలుగా ఐఎంఎఫ్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 48 ఏళ్లలో 69 శాతం తగ్గిన వన్యప్రాణులు:

విశ్వవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 1970 తో పోలిస్తే 2018లో 69 శాతం తగ్గిందని ప్రపంచ వన్యప్రాణులు, జీవరాశుల నివేదిక - 2022 పేర్కొంది.

ఉష్ణమండల ప్రాంతాల్లో వెన్నెముక జీవుల క్షీణత చాలా అధికం అని నివేదిక వెల్లడించింది.

లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో వీటి తగ్గుదల మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

అక్కడ కొన్ని చోట్ల ఈ క్షీణత సరాసరి 94 శాతంగా ఉందని పేర్కొంది.

ఆఫ్రికాలో 66 శాతం, ఆసియాలో 55 శాతం తగ్గుదల నమోదైందని తెలిపింది.

వైమానిక దళం కోసం ప్రత్యేక ఆయుధ వ్యవస్థ:

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 90వ వార్షికోత్సవాలు చండీగఢ్ లో ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు.

ఐఏఎఫ్ కోసం ఆయుధ వ్యవస్థ శాఖ (వెపన్ సిస్టమ్ బ్రాంచ్)ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ప్రకటించారు.

స్వాతంత్య్రం అనంతరం దేశంలో ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

మురుగు నీరు మూడొంతులు నదుల్లోకే: నీతి ఆయోగ్

దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీటిలో కేవలం 28 శాతం మాత్రమే శుద్ధి అవుతోందని ..మిగిలిన 72 శాతం నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా.. నివేదికలో పేర్కొంది.

పట్టణ ప్రాంతాల్లో నీటి వినియోగం పెరిగిందని తెలిపింది.

=================================

రాష్ట్రాలు:

విశ్వాస పరీక్షలో నెగ్గిన పంజాబ్ ప్రభుత్వం:

విశ్వాస పరీక్షలో భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం నెగ్గింది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్మేలు 91 మందితో పాటు మరో ఇద్దరు కూడా ప్రభుత్వంపై విశ్వాసాన్ని ప్రకటించడంతో 93 ఓట్లతో తీర్మానం నెగ్గింది.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ విశ్వాస తీర్మానాన్ని సీఎం సెప్టెంబర్ 27న శాసనసభలో ప్రవేశపెట్టారు.

జల్ జీవన్ మిషన్ లో తెలంగాణకు 5వ ర్యాంకు:

జాతీయ జల్ జీవన్ మిషన్ పథకం అమలులో తెలంగాణకు 5వ ర్యాంకు దక్కింది.

మొత్తం పనితీరులో గత ఏడాది కంటే 4 పాయింట్లు మెరుగుపరుచుకున్నా ర్యాంకులో కిందటేడాది మాదిరిగా 5 వ స్థానంలో ఉంది.

తొలి 4 స్థానాలను పుదుచ్చేరి, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, గోవాలు కైవసం చేసుకున్నాయి.

క్రమం తప్పకుండా నీటి సరఫరా చేసిన విభాగంలో తెలంగాణకు 1వ ర్యాంకు దక్కింది.

============================

అవార్డులు:

డాక్టర్ అందెశ్రీకి సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారం:

తొలితరం ప్రజా వాగ్గేయకారులు సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారం - 2022 ను లోక కవి డాక్టర్ అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ కవి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ ప్రకటించారు.

అక్టోబర్ 15న హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య కళా నిలయంలో అందెశ్రీకి ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు.

=================================

పుస్తకావిష్కరణ:

ఇంజనీర్డ్ ఇన్ ఇండియా.. ఫ్రమ్ డ్రీమ్స్ టు బిల్డింగ్ బిలియన్ డాలర్.. పుస్తకావిష్కరణ:

నేటి ప్రపంచంలో నమ్మకమే అన్నింటికంటే ముఖ్యమని, దాన్ని బీవీఆర్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ ..జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.

సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ మోహన్ రెడ్డి రాసిన ఇంజనీర్డ్ ఇన్ ఇండియా..ఫ్రమ్ డ్రీమ్స్ టు బిల్డింగ్ బిలియన్ డాలర్ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.

=========================

స్పోర్ట్స్ :

తెలంగాణ బాక్సర్ కు స్వర్ణం:

జాతీయ క్రీడల్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పసిడి సొంతం చేసుకున్నాడు.

సర్వీసెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నిజామాబాద్ కుర్రాడు పురుషుల 57 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు.

గుజరాత్ లో 36వ జాతీయ క్రీడలు ముగిశాయి.

2023లో 37వ జాతీయ క్రీడలను నిర్వహించే గోవాకు క్రీడల పతాకాన్ని అందించారు.

Advertisement

Next Story